Ali Khamenei: ఇజ్రాయెల్‌తో యుద్ధం ముగిసిన తర్వాత ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేని (Ali Khamenei) తొలిసారి స్పందించారు. ఇజ్రాయెల్‌పై విజయం సాధించామని గురువారం ఆయన ప్రకటించారు. ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్న అమెరికాకు గట్టి చెంపదెబ్బ తగిలిందని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఖమేనీ ప్రసంగాన్ని ఆ దేశ ప్రభుత్వ టీవీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా జరిపిన వైమానిక దాడులపై ఖమేనీ మాట్లాడారు. అమెరికా దాడులతో పెద్దగా నష్టం జరగలేదని, అగ్రరాజ్యం పెద్దగా సాధించింది ఏమీలేదని ఖమేనీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రెండు దేశాల మధ్య ఘర్షణలో కలగజేసుకునేటప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నైపుణ్యంతో వ్యవహరించాలని సూచించారు. ‘‘అమెరికా ప్రభుత్వంపై ఇరాన్ సాధించిన విజయానికి అభినందనలు తెలియజేస్తున్నాను. జియోనిస్ట్ పాలన పూర్తిగా నాశనం అవుతుందనే భయంతో అమెరికా ప్రభుత్వం నేరుగా యుద్ధంలోకి ప్రవేశించింది. ఇజ్రాయెల్‌ను కాపాడుకునేందుకు అమెరికా యుద్ధంలోకి దూకింది. కానీ, ఏమీ సాధించలేకపోయింది. అమెరికా చెంపపై ఇస్లామిక్ రిపబ్లిక్ గట్టి దెబ్బ కొట్టింది. ఈ ప్రాంతంలో అమెరికా కీలక స్థావరాలలో ఒకటైన అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై దాడి చేసి నష్టం కలిగించాం’’ అని ఎక్స్‌లో ఖమేనీ పేర్కొన్నారు.
Read this- Tulbul project: పాక్‌పై భారత్ ‘తుల్‌బుల్’ అస్త్రం!
‘‘గొప్పదేశమైన ఇరాన్‌కు నా అభినందనలు తెలియజేయడం అవసరమని నేను భావిస్తున్నాను. మొదటగా నకిలీ జియోనిస్ట్ పాలనపై విజయం సాధించినందుకు కంగ్రాచ్యులేషన్స్. ఇస్లామిక్ రిపబ్లిక్ దెబ్బల కారణంగా జియోనిస్ట్ పాలన దాదాపు కూలిపోయింది. నాశనమైందనే విషయాన్ని కోలాహలంతో చెబుతున్నాను. భవిష్యత్తులో ఇరాన్‌పై ఎలాంటి దురాక్రమణకు పాల్పడినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’’ అని ఖమేనీ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ జరిపిన దాడులు గొప్ప విజయమని ఆయన అభివర్ణించారు. ఇరాన్‌ను మళ్ళీ రెచ్చగొడితే ఈ దాడులు పునరావృతం కావొచ్చని స్పష్టం చేశారు.
Read this- Rajnath Singh: చైనా వేదికగా రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఖమేనీ ఎక్కడ ఉన్నారు?
అమెరికా దాడుల్లో తమ అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఇరాన్ ప్రభుత్ వర్గాలు అంగీకరించిన మరుసటి రోజే ఖమేనీ తాజా ప్రకటన వెలువడడం గమనార్హం. అణుకేంద్రాలు ధ్వంసం కావడంతో అమెరికా నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ కోరింది. మరోవైపు, ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా ఖమేనీ దాదాపు వారం రోజులుగా కనిపించడం లేదు. ఆయన ఎక్కడ ఉన్నారో, భద్రతపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. బహిరంగ వేదికలపై ఆయన ఇంతవరకు కనిపించలేదు. అయితే, ఖమేనీని రహస్య భూగర్భ బంకర్‌కు తరలించారని సన్నిహితులు చెబుతున్నారు. హత్యాయత్నాల నుంచి కాపాడేందుకు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌కు దూరంగా ఉంచుతున్నారని ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం పేర్కొంది. ఖమేనీని చంపవద్దంటూ ట్రంప్ వ్యాఖ్యానించినప్పటికీ, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాత్రం ఖమేనీ అంతమే నిజమైన ముగింపు అని హెచ్చరించడంతో ఖమేనీని రహస్య ప్రదేశంలో దాచిపెట్టారు.
కాగా, జూన్ 13న ఇజ్రాయెల్ -ఇరాన్ మధ్య సైనిక ఘర్షణ మొదలైంది. ఇరాన్‌లోని అణు కేంద్రాలతో పాటు పలు సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. దీంతో, ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, వైమానిక దాడులతో ప్రతిస్పందించింది. ఇక, జూన్ 21న అమెరికా ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగింది. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లలోని ముఖ్యమైన అణు స్థావరాలపై బాంబు దాడులు జరిపింది. బంకర్ బస్టర్ బాంబులతో అణుకేంద్రాలను ధ్వంసం చేసింది. అణుకేంద్రాలు ధ్వంసమయ్యామని, ప్రాథమిక లక్ష్యాలను చేరుకున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ధారించారు.