Crime Stop
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Crime Awareness: అవగాహన లేని అఘాయిత్యాలు ఆపలేమా?

Crime Awareness: నేరం చేస్తే శిక్ష ఎలా ఉంటుందనేది చాలా మందికి తెలియదు. ఎందుకంటే.. ఈ తప్పు చేస్తే రేపు చిప్పకూడు తినాల్సి వస్తుందనే విషయం తెలుసుకోలేకపోతున్నారు. నేరానికి పాల్పడిన వ్యక్తే కాదు.. కుటుంబం అంతా అల్లకల్లోల్లం అవుతుందన్న కనీస ఆలోచన, ఇంకితజ్ఞానం, అవగాహన నేటి సమాజానికి లేకుండా పోయింది. గంటల తరబడి యూట్యూబ్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ షార్ట్ వీడియోలు, రీల్స్ చూస్తూ.. మరోవైపు చిల్లరపాటి చిట్ చాట్స్‌తో కాలం గడిపేస్తున్న నేటి యువతకు ‘న్యాయం’ (Law), అన్యాయాలు.. నైతికత, అనైతికతలు, బంధుప్రీతి పట్ల పూర్తిగా అవగాహన లేకుండా పోయింది. దీనికితోడుగా చదువుల్లో సోషల్ మీడియా గురించి చెబుతున్నారే తప్ప.. న్యాయం ఏంటి? న్యాయశాఖ ఏం చెబుతోంది? ఏది చేస్తే తప్పు..? ఏది చేస్తే ఒప్పు? అనే ఒక్క పాఠం కూడా లేకపోవడమే ఇందుకు కారణమని విశ్లేషకులు, నిపుణులు చెబుతున్నారు. శృంగారానికి సంబంధించిన పాఠాలు బోధిస్తున్న ఈ రోజుల్లో ప్రాథమిక విద్య నుంచే న్యాయం, శిక్షల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జైల్లో ఉంటే ఎలా ఉంటుంది? ఏవిధంగా ఉండగలం? బయట సమాజంలో ఉంటే ఎలాంటి స్వేచ్ఛ ఉంటుంది? నాలుగు గోడల మధ్య ఒక తప్పు చేస్తే.. అలాంటి నాలుగు గోడల మధ్య జైల్లో ఎన్నాళ్లు మగ్గాల్సి వస్తుంది? అనేది.. సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్స్‌తో పాటుగా న్యాయశాఖను ఎందుకు బోధించట్లేదు..? తప్పు చేస్తే న్యాయ శాఖ విధించిన శిక్షలతో నిందితుల జీవితాలు ఎలా ఉన్నాయనేది చెప్పడానికి ఉదాహరణలు ఎందుకు పాఠ్యాంశ రూపంలో తీసుకురావట్లేదు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒక్కసారి శిక్షపడితే ఎలాంటి భయానక జీవితం గడపాల్సి వస్తుందో అని, కుటుంబం రోడ్డుపాలవుతుందనే విషయాలను ఎందుకు బోధించట్లేదు?, అసలు ఆ ఆలోచనే ఎందుకు రావట్లేదు? అనే ప్రశ్నలకు సమాధానాలు రావట్లేదు.


Read Also- Duvvada: అవును తప్పే.. క్షమించండి పవన్ కళ్యాణ్!

