Bhadradri Kothagudem: ఏజెన్సీ ప్రాంతంలో డెంగ్యూ జ్వరాలు ఇప్పటికే ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. ఈ వర్షాకాలం సీజన్లో డెంగ్యూ(Dengue) జరాలకు ప్రజలు గురై ఇబ్బందులు పడుతూ ఆర్థిక భారానికి గురవుతుంటారు. ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం పినపాక అశ్వాపురం మండలాల్లో అనేక సంఖ్యలో ప్రజలు డెంగ్యూ జ్వరంతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇదే ఆసరా చేసుకున్న ప్రైవేట్ ఆస్పత్రి(Private Hospitals) నిర్వహకులు ధనార్జనే ధ్యేయంగా రోగులనుంచి డబ్బులను వసూలే పనిగా పెట్టుకుని నిరుపేదల జేబులకు చిల్లులు పెడుతున్నారు. మరోవైపు రక్త పరీక్షల(Blood Test) పేరుట మరింత డబ్బులను దండుకుంటున్నారు.
వీటన్నిటిని అరికట్టాలంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. కానీ వైద్యులు ఆస్పత్రుల్లో ఉన్నప్పటికీ మెరుగైన సేవలు అందించడంలో మాత్రం విఫలమవుతున్నట్లు ప్రజల నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఈ దుస్థితిలో గవర్నమెంట్ ఆసుపత్రిలో చూపించుకోలేక ప్రైవేట్ ఆస్పత్రిలో డబ్బులు ఖర్చు పెట్టలేక ఏం చేయాలో పాలు పోక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్కార్ ఆస్పత్రు(Govt. Hospital)ల్లో సరైన వైద్యులు ఉన్నప్పటికీ అందుకు తగ్గ చికిత్స లేకపోవడం, అదే విధంగా నాణ్యమైన మందులు అందకపోవడం రోగులకు శాపంగా మారింది.
డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందే విధానం
ఎడిస్ ఈజీ ఫ్లై అనే దోమకాటుతో మానవ శరీరంలోకి ప్రవేశించి వైరస్ వలన వచ్చే జ్వరాన్ని డెంగ్యూ వ్యాధి కిందకు పరిగణిస్తారు. ఈ వ్యాధి సోకిన నాలుగైదు రోజుల్లోనే మానవ శరీరంలోని ప్లేట్లెట్స్ తక్కువకు పడిపోతాయి. ఇక ఇక్కడే అసలైన ఆయుధం వైద్యులకు దొరుకుతుంది. ప్లేట్లెట్స్(Platelets) పేరు చెప్పి అందిన కాడికి డబ్బులను దండుకోవడమే డాక్టర్లు చేసే ప్రథమ పని. ఇవి ఎడిస్ ఈజీ ఫ్లై అనే దోమరకం ఇంటి పరిసరాల్లోనే ఎక్కువగా నివసిస్తుంది. వర్షం నీరు, వాడి వదిలేసిన నీరు, పూల కుండీలు, కాళీ ప్లాస్టిక్ డబ్బాల వంటి వాటిలో చేరి నిల్వ ఉంటాయి. నిల్వ ఉన్న కొంతకాలంలోనే లార్వా ద్వారా వేల దోమలను ఉత్పత్తి చేస్తాయి. ఈ దోమలు ఆయా ప్రాంతాల్లో స్వైర విహారం చేసి ప్రజలపై దాడి చేస్తాయి. ఇలా ఈ రకమైన దోమ కుట్టడంతో మానవునికి ఉన్నట్టుండి ఒక్కసారిగా విపరీతమైన జ్వరం సోకుతుంది.
Also Read: Raghunandan Rao: మాపై అనవసరంగా నిందలు మోపారు..వెంటనే క్షమాపణ చెప్పాలి.. ఎంపీ రఘునందన్ రావు
101 డిగ్రీల నుంచి 105 డిగ్రీల వరకు జ్వరం పెరిగిపోతుంది
ఎడిస్ ఈజీ ఫ్లై దోమ కుట్టిన తర్వాత 101 డిగ్రీల నుండి 105 డిగ్రీల వరకు జ్వరం పెరిగిపోతుంది. దీంతో విపరీతమైన నొప్పులు, తలనొప్పి, విపరీతమైన జ్వరంతో చాలా నీరసించిపోతారు. తీవ్రమైన నడుము నొప్పి, కండ్లుమండడం, ఒళ్ళు నొప్పులు, కడుపులో తిప్పడం, వాంతులు, కూడి ఉదర భాగం పై నొప్పి, ఉష్ణోగ్రత పెరిగినప్పుడు తీవ్ర నీరసం, తల తిరగడం, ముక్కు నుంచి రక్తస్రావం, మలవిసర్జన నల్లగా అవడం, దోమ కుడితే ఎర్రగా చుక్కల వంటివి ఏర్పడడం డెంగ్యూ లక్షణాలు. డెంగ్యూతో పాటు రక్తపోటు తక్కువకు పడిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.
వైద్యం
రక్తపోటు(Blood pressure) బాగా పడిపోయిన సమయంలో రోగి తీవ్రంగా వాంతులు చేసుకుంటారు. నోటి ద్వారా ద్రవాలు తీసుకోవడం కష్టంగా ఉన్న ప్లేట్లెట్స్ సంఖ్య 50 వేల కన్నా తక్కువగా పడిపోయిన ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. జ్వరం తగ్గిన తర్వాత 48 గంటల నుండి 72 గంటల వరకు రోగిని పరిశీలనలో ఉంచి ప్లేట్లెట్స్ సంఖ్య క్రమంగా పెరిగే వరకు ఆసుపత్రిలోనే అబ్జర్వేషన్‌లో ఉంచాలి. బొప్పాయి, దానిమ్మ, కివి, పండ్ల రసాల జ్యూస్ తాగితే రక్త కణాలు పెరిగే అవకాశం సులభంగా ఉంటుంది.
నివారణ చర్యలు
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇంటి పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు లేదంటే వాడిన తర్వాత వెళ్ళిపోయే నీరు ఎక్కడా కూడా ఆగకుండా చూసుకోవాలి. డెంగ్యూ వ్యాధికి టీకా వంటి మందు లేదు. జ్వరం లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా వైద్యుని సంప్రదించాలి. వైద్యుడి సూచనల ప్రకారం రక్త పరీక్షలు చేయించుకోవాలి. ద్రవపదార్థాలు, కాచి చల్లార్చిన నీరు, కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్ కలుపుకొని త్రాగాలి. డెంగ్యూ జ్వరం ఉన్నప్పుడు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. అలాగే దోమలను పారద్రోలే రసాయనాలను వాడి నీరు నిలువ లేకుండా చేసుకోవాలి. వర్షాకాలం నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీకి అంతే లేకుండా పోతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించాలని ఏజెన్సీ ప్రాంత ఆదివాసి ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Also Read: Banakacharla Project: బనకచర్లపై పార్టీల కుస్తీ.. క్రెడిట్ కోసం తాపత్రయం