HMDA Scam: హెచ్ఎండీఏలో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ భూముల జాబితాలో ఉన్న 31,736 చదరపు గజాల భూమిని ప్రైవేట్ పార్టీకి ధారాదత్తం చేశారు.ఇందులో హెచ్ఎండీఏ (HMDA) కమిషనర్‌గా పని చేసిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, (Arvind Kumar) ప్లానింగ్ డైరెక్టర్‌గా పని చేసిన శివ బాలకృష్ణలు ప్రధాన పాత్ర వహించారంటూ న్యాయవాది రామారావు ఇమ్మనేని లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.
Also Read: Bandi Sanjay: బీసీకి బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇచ్చే దమ్ముందా?.. బండి సంజయ్ కీలక వాఖ్యలు!
ప్రభుత్వ భూమికి ఎసరు
గతంలో రాజేంద్రనగర్ (Rajendranagar) మండలంలో ఉన్న భూమి ప్రస్తుతం గండిపేట మండలం పరిధిలోని పుప్పాలగూడలో పరిధిలోకి వచ్చింది. 31,736 గజాల ఈ భూమి 2005 జూన్ 6న ప్రభుత్వానిదని గుర్తిస్తూ జీవో (నెంబర్ 1092) జారీ అయ్యింది. దీని ప్రకారం ఈ భూములకు సంబంధించి క్రయ విక్రయాలు, అభివృద్ధి, బదలాయింపు, కేటాయింపులు జరపడం నిషిద్ధం. అయితే, ఈ భూముల్లో గ్రౌండ్ ప్లస్ 41 అంతస్తుల చొప్పున బహుళ అంతస్తుల భవనాలను ఏ, బీ బ్లాకులుగా కట్టడానికి ఐఏఎస్ అరవింద్ కుమార్, (Arvind Kumar) శివ బాలకృష్ణ తదితరులు 2021, జూన్ 18న డీ రఘురామిరెడ్డి ఎండీగా ఉన్న డీఎస్ఆర్ ఎస్ఎస్ఐ బిల్డర్స్ అండ్ డెవలపర్స్‌కు అనుమతులు ఇచ్చారు.
ఈ క్రమంలో నిర్మాణాల పనులు ప్రారంభించిన రఘురామిరెడ్డి ఇప్పటివరకు సెల్లార్లు, 23 అంతస్తుల వరకు భవనాలను కట్టేశారు కూడా. అదే సమయంలో వందల సంఖ్యలో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వేల కోట్ల రూపాయల అవినీతి బాగోతం నడిచిందని న్యాయవాది రామారావు ఇమ్మనేని లోకాయుక్త జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి ధర్మాసనానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read: Ranga Reddy district: పట్టాదారుడికి తెలియకుండానే భూ మార్పిడి!