ప్రేమ కోరుకునేది త్యాగాలే కానీ..
ఇటీవల కాలంలో భర్తలను హత్య చేస్తున్న భార్యల కేసులు.. తల్లిదండ్రులను ఆడ బిడ్డలు చంపేస్తున్న ఘటనలు పెరుగుతుండటం నిజంగా తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఈ తరహా ఘటనలు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా వెలుగులోకి వస్తున్నాయి. నిన్నగాక మొన్న చాకలి ఐలమ్మ (Chakali Ilamma) మనవరాలిని.. 10వ తరగతి చదువుతున్న సొంత కుమార్తె హత్య చేయడం అత్యంత దారుణం. అలాగే ఒకరేమో హనీమూన్ పేరుతో తీసుకెళ్లి భర్తను హత్య చేయడం, మరొకరేమో పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియుడు, తల్లి బాయ్‌ఫ్రెండ్ కోసం కాళ్ల పారాణి కూడా ఆరకముందే హత్యకు కుట్రపన్నడం.. ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా ఐదు సార్లు ప్లాన్ చేసి విఫలమై ఆరోసారి హత్యగావించబడిన సర్వేయర్ తేజేశ్వర్ ఘటన.. ఇలా ఒకటా రెండా దేశం మొత్తమ్మీద రోజులో లెక్కలేనన్ని ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఆఖరికి పెళ్లయ్యి పాతికేళ్ల తర్వాత కూడా అక్రమ సంబంధాలు పెట్టుకొని కట్టుకున్న భర్తను, నవ మాసాలు మోసి, పెంచిన బిడ్డలను సైతం వదిలేసి వేరొకరితో వెళ్లిపోవడం ఇలా సమాజంలో లెక్కలేనన్ని జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ జరిగిన, జరుగుతున్న సంఘటనలను.. ముఖ్యంగా ప్రేమ త్యాగాలను కోరుకుంటుంది కానీ.. హత్యలు, అఘాయిత్యాలు అంతకుమించి కోరుకోదనే విషయాలను ఇప్పుడున్న యూత్‌కు తెలియాల్సిన అవసరం ఉంది.


Special Education Law

చెప్పేదెవరు..?
న్యాయ వ్యవస్థపైన ప్రాథమిక స్థాయి నుంచే పిల్లలకు బోధిస్తూ రావాలి. ఈ సమాజంలో పెడదారి పడుతున్న యువతను సరైన మార్గంలో నడిపించేందుకు చట్టాలపైన న్యాయమూర్తులు, న్యాయ నిపుణులతో సదస్సులు నిర్వహించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. యువత చట్టాలపై, ముఖ్యంగా హత్యలకు సంబంధించిన శిక్షలపై అవగాహన లేకపోవడం వల్ల తీవ్రమైన నేరాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తున్నది. ఒకరు భర్తను, మరొకరు తల్లిదండ్రులను హత్య చేయడం.. ఇంకొకరు ఏకంగా కుటుంబాన్నే చిదిమేయడం అనేది కేవలం చట్టాల గురించి తెలియకపోవడం మాత్రమే కాకుండా, అనేక సామాజిక, మానసిక సమస్యలు కూడా కారణమే అని చెప్పుకోవచ్చు. అందుకే ఏ నేరం చేస్తే ఎలాంటి శిక్ష పడుతుంది? నేరాల జోలికి ఎందుకు వెళ్లకూడదు? జైలుకెళ్తే పరిస్థితి ఎలా ఉంటుంది? పోలీసుల ఇంటరాగేషన్ ఎలా ఉంటుంది? మరీ ముఖ్యంగా పైసలిస్తే చాలు ఏదైనా, ఎంతటి నేరాన్ని అయినా సరే మేనేజ్ చేయొచ్చనే సినిమాలు, సీరియల్స్‌లో చూపిస్తున్న తీరు.. సమాజంలో పడిన ముద్రను కాకుండా.. అసలు సిసలైన విచారణ ఎలా ఉంటుందనే అవగాహన కల్పించే కార్యక్రామలు పల్లె, గ్రామాల స్థాయి నుంచి కల్పించాల్సి ఉన్నది. ఇందుకు బోలెడన్ని మార్గాలు ఉన్నాయి. జానపదాలు, కథలు, పాటల రూపంలో పాటు కళాకారులతో ప్రచారం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉన్నది. అంతేకాదు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు నిండు జీవితాలను బుగ్గిపాలు చేస్తున్న ఈ పరిస్థితుల్లో ఇలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదనేది? ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు.. విశ్లేషకులు ముందుకు రావాలి. వివాహ బంధాల పట్ల ప్రజల్లో నమ్మకం కోల్పోకుండా, మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తూ, సరైన మార్గదర్శనంతో యువతను నేరాల బారి నుంచి కాపాడాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వాలపైన ఉంది.

Read Also- Viral News: సమోసాతో భర్తను లేపేసిన భార్య.. ట్విస్ట్ ఏమిటో తెలిస్తే!

