Red Sandalwood Smuggling: ఇద్దరు చెడు అలవాట్లకు బానిసలు. జల్సాలు తీర్చుకోవటానికి అడ్డదారులు తొక్కారు. ఈ క్రమంలో ఎర్ర చందనం(Red sandalwood) దొంగలు స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయి జైలు పాలయ్యారు. అక్కడ దోస్తులయ్యారు. బెయిల్‌మీద విడుదలై బయటకు రాగానే ఏనుగు దంతాల(Elephant’s tusks)ను సేకరించి వాటిని అమ్మటానికి హైదరాబాద్(Hyderabad) వచ్చారు. కాగా, విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీనగర్(LB Nagar)ఎస్వోటీ అధికారులు హయత్ నగర్(Hyathnagar) రేంజ్అటవీ అధికారులతో కలిసి ఇద్దరిలో ఒకరిని అరెస్ట్ చేశారు. అతని నుంచి అంతర్జాతీయ మార్కెట్లో 3కోట్ల రూపాయల విలువ చేసే రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆశించిన డబ్బు రాకపోతుండటంతో
ఎల్బీనగర్ లోని క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు(CP Sudeer Babu), ఎల్బీనగర్ ఎస్వోటీ అదనపు డీసీపీ షాకీర్ హుస్సేన్, రంగారెడ్డి(Ranga Reddy) జిల్లా ఫారెస్ట్‌రేంజ్ ఆఫీసర్ ప్రకాశ్ తో కలిసి వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్రాష్ట్రం అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన రేకులకుంట ప్రసాద్(32) వృత్తిరీత్యా డ్రైవర్. దురలవాట్లకు బానిసైన ప్రసాద్ చేస్తున్న పని ద్వారా ఆశించిన డబ్బు రాకపోతుండటంతో ఎర్ర చందనం దుంగలను స్మగ్లింగ్ చేయటం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ఫిబ్రవరిలో తిరుపతి జిల్లా రెడ్‌శాండిల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ఫోర్స్అధికారులకు పట్టుబడ్డాడు. అతన్ని కోర్టులో హాజరుపరిచిన అధికారులు తిరుపతి సబ్‌జైలుకు రిమాండ్చేశారు.
Also Read: Serilingampally circle: టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై విమర్శలు
యానాదుల తెగకు చెందిన వారి నుంచి
అక్కడ ప్రసాద్‌కు ఎర్ర చందనం స్మగ్లింగ్కేసులోనే దొరికిపోయిన లోకేశ్వర్ రెడ్డి పరిచయం అయ్యాడు. కొన్ని రోజుల్లోనే ఇద్దరు స్నేహితులైపోయారు. బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చిన తరువాత ఈసారి ఏనుగు దంతాలను సేకరించి పెద్ద మొత్తానికి అమ్మాలని నిర్నయించుకున్నారు. ఈ క్రమంలో లోకేశ్వర్ రెడ్డి తిరుపతి జిల్లా శేషాచలం అడవుల్లోకి వెళ్లి యానాదుల తెగకు చెందిన వారి నుంచి రెండు ఏనుగు దంతాలను కొన్నాడు.
ఆ తరువాత ప్రసాద్‌ను వెంటబెట్టుకుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Bus)లో బుధవారం ఉదయం ఎల్బీనగర్(Lb Nagar) వద్దకు చేరుకున్నారు. ఈ మేరకు సమాచారం అందటంతో ఎస్వోటీ అధికారులు, అటవీ శాఖ సిబ్బందితో కలిసి దాడి చేశారు. వీరిని చూసి లోకేశ్వర్ రెడ్డి పారిపోగా ప్రసాద్ పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 5.62 కిలోల బరువు ఉన్న రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై వన్యప్రాణి సంరక్షణా చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న లోకేశ్వర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు.
Also Read: Meenakshi Natarajan: పార్టీని మరింత పటిష్టం చేయాలి.. ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ స్పష్టం!