YS Jagan: 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అధికార ఎన్డీఏ కూటమిపై వినూత్న రీతిలో పోరుబాట పడుతున్నారు. ఇప్పటికే రైతులు, యువత, నిరుద్యోగుల కోసం పోరు చేసిన వైసీపీ.. ఇప్పుడు మరో వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’, ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండగడుతూ.. చంద్రబాబు (Chandrababu) మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ (Recalling Chandrababu Manifesto) పేరుతో 5 వారాల బృహత్తర కార్యక్రమం చేపట్టాలని క్యాడర్‌కు జగన్ పిలుపునిచ్చారు. టీడీపీ కూటమి ఏడాది పాలన వైఫల్యాలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన వైనం, సూపర్‌సిక్స్ హామీలు ఎగ్గొట్టిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి క్యూఆర్ కోడ్‌ను జగన్ ఆవిష్కరించి, ఇంటింటికీ దాన్ని చేర్చేలా కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. బుధవారం నాడు జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు హాజరయ్యారు.
Read Also- Duvvada: అవును తప్పే.. క్షమించండి పవన్ కళ్యాణ్!
ఏడాదికే వ్యతిరేకత
‘ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది వ్యవధిలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకున్నది. ఇంత తక్కువ వ్యవధిలో ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ స్థాయిలో గతంలో ఏనాడూ లేదు. అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా ప్యతిరేకత కనిపిస్తోంది. చంద్రబాబు ఈ వ్యతిరేకత మధ్య, ప్రజలకు మంచి చేయాల్సింది పోయి, ప్రజలను తప్పు దోవ పట్టించాలని చూస్తున్నారు. అందుకే ఈ రోజు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్‌తో పాటు, అణిచివేత చూస్తున్నాం. రెడ్‌బుక్ పాలన చూస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం మధ్య స్పష్టంగా తేడా కనిపిస్తోంది. మన 5 ఏళ్ల పాలనలో వివక్ష లేకుండా పథకాలు అందించాం. పార్టీ చూడకుండా మంచి చేశాం. అదే ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంలో కనిపిస్తోంది ఏమిటంటే, కేవలం రెడ్‌బుక్ (Red Book) రాజ్యాంగం అమలు చేస్తూ, విచ్చలవిడిగా అన్యాయాలు కనిపిస్తున్నాయి. మన ప్రభుత్వంలో ఎప్పుడూ చూడని విధంగా విద్య, వైద్యం, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులతో పాటు, పాలనలో పూర్తి పారదర్శకత చూపాం. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించాం. ఇలా ఎన్నో మార్పులు చూశాం. కానీ, చంద్రబాబు ఈ ఏడాది పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతుంది. ఈ ఏడాది పాలనలో చంద్రబాబు వల్ల ప్రతి కుటుంబానికి జరిగిన నష్టం ఎంత? ఈ ఏడాది కూడా పథకాలు లేవు కాబట్టి, ఇంకా ఎంత నష్టం జరుగుతోంది. మరోవైపు మన ప్రభుత్వం ఉండి ఉంటే, ఎంతెంత ప్రయోజనాలు అనేది చెప్పాలి. చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేయాలి. బాబు తానిచ్చిన హామీల రిబ్బన్ కూడా కట్ చేయకుండా, అన్నీ అమలు చేశామని చెబుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే, నాలుక మందం అంటున్నారు’ అని వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు.
5 వారాల కార్యక్రమం
‘ రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమం ఇవాళ మొదలు పెడుతున్నాం. ఈ కార్యక్రమాన్ని 5 వారాలు చేద్దాం. తొలుత పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు. పార్టీ జిల్లా అధ్యక్షులు కార్యక్రమాన్ని ప్రారంభించాలి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు. ఆ తర్వాత రెండు బటన్లు నొక్కితే, చంద్రబాబు మ్యానిఫెస్టో, బాండ్లు వస్తాయి. మరో బటన్ నొక్కితే, ఒక్కో కుటుంబం ఎంతెంత నష్టపోయిందో వస్తుంది. రెండో దశలో నియోజకవర్గ స్థాయిలో, మూడో దశలో మండల స్థాయిలో క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ. ఆ స్థాయి నాయకుల ప్రెస్‌కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలి. నాలుగో దశలో గ్రామస్థాయిలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. అందరికీ అర్థమయ్యేలా వివరించాలి. ఇందులో గ్రామ కమిటీలను ఇన్‌వాల్వ్ చేయాలి. ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడే ఎక్కడైనా మండల, గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి కాకపోతే.. దాన్నీ పూర్తి చేయాలి. 5 వారాల ఈ కార్యక్రమం జరిగే నాటికి గ్రామస్థాయిలో కూడా అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి కావాలి. ఏడాది గడిచింది.. హానీమూన్ పీరియడ్ ముగిసింది. ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే. కాబట్టి అందరినీ కలుపుకుపోవాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇది ఎమ్మెల్యే అభ్యర్థులకు చాలా కీలకం. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. వారికి అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలపై పోరాడాలి. అప్పుడే మనం సత్తా చూపగలం’ అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
హామీలు, బాండ్లు..
‘ ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నారు? జగన్ చేస్తున్నవే కాకుండా. అంతకు మించి ఇస్తానన్నారు. జగన్‌కన్నా ఎక్కువ చేస్తానన్నారు. ఆ మాటలు చెప్పడమే కాకుండా, ప్రతి ఇంటికి తన నాయకులు, కార్యకర్తలను పంపించి ఆ కుటుంబం వద్దనే వారు కూర్చుని, మిస్డ్ కాల్ ఇప్పించారు. దాంతో ఓటీపీ వచ్చింది. దాన్ని ఎంటర్ చేయగానే, ఆ కుటుంబంలో ఎవరెవరికి ఏ పథకం వర్తిస్తుంది. దాని వల్ల ఎంతెంత వస్తుంది? అన్న వివరాలతో బాండ్ వస్తుంది. దానిపై ఏమని ఉంటుంది అంటే.. చంద్రబాబు అనే నేను, మన రాష్ట్ర ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను అని ఆయన, పవన్‌కళ్యాణ్ ఇద్దరూ సంతకం చేశారు. ఏయే పథకాల ద్వారా ఆ ఇంటికి ఎంతెంత వస్తుంది..? అంటూ పథకాలు వివరించాలి. తల్లికి వందనం కింద ఇంత, అన్నదాతా సుఖీభవ, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఈ పథకాల కింద మీరు అర్హులయ్యారు. మీకు 2024 జూన్ నుంచే ఆ మొత్తం అందుతుంది. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం చంద్రబాబు ఇచ్చిన బాండ్లు, అమాయక ప్రజలను ప్రలోభాలు పెట్టి విధానం, పచ్చి మోసాలను ఎండగట్టాలి. అవన్నీ ఇప్పుడు ప్రజల్లో ప్రస్తావించాలి. అందుకే ప్రజలంతా డిమాండ్ చేయాలి’ అని నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు.