Badi Bata Program: రంగారెడ్డి జిల్లాలో గతంలో మూతబడిన పాఠశాలలు కాంగ్రెస్(Congress) ప్రభుత్వంలో ఈ విద్యాసంవత్సరం తిరిగి తెరుచుకున్నాయి. జీరో అడ్మిషన్ల కారణంగా గతంలో స్కూళ్లు మూతబడగా అక్కడే విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ చేపట్టి పునః ప్రారంభించారు. వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న ప్రభుత్వం ఈసారి బడి బాటలో విద్యార్థుల నమోదును పెంచి సక్సెస్ అయింది. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లాలో 26 పాఠశాలలు ఈ సంవత్సరం యథావిధిగా కొనసాగుతున్నాయి. విద్యార్థుల చేరికతో ఆయా పాఠశాలలు కళకళలాడుతున్నాయి.
పంచాయతీకో బడి
జిల్లాలో మొత్తం 1,309 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రైమరీ పాఠశాల(Primary School)లు 880, యుపిఎస్(UPS) పాఠశాలలు 180, హైస్కూల్స్ 249 ఉన్నాయి. జిల్లాలో కొత్త పంచాయతీలు ఏర్పాటు అయినప్పటికీ చాలా చోట్ల పాఠశాలలు లేవు. ‘డిపెప్’ విధానం అమలులోకి వచ్చాక ప్రతి కిలోమీటరుకు ఒక పాఠశాల ఉండాలనే నిబంధనతో జిల్లాలో గతంలో భారీ స్థాయిలో కొత్త పాఠశాలలను ఏర్పాటు చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల సంఖ్య తగ్గడంతో జిల్లాలో చాలా వరకు పాఠశాలలు మూతబడ్డాయి. పాఠశాలల మూతతో విద్యార్థులు దూర ప్రాంతానికి వెళ్లి చదువుకోవాల్సి వస్తోంది.
Also Read: Medchal district: భారీ శబ్ధాలు దుమ్ము ధూళితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి.. ఎక్కడంటే!
అయితే ప్రస్తుత ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలో పాఠశాలల బలోపేతానికి చేపడుతున్న చర్యలతో విద్యార్థుల తల్లిదండ్రులలోనూ మార్పులు వచ్చాయి. తమ పిల్లలను స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్న నిర్ణయానికి చాలామంది వచ్చారు. దీంతో గ్రామ పంచాయతీకో బడి ఉండాలని, మూత బడ్డ పాఠశాలలను తెరవాలన్న ప్రభుత్వ సంకల్పం సైతం సులువుగానే నెరవేరింది.ఈ క్రమంలోనే ఈ విద్యాసంవత్సరం 26 పాఠశాలలను రీ ఓపెనింగ్(Schools Ree Opening) చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంధర్ రావు తెలిపారు. బడి బాట సైతం సక్సెస్ కావడంతో ఆయా పాఠశాలల్లో విద్యార్థులు సైతం చేరడంతో ఉపాధ్యాయులు బోధనను సైతం మొదలుపెట్టారు.
తెరుచుకున్న పాఠశాలలు ఇవే
ఆమన్‌గల్ మండలంలోని దయ్యాల బోర్డు తండ, గౌరారం, సంకటోన్ పల్లి, చేవెళ్ల మండలంలోని నారాయణ దానగూడ, కందుకూరు మండలంలోని పంతుల గూడ తండ, కొందుర్గు మండలంలోని అయోధ్యాపూర్ తండ, చెక్కలోని గూడ, కొత్తూరు మండలంలోని అక్కివాని గూడ, ఎల్‌ఆర్కే తండ, తిమ్మాపూర్ రైల్వే స్టేషన్, మాడ్గుల మండలంలోని కుబ్యా తండ, నర్సంపల్లి, నెల్లికొండ తండ, పెద్ద మాడ్గుల, తోడేలు గుండు తండ, మహేశ్వరం మండలంలోని అభిబ్ల్ గూడ, మంచాల మండలంలోని కొరివి తండ, ఎల్లమ్మ తండ, మొయినా బాద్ మండలంలోని చిన్న షాపూర్, నందిగామ మండలంలోని మంచాన్ పహాడ్, మొదలు గడ్డ తండ, తాళ్ల గూడ, షాబాద్ మండలంలోని మంచంపల్లి తండ, యాచారం మండలంలోని బొల్లిగుట్ట తండ, ఎరగుళ్ల తండ, మంతన్ గౌడ్ పాఠశాలలను రీ ఓపెన్ చేశారు.
Also Read: Illegal Sand Transportation: జోరుగా సాగుతున్న ఇసుక మాఫియా.. పట్టించుకోని అధికారులు