Viral News: కట్టుకున్న భర్తకు ఓ భార్య నమ్మక ద్రోహం చేసింది. ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్ గీసి అంతమొందించింది. కళ్లలో కారం కొట్టి.. కాలు మెడపై పెట్టి తొక్కితొక్కి కర్కశంగా హత్య చేసింది. అత్యంత క్రూరమైన ఈ హత్యోదంతం కర్ణాటకలో వెలుగు చూసింది. తుమకూరు జిల్లాలోని తిప్తూరు తాలూకా కడశెట్టిహళ్లి గ్రామంలో ఈ ఘటన (Viral News) జరిగింది. జూన్ 24న సుమంగళ అనే మహిళ, 50 ఏళ్ల వయసున్న తన భర్త శంకరమూర్తిని హతమార్చింది. ప్రియుడితో కలిసి భర్తను చంపేసి, మృతదేహాన్ని దాదాపు 30 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి ఒక బావిలో పడేసింది.
ఒక ఫామ్‌హౌస్‌లో ఒంటరిగా నివసిస్తున్న శంకరమూర్తిపై ఇంతటి దారుణానికి పాల్పడ్డారు. తిప్తూరులోని కల్పతరు గల్స్ హాస్టల్‌లో వంటమనిషిగా పనిచేస్తున్న నిందితురాలు, కరదలుసంటే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే, తన శారీరక సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్త శంకరమూర్తిని ఎలాగైనా హత్య చేయాలని ఆమె నిర్ణయించుకుంది. అందుకు, ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. నేరం జరిగిన రోజున, సుమంగళ తన భర్త కళ్లలో కారం పొడి చల్లింది. ఆ తర్వాత కర్రతో దారుణంగా కొట్టింది. ఆపై భర్త మెడపై కాలువేసి నొక్కి దారుణంగా చంపిందని పోలీసులు మీడియాకు వెల్లడించారు.
Read this- Israel USA: వామ్మో.. ఇజ్రాయెల్ కోసం అమెరికా ఎంత ఖర్చుపెట్టిందో బయటపడింది
హత్య చేసిన మృతదేహాన్ని ఒక గోనె సంచిలో పెట్టారని, సుమారుగా 30 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి తురువేకెరె తాలూకాలోని దండనిశివర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక పొలంలోని బావిలో పడేశారని పోలీసులు వివరించారు. ఈ ఘటనపై నోనవినకెరె పోలీస్ స్టేషన్‌లో తొలుత మిస్సింగ్ కేసు నమోదయింది. అయితే, దర్యాప్తులో మృతుడు శంకరమూర్తి మంచంపై కారం పొడి కనిపించడం, మంచంపై పెనుగులాడిన ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. భార్య సుమంగళను విచారించారు. విచారణకు పిలిచి ప్రశ్నించారు. ఆమె మొబైల్ కాల్ డేటా విశ్లేషించడంతో అసలు విషయం బయటపడింది. హత్య కుట్రను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. చివరికి నిందితురాలు నేరాన్ని ఒప్పుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.
Read this- Newton 4th law: ‘న్యూటన్ ఫోర్త్ లా’ ఇదేనట.. క్రేజీ పోస్ట్ వైరల్
కాగా, ఈ మధ్యకాలంలో భర్తలను చంపేస్తున్న భార్యల ఉదంతాలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. ప్రియుళ్లతో కలిసి చేస్తున్న హత్యలు వెన్నులో వణుకు పుటిస్తున్నారు. మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ కేసు యావత్ దేశాన్ని షాక్‌కు గురిచేసింది. లవర్ కోసం కట్టుకున్న భర్తను కిరాయి హంతకులకు డబ్బు ఇచ్చి సోనమ్ రఘువంశీ అనే యువతి హత్య చేయింది. మిస్సింగ్ నాటకం ఆడినప్పటికీ పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయాలు బయటపడ్డాయి. ఇక, ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఘటనలో తేజేశ్వర్ అనే సర్వేయర్‌ను నవ వధువు ఐశ్వర్య హత్య చేయించింది. పెళ్లైన నెల రోజులు కూడా గడవకముందే తన ప్రియుడు తిరుమల్‌రావుతో కలిసి కిరాయి హంతకుల సాయంతో హత్య చేయించింది. ఈ నెల 17న తేజేశ్వర్ కుటుంబ సభ్యులు మిస్సింగ్ అయినట్టు ఫిర్యాదు చేయగా, పోలీసులు రంగంలోకి దిగడంతో హత్య కుట్ర బయటపడింది. ఈ నెల 21న గాలేరు-నగరి కాల్వలో తేజేశ్వర్ మృతదేహాన్ని గుర్తించారు.