Delta Air Lines: అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం తర్వాత ఫ్లైట్ ఎక్కాలంటేనే చాలా మంది భయపడిపోతున్నారు. దీనికి తోడు ఇటీవల ఫ్లైట్స్ లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు ఆ భయాలను మరింత పెంచుతున్నాయి. తాజాగా అమెరికాలో ఓ ఫ్లైట్ కు విచిత్ర పరిస్థితి ఎదురైంది. విమానం గాల్లో ఉండగా దాని రెక్క ఊడి నేలపై పడింది. దీంతో ల్యాండింగ్ సమయంలో ఏం జరుగుతోందన్న ఆందోళనలు మెుదలయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే..
అమెరికాలోని నార్త్ కరోలినాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి హార్ట్స్‌ఫీల్డ్- జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు నుంచి డెల్టా ఫ్లైట్ ఎయిర్ లైన్స్ కు చెందిన నెంబర్ 3247 బోయింగ్ విమానం (Delta flight 3247) నార్త్ కరోలీనాలోని రెలీ-డర్హం ఎయిర్ పోర్టు (Raleigh-Durham International Airport)కు బయల్దేరింది. గమ్యానికి సురక్షితంగా ఎయిర్ పోర్ట్ వచ్చినప్పటికీ ల్యాండింగ్ సమయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. విమానం రెక్కలోని అత్యంత కీలకమైన ఫ్లాప్ కు చెందిన భాగం.. ఊడి రోడ్డు మార్గంలో పడింది.
విమానంలో 109 మంది ప్రయాణికులు
ఇది గమనించని పైలెట్ విమానాన్ని డర్హం ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. అత్యంత కీలకమైన విమాన రెక్క భాగం నేలపై పడినప్పటికీ.. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విమానం ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత దాని రెక్క భాగం ఊడిపోయి ఉండటాన్ని ఎయిర్ పోర్ట్ సిబ్బంది గమనించారు. తనిఖీలు చేయగా ప్రయాణ సమయంలోనే అది ఊడిపోయి మార్గం మద్యలో నేలపై పడినట్లు గుర్తించారు. ఘటన సమయంలో విమానంలో 109 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: UP Shocking: భర్త చనిపోయాక మరుదులతో ఎఫైర్.. అత్తను లేపేసి చివరికి?
ఎఫ్ఏఏ స్పందన ఇదే
విమానం రెక్క ఊడిన విషయాన్ని డెల్టా ఎయిర్ లైన్స్ సంస్థ.. ఎఫ్ఏఏ (FAA) దృష్టికి తీసుకెళ్లింది. దానిపై పరిశీలన అనంతరం ఎఫ్ఏఏ స్పందించింది. రెలీలోని ఓ మోటార్‌వేలో వింగ్ ఫ్లాప్‌లోని విడిభాగం దొరికిందని వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. దీనిపై డెల్టా ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చింది. కాగా ఫ్లాప్స్ అనే విమానం రెక్క వెనక భాగంలో ఉంటాయి. ల్యాండింగ్ టేకాఫ్ సమయంలో విమానం లిఫ్ట్, డ్రాగ్ ను నియంత్రించడానికి ఇవి ఉపయోగపడతాయి.