Rath Yatra 2025: ఒడిశాలోని పూరీలో జగన్నాథుడి రథయాత్ర (Puri Jagannatha Rath Yatra 2025) శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. రథయాత్రను వీక్షించేందుకు భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో పూరీ నగరం భక్త జనసంద్రాన్ని తలపించింది. ఇసుకేస్తే రాలదేమో అనేంతలా భక్తులు విచ్చేశారు. గరుడ ధ్వజం ఉన్న రథంలో జగన్నాథుడు, సోదరుడు బలరాముడు తాళధ్వజ రథంలో, సోదరి సుభద్ర పద్మధ్వజ రథంలో మూడు వేర్వేరు రథాలపై ఊరేగింపుగా బయలుదేరారు. దేవతామూర్తుల జన్మస్థలమైన ‘గుండిచా’ ఆలయానికి రథాలను తీసుకెళ్లారు. ముగ్గురు దేవతా మూర్తులు అక్కడ వారం పాటు విశేష పూజాసేవలు అందుకుంటారు. ఆ తర్వాత జగన్నాథ ఆలయానికి తిరిగి వెళతారు. దేవతా మూర్తుల ఊరేగింపు కోసం తయారు చేసిన రథాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జగన్నాథుడు కొలువు తీరిన రథం అన్నింటికన్నా ఎత్తుగా ఉంది. మిగతా రెండూ కాస్త చిన్నగా ఉన్నాయి. రథాలకు రంగురంగుల వస్త్రాలు, అలంకరణలు వేటికవే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Read this- Health Tips: ఎనర్జీ డ్రింక్స్‌పై పచ్చినిజాలు వెలుగులోకి!
లక్షలాది భక్తుల మధ్య రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుక కోసం కేంద్ర సాయుధ పోలీసు బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. ఎనిమిది కంపెనీలకు చెందిన 10,000 మంది భద్రతా సిబ్బందిని భక్తుల భద్రత కోసం మోహరించారు. అదానీ గ్రూప్ అధినేత, బిలియనీర్ గౌతమ్ అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ శుక్రవారం పూరీలో ‘ప్రసాద సేవ’ను ప్రారంభించింది. తొమ్మిది రోజుల రథోత్సవానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యే భక్తుల కోసం ప్రసాదం సేవలు అందించనుంది. పూరీలో భక్తుల కోసం శుభ్రమైన, పోషక ఆహారాన్ని అందించేందుకు ‘ప్రసాదం సేవ’ ప్రారంభించామంటూ ఎక్స్ వేదికగా గౌతమ్ అదానీ శుక్రవారం వెల్లడించారు. పవిత్ర రథయాత్రలో సేవ చేసుకునే సౌభాగ్యం తమకు దక్కిందని ఆయన వ్యాఖ్యానించారు. లక్షలాది మంది భక్తులకు నిజాయితీగా, భక్తితో సేవలు అందించడానికి అదానీ కుటుంబం అంకితభావంతో పనిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
9 రోజుల ఉత్సవం
పూరీ జగన్నాథ రథయాత్ర ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవోపేతంగా మొదలైంది. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీ క్షేత్రానికి తరలి వచ్చారు. 10-12 లక్షల మంది భక్తులు వచ్చి ఉంటారని ఒడిశా పోలీసులు అంచనా వేశారు. పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు ‘జై జగన్నాథ’ అంటూ నినాదాలు చేశారు. కాగా, ప్రతి ఏడాది ఆషాడ మాసం శుక్లపక్ష విదియ రోజున పూరీ జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. ఇది తొమ్మిది రోజుల ఉత్సవం. తొలి రోజున జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి ప్రధాన ఆలయం నుంచి రథాలపై ఊరేగింపుగా గుండిచా ఆలయానికి చేరుకుంటారు. 12వ శతాబ్దానికి చెందిన గుండిచా ఆలయం స్వామి వారు జన్మించిన స్థలంగా భక్తులు విశ్వాసిస్తున్నారు. పూరీ జగన్నాథుడి రథయాత్ర ప్రస్తావన బ్రహ్మ, పద్మ పురాణాలలో ఉంది. సోదరి సుభద్ర కోరిక మేరకు జగన్నాథుడు, అన్నయ్య బలభద్రుడితో కలిసి రథంపై బయలుదేరారని పురాణాలు చెబుతున్నాయి.
Read this- Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ జెన్యూన్ రివ్యూ
పూరీ జగన్నాథుడు శ్రీకృష్ణ పరమాత్ముడి స్వరూపం. సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రలతో కలిసి ఆయన ఒకే పీఠంపై పూజలు అందుకోవడం ఇక్కడ విశిష్టత. ఈ విధంగా అన్నాచెల్లెళ్లను ఒకేచోట కొలిచే క్షేత్రం మరొకటి లేకపోవడం విశేషం. నల్లని రూపంలో జగన్నాథుడు, బలభద్రుడు తెల్లగా, సుభద్ర పసుపురంగులో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ కారణంగానే జగన్నాథుడికి నీలమాధవుడని పిలుస్తారు. ప్రతి ఏటా ఊరేగింపుగా పుట్టిల్లైన గుండిచా ఆలయానికి వెళ్లి, పది రోజులు పూజలందుకున్నా ఏకాదశి నాటికి తిరిగి ప్రధానాలయానికి వెళతారు. తిరుగు ప్రయాణాన్ని ‘బాహుదా యాత్ర’ అని పిలుస్తారు.