Prada Sandals: ఇటలీకి చెందిన లగ్జరీ బ్రాండ్ కంపెనీ ‘ప్రాడా’ (Prada), భారతదేశంలో శతాబ్దాలుగా విశిష్ట గుర్తింపు ఉన్న ఐకానిక్ ‘కొల్హాపురి లెదర్ చెప్పులు’ డిజైన్‌ను కాపీ కొట్టింది. భారతీయ వారసత్వ చేతివృత్తుల కళాకారుల నుంచి ప్రేరణ పొంది తయారు చేసింది. ఆ చెప్పులను ఇటీవల మిలన్‌లో జరిగిన ‘మెన్స్ స్ప్రింగ్/సమ్మర్ 2026’లో ఆవిష్కరించింది. భారతదేశంలో కేవలం రూ.400 వరకు మాత్రమే ఉండే ఈ చెప్పుల ధర ఏకంగా రూ.1.2 లక్షలుగా ప్రాడా కంపెనీ ప్రకటించింది. అయితే, కొల్హాపురి చెప్పుల డిజైన్‌ను పోలి ఉండడంపై భారతీయులు తీవ్ర విమర్శలు గుప్పించారు.
కాలి వేళ్లు బయటకు కనిపించే విధంగా (ఓపెన్-టోడ్) ఉండే ఈ లెదర్ చెప్పుల డిజైన్ సాంస్కృతిక మూలాలను గుర్తించకుండా ఉపయోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలోని చేతివృత్తుల కళాకారులు శతాబ్దాలుగా తయారు చేస్తున్న కొల్హాపురి చెప్పులను పోలి ఉన్నాయంటూ మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రాడా సాంస్కృతిక హస్తకళల దోపిడీకి పాల్పడిందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయ హస్తకళాకారులకు క్రెడిట్ ఇవ్వలేదని, కనీసం బ్రాండ్ ఉత్పత్తి వెనుక భారతీయ సాంప్రదాయ ప్రేరణ తీసుకున్నట్టుగా చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read this- Shefali Jariwala: షెఫాలి మృతికి అసలు కారణం ఇదేనా!
ప్రాడా స్పందన ఇదే
భారతీయుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండడంపై ప్రాడా కంపెనీ స్పందించింది. మిలన్ స్ప్రింగ్ షోలో ఆవిష్కరించిన లెదర్ శాండిల్స్‌కు భారతీయ చేతివృత్తుల కళాకారులను నుంచి ప్రేరణ పొందినట్టు అంగీకరించింది. ‘‘భారతదేశంలోని మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లో తయారు చేసే సాంప్రదాయ భారతీయ చెప్పుల నుంచి ప్రేరణ పొందిన చెప్పులు మిలన్‌లో జరిగిన స్ప్రింగ్ షోలో ప్రదర్శించామని ఒప్పుకుంటున్నాం. బాధ్యతాయుతమైన డిజైన్ పద్ధతులకు, సాంస్కృతిక కళల పరిరక్షణకు స్థానిక భారతీయ చేతివృత్తుల సంఘాల ప్రతినిధులతో సంప్రదింపులు ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాం. గతంలో ఇతర చెప్పుల కలెక్షన్ల విషయంలో వ్యవహరించిన విధంగానే, చేతివృత్తులకు సరైన గుర్తింపు లభించేలా ప్రయత్నిస్తాం. ఈ అంశంపై మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం’’ అని పేర్కొంది. భారతీయ చేతివృత్తులవారికి సరైన గుర్తింపు ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో ప్రాడా కంపెనీ ఈ ప్రకటన చేసింది.
Read this- Woman Missing: ఆమె ఏమైంది?.. అమెరికాలో భారతీయ పెళ్లి కూతురు మిస్సింగ్
కొల్హాపురి చెప్పుల స్పెషాలిటీ ఏమిటి?
కొల్హాపురి చెప్పులు 12వ శతాబ్దం కాలం నాటివి. చేతితో తయారు చేసే తోలు చెప్పులివి. తరతరాలుగా ఈ చెప్పులు తయారవుతున్నాయి. ప్రధానంగా మహారాష్ట్రలో సాంప్రదాయ పద్ధతుల్లో వీటిని తయారు చేస్తున్నారు. 2019లో, కొల్హాపురి చెప్పులకు భౌగోళిక సూచిక (GI) ట్యాగ్ దక్కింది. ఒక ఉత్పత్తికి ఒక నిర్దిష్ట ప్రాంతంతో ఉన్న ప్రత్యేక సంబంధాన్ని గుర్తించి, స్థానిక కళాకారులు, వారి సాంప్రదాయ విజ్ఞానం, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించేందుకు ఈ విధంగా జీఐ ట్యాగింగ్ ఇస్తారు. జీఐ ట్యాగ్ లభిస్తే డిజైన్ వారసత్వ విలువ చెక్కుచెదరకుండా ఉంటుంది. ఎవరూ దుర్వినియోగపరచకుండా రక్షణగా ఉంటుంది. ప్రాడా తాజా చర్యలు జీఐ ట్యాగ్‌ను ఉల్లంఘించడమేనని చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేరణ పొందినట్టు ప్రారంభంలోనే క్రెడిట్ ఇవ్వలేదని మండిపడుతున్నారు. ప్రాడాపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ, అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం సాధ్యంకాదని న్యాయ నిపుణులు చెప్పారు. జీఐ ట్యాగ్ ఉల్లంఘన కింద కోర్టులో పిల్ వేసినా అంత బలంగా ఉండకపోవచ్చని సీనియర్ న్యాయవాది ఒకరు పేర్కొన్నారు.