Reality Of Canada: డాలర్ డ్రీమ్‌తో చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అమెరికాను తొలి ప్రాధాన్య గమ్యస్థానంగా ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత రెండవ ఆప్షన్‌గా కెనడా వైపు అడుగులు వేస్తున్నారు. అయితే, కెనడాలో రియాలిటీ పరిస్థితులు (Reality Of Canada) ఎలా ఉన్నాయో అక్కడే ఉంటున్న భారతీయ యువతి ఒకామె కళ్లకు కట్టినట్టు చూపించింది.
కెనడాలో ఒక సాధారణ జాబ్ మేళాకు ఉద్యోగాల కోసం డజన్ల కొద్దీ భారతీయ, ఇతర విదేశీ విద్యార్థులు భారీ క్యూలైన్‌లో నిలబడి ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసింది. అప్లికేషన్లు పట్టుకొని విద్యార్థుల వరుసగా భారీ లైన్‌లో నిలబడి ఉండడం కనిపించింది. కెనడాలో అంతర్జాతీయ విద్యార్థులకు ఉద్యోగాల విషయంలో ఎంత పోటీ ఉందో ఆమె వివరించింది. విదేశాలలో సమృద్ధిగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, మెరుగైన జీవితానికి భరోసా గ్యారంటీ అని భావించే భారతీయుల అభిప్రాయాలు తప్పు అని ఆమె సూచించింది. ఊహలకు భిన్నంగా, కెనడాలో అనేక మంది అంతర్జాతీయ విద్యార్థులు సవాళ్లు ఎదుర్కొంటున్నారనేది వాస్తవికతను పేర్కొంది.
Read this- Israel USA: వామ్మో.. ఇజ్రాయెల్ కోసం అమెరికా ఎంత ఖర్చుపెట్టిందో బయటపడింది
‘‘గాయ్స్.. కెనడాలో చాలా జాబ్స్ ఉంటాయని, లైఫ్ సూపర్‌గా ఉంటుందని మీ ఫ్రెండ్స్, లేదా చుట్టాలు ఎవరైనా కలలు కంటుంటే వాళ్లకు ఒక్కసారి ఈ వీడియో చూపించండి’’ అని వీడియోలో యువతి పేర్కొంది. వీళ్లంతా ప్రయత్నిస్తున్న ఉద్యోగ అవకాశం ‘ప్రైమరీ ఇంటర్న్‌షిప్’ కోసమని, 5 నుంచి 6 మందిని మాత్రమే నియమించుకుంటారని, కానీ, పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చారని వివరించింది. ‘‘ఇదీ.. కెనడాలో వాస్తవిక పరిస్థితి. దీనికి మీరు సిద్ధంగా ఉంటే కెనడా రండి. లేదంటే, మనదేశంలోనే ఉండడం మంచిది’’ అని సూచించింది. ‘‘విదేశాలలో జీవితమంటే ఎల్లప్పుడూ ఊహాలోకంలా ఉండదు. కొన్నిసార్లు పొడవైన క్యూలైన్లలో కూడా ఉండాల్సి ఉంటుంది’’ అనే ఆమె క్యాప్షన్ ఇచ్చింది.
యువతి షేర్ చేసిన ఈ వీడియో క్లిప్ గంటల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. కెనడాలో ఉద్యోగావకాశాల లేమి, పెరుగుతున్న నిరుద్యోగాన్ని స్పష్టంగా చాటి చెప్పింది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ వీడియో ఒక అలర్ట్ కూడా పంపించినట్టు అయింది. కొందరు వ్యక్తులు ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘‘నేను చూసిన మొదటి జెన్యూన్ వీడియో ఇదే. జనాలకు నిజం తెలియజేశారు. కొంతమంది ఇన్‌ఫ్లూయెన్సర్లు తప్పుడు సమాచారంలో యువతిను తప్పుదోవ పట్టిస్తున్నారు. కష్టాల్లో పడేస్తున్నారు’’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. ‘‘టొరంటోలో కూడా ఇదే పరిస్థితి ఉంది. మనుగడ సాగించేందుకు చిన్న ఉద్యోగాల కోసం కూడా చాలా కాలం ఎదురుచూడాల్సి వస్తోంది’’ అని ఓ వ్యక్తి పేర్కొన్నాడు. నిజాలు తెలుసుకునే వరకు కొందరు కెనడాను అవకాశాల గడ్డగా భావిస్తూనే ఉంటారని వ్యాఖ్యానించారు.
Read this- Newton 4th law: ‘న్యూటన్ ఫోర్త్ లా’ ఇదేనట.. క్రేజీ పోస్ట్ వైరల్
అయితే, కొందరు వ్యక్తుల స్పందనలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘‘కెనడాలో ఉద్యోగాల పొందడం కష్టమనేది నిజమే. అయితే, సరైన నైపుణ్యాలు ఉంటే ఉద్యోగం పొందవచ్చు’’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. ఉద్యోగాలు ఉన్నాయి. ఇదేమీ అతిశయోక్తి కాదు. ఎక్కడ వెతకాలో తెలుసుకోవాలి’’ అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ‘‘”వాంకోవర్‌లో ఉద్యోగాలు ఉన్నాయి. సమస్య ఏంటంటే నైపుణ్యాలు లేకపోవడమే. ఉద్యోగాలకేం కొదవలేదు. మైక్రోసాఫ్ట్, అమెజాన్, లులులెమన్, బీసీ హైడ్రో, టెలస్, ఫోర్టిస్‌బిసి, వాంకోవర్ కోస్టల్ హెల్త్ వంటి కంపెనీలు ఎల్లప్పుడూ నియామకాలు జరుపుతూనే ఉంటాయి. ఈ విధంగా ఒక నగరాన్ని లేదా దేశాన్ని నిందించడం సరికాదు. సరైన నైపుణ్యాలు ఉండాలి’’ అని ఓ యువకుడు పేర్కొన్నాడు. కెరీర్ ప్రారంభ స్థాయిలోనే ఉద్యోగాలకు పోటీ ఉంటుందని, అనుభవం, నైపుణ్యాలు సంపాదిస్తే విలువైన వ్యక్తులుగా మారిపోతారని మరో వ్యక్తి రాసుకొచ్చారు.
https://www.instagram.com/reel/DLWEQQWPbt9/?utm_source=ig_web_button_share_sheet