మానవ సంబంధాలపై అవగాహన లేక..
వాస్తవానికి.. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలలో పిల్లలు పెద్దల మధ్య, బంధువుల మధ్య ఉండే సంబంధాలను చూసి, నేర్చుకునేవారు. అప్పుడున్న పెద్దలు కూడా ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది చెప్పేవారు. ఇప్పుడు చిన్న కుటుంబాలు కావడంతో, పిల్లలకు ఈ రకమైన సామాజిక అభ్యాసం లభించడం లేదు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం వల్ల పిల్లలతో గడపడానికి సమయం తక్కువగా ఉంటోంది. ఇది పిల్లలు తమ భావాలను పంచుకోవడానికి, సంబంధాలను అర్థం చేసుకోవడానికి ఆటంకంగా మారుతోంది. కుటుంబ సభ్యుల మధ్య సరైన సంభాషణ లేకపోవడం, భావాలను పంచుకోవడానికి ఆసక్తి లేకపోవడం వల్ల సంబంధాలలో దూరం పెరుగుతోంది. ఇంట్లో తల్లిదండ్రులు తరచుగా గొడవలు పడటం, ఘర్షణలు చోటు చేసుకోవడం వల్ల పిల్లలు సంబంధాలపై వ్యతిరేక దృక్పథాన్ని పెంచుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో నిజ జీవిత సంబంధాలలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి వారికి నైపుణ్యం ఉండటం లేదు. ముఖ్యంగా ఎంతసేపూ ఆ వీడియో కాల్స్, మెసేజులతో ఎక్కువగా కమ్యూనికేట్ చేయడం వల్ల నేరుగా కలుసుకునే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. దీంతో భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలో, ఇతరుల భావాలను గ్రహించడంలో అడ్డుగా మారుతోంది. వ్యక్తిత్వ లోపాలు, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడం వంటివి కూడా సంబంధాలను దెబ్బతీస్తున్నాయి.

law education

ఆషామాషీ కాదు గురూ!
భారతీయ శిక్షాస్మృతి (IPC) ప్రకారం హత్యకు చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. సెక్షన్ 302 కింద హత్యకు పాల్పడిన వారికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించబడుతుంది, అదనంగా జరిమానా కూడా ఉంటుంది. ఈ శిక్షలు నేర తీవ్రతను బట్టి మారతాయి. ఈ చట్టాల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల, యువత తమ చర్యల పర్యవసానాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. క్షణికావేశంలో లేదా ఏదో ఒక చిన్న సమస్యకు పరిష్కారంగా హత్యను ఎంచుకుంటున్నారు. కేవలం చట్టాలపై అవగాహన లేకపోవడమే ఇందుకు మొదటి కారణం. మరీ ముఖ్యంగా జైలే కదా.. అక్కడే చచ్చిపోం కదా..? తిరిగొస్తాం అనే నమ్మకంతో నేరాలు చేస్తున్న వాళ్లు ఉండొచ్చు కానీ, అదంతా ఆషామాషీ కాదు. జైళ్ల గురించి కూడా యువతలో తప్పుడు అభిప్రాయాలు ఉండొచ్చు. కొందరు జైలు జీవితం అంత కష్టం కాదని, లేదా తాము అక్కడ ‘బలంగా’ తయారవుతామని భావించవచ్చు. కానీ, వాస్తవానికి, జైలు జీవితం చాలా కఠినంగా ఉంటుంది. వ్యక్తిగత స్వేచ్ఛ కోల్పోవడం, సమాజం నుంచి దూరం కావడం, కుటుంబానికి దూరంగా ఉండటం, భవిష్యత్తు అంధకారం కావడం వంటివి మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతాయి. ఒకసారి హత్య కేసులో జైలుకు వెళితే, వారి భవిష్యత్తు దాదాపుగా నాశనం అవుతుంది. ఇలాంటి ఘటనలను నివారించడానికి సమాజం, ప్రభుత్వం, కుటుంబాలు, విద్యా సంస్థలు కలిసి పని చేయాలి. పాఠశాలలు, కళాశాలల్లో చట్టాలపై అవగాహన తరగతులు నిర్వహించాలి. నేరాల పర్యవసానాలను స్పష్టంగా వివరించాలి. యువతకు మానసిక ఆరోగ్య నిపుణుల సలహాలు, కౌన్సిలింగ్ అందుబాటులో ఉంచాలి. తల్లిదండ్రులకు పిల్లలను పెంచడంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి మార్గదర్శనం చేయాలి. సమాజంలో హింసను తగ్గించి, సానుకూల వాతావరణాన్ని ప్రోత్సహించాలి. డ్రగ్స్, మద్యం వ్యసనాల పట్ల యువతకు అవగాహన కల్పించాలి. యువత ఇలాంటి నేరాలకు పాల్పడకుండా నివారించాలంటే, చట్టాలపై అవగాహన పెంచడం, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, సామాజిక మద్దతు కల్పించడం అత్యవసరం.

