Tulbul project: ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దాయాది దేశం పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ‘సింధూ నదీ జలాల ఒప్పందాన్ని’ రద్దు చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ ఈ కీలక నిర్ణయం ప్రకటించింది. దీంతో, పాక్‌లోని కీలక ప్రాజెక్టుల్లో నీళ్లు అడుగంటిపోయాయి. కొన్ని చోట్ల పంటలు కూడా ఎండిపోతున్నాయి. ఇప్పటికే నీటి కష్టాలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌కు మరిన్ని ఇబ్బందులు కలగజేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. చాన్నాళ్లక్రితం నిలిచిపోయిన ‘తుల్‌బుల్ నావిగేషన్ ప్రాజెక్టు’ను (Tulbul project) పునరుద్ధరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా, పశ్చిమ నదీ వ్యవస్థల నీటిని మరింత సద్వినియోగం చేసుకోవాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన సమగ్ర రిపోర్ట్ సిద్ధమవుతోందని, ఏడాదిలోపు పూర్తయ్యే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు ప్రస్తావించారు. కీలకమైన ఈ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు చివవరి దశలో ఉన్నామని పేర్కొన్నారు. ప్రాజెక్టు డీపీఆర్ తయారవుతోందని వివరించారు. పశ్చిమ నదుల నుంచి భారత్ వాటాను మరింత సద్వినియోగం చేసుకునే ముఖ్య ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని వివరించారు. పశ్చిమ దిశలో ప్రవహించే నదుల్లో ఒకదాని నీటిని పంజాబ్, హరియాణా రాష్ట్రాల వైపు మళ్లించే అవకాశాలను పరిశీస్తున్నట్టు సదరు అధికారి చెప్పారు.
Read this- Rajnath Singh: చైనా వేదికగా రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
సింధూ జలాల ఒప్పందంలో ఏం చెబుతోంది?
భారత్, పాకిస్థాన్ మధ్య 1960 సెప్టెంబరు 19న సింధూ నదీ జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం, పశ్చిమదిశగా అంటే, పాకిస్థాన్ వైపు ప్రవహించే సింధూ, చీనాబ్, జీలం వంటి ప్రధాన ఉప నదులపై భారత్ అధికారాలు పరిమితంగా మాత్రమే ఉన్నాయి. పాకిస్థాన్ ఏకంగా 80 శాతం జలాలను వినియోగించుకోవాలని, భారత్ కేవలం 20 శాతం నీటిని మాత్రమే వాడుకోవాలని పొందుపరిచారు. సింధూ జలాల ఒప్పందం రద్దు కావడంతో ఇకపై నీటిని సద్వినియోగం చేసుకునే వీలుంటుంది. అయితే, నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉంది. డ్రై సీజన్‌లో కొంతమేర నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ వానాకాలంలో నీటి నిల్వకు అవకాశం పరిమితంగా ఉంది. అందుకే, వర్షాలు సమృద్ధిగా కురిసేటప్పుడు దిగువన ఉన్న పాకిస్థాన్ వైపు వరదలు వెళుతున్నాయి. సింధూ నదీ జలాల ఒప్పందం అమలు కారణంగా వరదల సమయాల్లో కొన్ని సవాళ్లు కూడా ఎదురయ్యేవని అధికారులు గుర్తుచేస్తున్నారు. అందుకే, రిజర్వాయర్‌ల నిర్వహణ, నీటి నిల్వ సామర్థ్యాల పెంపుపై దృష్టి సారించబోతున్నట్టు అధికారి వివరించారు. నీటి వినియోగం పెంపునకు సంబంధించిన కీలక ప్రతిపాదనలు పరిశీలనలోఉన్నాయని వివరించారు.
Read this- Team India: రెండవ టెస్టు మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్