Mallu Ravi: కొత్త పీసీసీ క్రమశిక్షణ కమిటీ తొలి సమావేశం గురువారం జరిగిందని, రేపు (శనివారం) మరోసారి సమావేశం నిర్వహించి వరంగల్ వివాదంపై నిర్ణయం తీసుకుంటామని ఎంపీ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. గురువారం గాంధీభవన్‌లో మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. క్రమశిక్షణ కమిటీ సమావేశంలో పార్టీలోని సమస్యలను ఎలా పరిష్కరించాలనే దానిపై విధివిధానాలను ఖరారు చేశామని చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన రాగి శ్రీనివాస్‌పై ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. ఉమ్మడి వరంగల్ నేతల మధ్య ఉన్న వివాదంపై శనివారం మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలపై కూడా సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు.
అయితే, పటాన్‌చెరుకు చెందిన కాట శ్రీనివాస్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి అంశం తమ కమిటీ ముందుకు రాలేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో గందరగోళం సృష్టించే ఏ స్థాయి నాయకులపైనా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవితపై మల్లు రవి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. “కవిత కంటే పెద్ద అవినీతిపరులు ఎవరూ లేరు,” అని ఆయన వ్యాఖ్యానించారు. ఆమె చేసిన ఘనకార్యం వలనే బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు నాశనమయ్యాయని ఆరోపించారు. కవిత కారణంగానే ఆమ్ ఆద్మీ డిప్యూటీ సీఎం కూడా జైలుకు వెళ్లారని, ఆ ఘనత కవితకే దక్కిందని ఆయన ఎద్దేవా చేశారు.
Also Read: Telangana: త్వరలో ఎంఈఎంయూ రైళ్లు అందుబాటులోకి వస్తాయి.. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్