Read Also- Formula E Race Case: ఫార్ములా ఈ కార్​ రేస్ కేసులో ఏసీబీ స్పీడ్!

లోపం ఎక్కడ..?
ఇటీవల కాలంలో యువతలో న్యాయ వ్యవస్థపై, ముఖ్యంగా నేరాలకు సంబంధించిన చట్టాలపై అవగాహన లోపించడం వల్ల తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భర్తలను భార్యలు.. ఆఖరికి తల్లిదండ్రులను ఆడబిడ్డలు.. అందులోనూ పదో తరగతి చదువుతున్న పిల్లలు హత్య చేసే ఘటనలు చూస్తుంటే, తాము చేస్తున్న నేరాల తీవ్రత, వాటి పర్యవసానాలు వారికి ఎంతమాత్రం తెలియడం లేదని స్పష్టమవుతోంది. సినిమా, టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్‌లలో నేరాలను సులువుగా చూపించడం, వాటి పర్యవసానాలను తక్కువ చేసి చూపించడం యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పుకోవచ్చు. నేరం చేసినా సులువుగా బయటపడొచ్చనే తప్పుడు అంచనాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా.. తప్పుడు పనులు చేయడానికి వెనుకాడకపోవడం, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడం, తమ కోరికల కోసం ఎంతకైనా తెగించడం వంటివి ఈ మధ్య అమాంతం పెరుగుతున్నాయి. దీనికి తోడు నేరాలు ఎలా చేయాలి? అని గూగుల్, యూట్యూబ్‌లో వెతికి మరీ, చేస్తుండటం గమనార్హం. ఆ రెండింటిలోనూ ఏ తప్పు చేస్తే ఎలాంటి శిక్ష పడుతుంది? అనేది కూడా ఉంటుంది. కానీ, అలాంటివి అస్సలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడున్న యువత (ఆడ, మగ) భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇలాంటప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్ సిరీస్‌ల ద్వారా చట్టాలపై అవగాహన కల్పించే షార్ట్ ఫిలిమ్స్, కార్టూన్లు, వీడియోలు రూపొందిస్తే మంచిది. యువత ఎక్కువగా ఉపయోగించే మాధ్యమాలను వినియోగించుకోవాలి.

Law

చిన్ననాటి నుంచే రావాలి..
యువతలో నేర ప్రవృత్తిని అరికట్టడానికి, బాధ్యతాయుతమైన పౌరులుగా వారిని తీర్చిదిద్దడానికి చిన్ననాటి నుంచే న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించడం అత్యవసరం. కేవలం చట్టాలను వల్లె వేయించడం కాకుండా, వాటి ఆవశ్యకత, ప్రాముఖ్యతను సరళమైన పద్ధతుల్లో వివరించాలి. చట్టాల పట్ల అవగాహన చిన్ననాటి నుంచే ఉంటే, పిల్లలు సరైన, తప్పు నిర్ణయాల మధ్య తేడాను గుర్తించగలుగుతారు. తమ చర్యలకు ఎలాంటి చట్టపరమైన పర్యవసానాలు ఉంటాయో తెలిస్తే, తీవ్రమైన నేరాలకు పాల్పడే ధోరణి తగ్గుతుంది. పౌరులుగా తమ హక్కులు, బాధ్యతలు ఏమిటో చిన్న వయసు నుంచే తెలుసుకోవడం వల్ల సమాజంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించగలుగుతారు. న్యాయ అవగాహన కలిగిన వ్యక్తులు న్యాయబద్ధమైన సమాజ నిర్మాణానికి దోహదపడతారు. బాల్యం నుంచే చట్టాలపై అవగాహన ఉంటే, పిల్లలు తమను తాము దుర్వినియోగం లేదా దోపిడీ నుంచి రక్షించుకోవచ్చు. న్యాయ అవగాహనను పాఠశాల స్థాయి నుంచే విద్యలో భాగం చేయడం, ఆసక్తికరమైన పద్ధతుల్లో బోధించడం ముఖ్యం. కథలు, ఆటలు, చిత్రాల ద్వారా సరైన, తప్పు పనుల గురించి, నిజాయితీ, న్యాయం వంటి ప్రాథమిక విలువలను బోధించాలి.. చిన్న చిన్న నియమాలు, వాటి ప్రాముఖ్యతను వివరించాలి. ఉదాహరణకు ‘దొంగతనం చేస్తే నేరం’, ‘కొట్టడం తప్పు’ వంటివి. ప్రాథమిక మానవ హక్కులు (విద్య హక్కు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ), బాలల హక్కులు (POCSO చట్టం), పౌరుల ప్రాథమిక విధులు, ట్రాఫిక్ నియమాలు, పర్యావరణ పరిరక్షణ చట్టాలు వంటివాటిని సరళంగా వివరించాలి. చిన్నపాటి ‘డ్రామాలు’ లేదా ‘రోల్ ప్లే’ ల ద్వారా నేరాల పర్యవసానాలను చూపించాలి.

ఇలా కూడా చేయొచ్చుగా..!
ఉన్నత పాఠశాల స్థాయి విద్యలో (9 నుంచి 12 తరగతులు) భారత రాజ్యాంగం ప్రాథమిక అంశాలు, క్రిమినల్ చట్టాలు (హత్య, దొంగతనం, లైంగిక వేధింపులు), సైబర్ నేరాలు, వినియోగదారుల హక్కులు, బాల్య వివాహాలు, గృహ హింస వంటి కీలక చట్టాలపై లోతైన అవగాహన కల్పించాలి. నిజ జీవిత కేసుల ఉదాహరణలతో చర్చలు, డిబేట్లు నిర్వహించాలి. న్యాయవాదులు, న్యాయమూర్తులు, పోలీసు అధికారులు పాఠశాలలకు వచ్చి పిల్లలతో మాట్లాడాలి. వారి అనుభవాలను పంచుకుంటూ, న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో వివరించాలి. ఉన్నత పాఠశాల విద్యార్థులను స్థానిక కోర్టులకు తీసుకెళ్లి, న్యాయ ప్రక్రియను ప్రత్యక్షంగా చూపించాలి. ఇది వారికి న్యాయ వ్యవస్థపై ఒక స్పష్టమైన అవగాహనను ఇస్తుంది. తల్లిదండ్రులు ఇంట్లో చట్టాలు, నైతిక విలువలు, బాధ్యతలపై పిల్లలతో చర్చించాలి. సమాజంలో జరిగే ఘటనలను చట్టపరమైన కోణంలో వివరించి, వాటి పర్యవసానాలను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) వంటి ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల చొరవ తీసుకొని గ్రామాల్లో, పట్టణాల్లో న్యాయ అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలి. సామాజిక మాధ్యమాలు, రేడియో, టీవీల ద్వారా చట్టాలపై నిరంతర ప్రచార కార్యక్రమాలను చేపట్టాలి. చిన్ననాటి నుంచే న్యాయ వ్యవస్థపై సరైన అవగాహన కల్పించడం ద్వారా, యువత బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగి, నేర రహిత సమాజ నిర్మాణానికి తోడ్పడుతారు.

Law Educations

Read Also- Rs 4 Cr Donation to Temple: కుమార్తెల చేతిలో ఘోర అవమానం.. ఆ తండ్రి ఏం చేశాడో తెలిస్తే షాకే!

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు