Jeff Bezos Wedding: ప్రపంచ కుబేరుల్లో ఒకరు, ఈ-కామర్స్, టెక్ దిగ్గజమైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 61 ఏళ్ల వయసులో తిరిగి వివాహ బంధంలో (Jeff Bezos Wedding) అడుగుపెట్టారు. తన ప్రేయసి, మాజీ న్యూస్ ప్రజెంటర్ లారెన్ శాంచెజ్‌ను (55) ఆయన శుక్రవారం పెళ్లి చేసుకున్నారు. ఇటలీలోని వెనిస్ నగరంలో అత్యంత అట్టహాసంగా పెళ్లి వేడుకలు జరిగాయి. బెజోస్ సన్నిహితులు, పలువురు ప్రపంచ సంపన్నులు, సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ జాబితాలో ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్, లియోనార్డో డికాప్రియో, టామ్ బ్రాడీ, కైలీ, కెండల్ జెన్నర్, బిల్, మెలిండా గేట్స్, సిడ్నీ స్వీనీ, కిమ్ కర్దాషియన్, ఓప్రా విన్‌ఫ్రే, ఓర్లాండో బ్లూమ్, అమెరికన్ ఫుట్‌బాల్ ప్లేయర్ టామ్ బ్రాడీ, గాయకుడు ఉషర్, జోర్డాన్ రాణి రానియా వంటి పలువురు ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. మొత్తం 200 మందికిపైగా వీఐపీలు విచ్చేశారు. వెనిస్‌లోని శాన్ జార్జియో మాగ్గియోర్ ద్వీపంలో పెళ్లి జరగగా, ప్రత్యేక బోట్లపై అతిథులు ద్వీపానికి విచ్చేశారు. గ్రాండ్ కెనాల్‌పై ఉన్న 16వ శతాబ్దపు కాలం నాటి విలాసవంతమైన అమన్ హోటల్‌లో బెజోస్, శాంచెజ్ బస చేశారు.
Read this- S-400 Air Defence Systems: రష్యాతో భారత్ గేమ్ ఛేంజింగ్ డీల్.. ఇక పాక్, చైనాలకు చుక్కలే!
95 ప్రైవేట్ జెట్లు
బెజోస్-లారెన్ శాంచెజ్ వివాహ వేడుక కోసం ఏకంగా 95 ప్రైవేట్ జెట్లను ఉపయోగించినట్టుగా కథనాలు వెలువడుతున్నాయి. పెద్ద పెద్ద నౌకలను కూడా ఉపయోగించారు. అయితే, ఇంత పెద్ద ఎత్తున విమానాలు, నౌకలు వినియోగించడంతో కర్బన ఉద్గారాలు పెరిగిపోతున్నాయని స్థానికులు, పర్యావరణవేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్న టూరిస్టుల ప్రభావంతో వెనిస్ నగరం ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుందని, ఇలాంటి వేడుకలు మరింత దుష్ప్రభావాన్ని చూపుతున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, నగరానికి భారీ ఆదాయం సమకూరుతుందని కొందరు వాదిస్తున్నారు. జెఫ్ బెజోస్ పెళ్లితో వెనిస్ నగరంలో భారీగా వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయని కొందరు వ్యాపారులు చెబుతున్నారు. జెఫ్ బెజోష్ -శాంచెజ్ ఈ వివాహంతో నగరానికి సుమారుగా ఒక బిలియన్ యూరోల (దగ్గరదగ్గరగా రూ. 9,100 కోట్లు) ఆదాయం లభిస్తుందని ఒక అంచనాగా ఉంది. శనివారం చారిత్రక పోర్టు ‘ఆర్సెనేల్’లో జరిగే గ్రాండ్ పార్టీతో పెళ్లి సంబరాలు ముగిసిపోతున్నాయి.
కాగా, పెళ్లి ఫొటోలను లారెన్ శాంచెజ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒకరి చేయి ఒకరు పట్టుకుని నవ్వుతూ ఇద్దరూ కనిపించారు. పెళ్లికి హాజరైన అతిథులు నూతన జంటను ఉత్సాహపరుస్తూ కనిపించారు. నూతన వధూవరులు ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దుస్తుల కోసం ఏకంగా మిలియన్ల డాలర్లు వెచ్చించినట్టు తెలుస్తోంది. కాగా, జెఫ్ బెజోస్, లారెన్ శాంచెజ్‌ల మధ్య బంధం ఇదివరకే బహిర్గతం అయింది. మే 2023లో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు.
Read this- Shefali Jariwala Death: బిగ్ బాస్ నటి సడెన్ డెత్.. అసలేం జరిగిందో చెప్పేసిన సెక్యూరిటీ గార్డ్!