Street Lights Maintenance: జీహెచ్ఎంసీ గ్రేటర్ ప్రజలకు అందించే అత్యవసర సేవల్లో అతి ముఖ్యమైంది స్ట్రీట్ లైట్ మెయింటనెన్స్. కానీ, 30 సర్కిళ్ల పరిధిలో చాలా చోట్ల స్ట్రీట్ లైట్ మెయింటనెన్స్ అధ్వాన్నంగా మారిందన్న ఫిర్యాదులు అందుతున్నా, ఎప్పటికప్పుడు తాత్కాలికంగా పరిష్కరిస్తున్నారేగానీ పూర్తిస్థాయి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్ట్రీట్ లైట్ మెయింటనెన్స్ కు సంబంధించి జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు లైట్ తీసుకున్నారా అనే ప్రశ్నకు వారు వ్యవహరిస్తున్న తీరు నిజమేనని సమాధానంగా అనిపిస్తున్నది. అసలే వర్షాకాలం, స్ట్రీట్ లైట్ల మెరుగైన నిర్వహణ కోసం చర్యలు చేపట్టాల్సిన జీహెచ్ఎంసీ (GHMC) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ గడిచిన గడిచిన 4 నెలల్లో నలుగురు అధికారులను మార్చింది.
Also Read: HMDA Scam: రూ.3 వేల కోట్ల ప్రభుత్వ భూమి ప్రైవేట్‌కు ధారాదత్తం!
తొలుత స్ట్రీట్ లైట్ మెయింటనెన్స్ బాధ్యతలను అదనపు కమిషనర్ సత్యనారాయణ (Satyanarayana) నిర్వహిస్తుండగా, ఆ తర్వాత ఆ బాధ్యతలను ఐఏఎస్ ఆఫీసర్ కిల్లు శివకుమార్ (Siva kumar) నాయుడు చూశారు. కొద్దిరోజులకే వేణుగోపాల్ రెడ్డికి అప్పగించి టెండర్ల ప్రక్రియ తుది దశలో ఉన్నప్పుడు ఆయన్ను సైతం తప్పించి, ఆ బాధ్యతలను ఇప్పటికే అనేక రకాలుగా అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇంజినీరింగ్ విభాగానికి కట్టబెట్టారు. ముఖ్యంగా 2017లో ప్రైవేట్ కాంట్రాక్టర్ల పరిధిలో ఉన్న స్ట్రీట్ లైట్ మెయింటనెన్స్ ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) కు అప్పగించారు.
ఏ మాత్రం మార్పు రాలేదు
కానీ అప్పగించిన ఏడేళ్లలో ఈఈఎస్ఎల్ ఘోరంగా విఫలమైంది. కనీసం మరమ్మతులకు సంబంధించి బఫర్ కోటా కూడా మెయింటేన్ చేయకపోవడంతో 2022 నుంచి అప్పటి కమిషనర్ లోకేశ్ కుమార్, (Lokesh Kumar) మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పలుసార్లు హెచ్చరించినా, ఈఈఎస్ఎల్ పనితీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. సంబంధిత విభాగానికి సకాలంలో జీతాలు చెల్లించకపోవడం, గత ఏప్రిల్ మాసం చివరి కల్లా అగ్రిమెంట్ ముగియడంతో జీహెచ్ఎంసీ లైట్ల మెయింటనెన్స్ కోసం ప్రత్యామ్నాయ విధానాన్ని సమకూర్చుకోవాలని భావించింది. ఈ క్రమంలో టెండర్ల ప్రక్రియ చేపట్టే సరికి ఎలాగో మూడు నెలల సమయం పడుతుందని, అందులో రెండు నెలల పాటు స్ట్రీట్ లైట్ మెయింటనెన్స్ బాధ్యతను ఈఈఎస్ఎల్ కు అప్పగిస్తూ స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసింది.
రెండు అంశాల ప్రాతిపదికన టెండర్లు
అధికారులు రెండు రకాల మెయింటనెన్స్ విధానానికి టెండర్లను ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యారు. ఇండివిజువల్ లుమినార్ కంట్రోల్ (ఐఎల్‌సీ), లుమినార్ కంట్రోల్ యూనిట్(ఎల్‌సీయూ)ల పద్దతిన టెండర్లను ఆహ్వానించగా, పేరుగాంచిన పిలిప్స్, క్రాంప్టెన్ గ్రీవ్స్ వంటి సంస్థలు ముందుకొచ్చి, ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెన్స్ (ఈఓఐ)లను సమర్పించాయి. వీటిని పరిశీలించి, టెండర్లను ఖరారు చేసే లోపే అదనపు కమిషనర్ వేణుగోపాల్ రెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో టెండర్ల ప్రక్రియ అర్థాంతరంగా ఆగిపోయినట్టయింది.
నేటికీ స్ట్రీట్ లైట్ల నిర్వహణపై ప్రతి రోజు వందల సంఖ్యలో ఫిర్యాదులొస్తున్నాయి. వీటిని పరిష్కరించేందుకు అధికారులు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప, ఆధునిక టెక్నాలజీతో కూడిన సరికొత్త విధానాన్ని సమకూర్చుకోలేకపోవడం గమనార్హం. అసలే వర్షాకాలం ఇప్పటికే అంతంతమాత్రంగా స్ట్రీట్ లైట్ మెయింటనెన్స్ కొనసాగుతున్నది. అధికారులు టెండర్ల ప్రక్రియ ఎపుడు పూర్తి చేస్తారో, ఆధునిక మెయింటనెన్స్ విధానాన్ని ఎప్పుడు అమల్లోకి తెస్తారో అని ప్రజలు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
Also Read: Ranga Reddy district: పట్టాదారుడికి తెలియకుండానే భూ మార్పిడి!