Shubhanshu Shukla: భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయానికి నాంది పడింది. భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా రోదసిలోకి వెళ్లారు. ఆయనతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌సెంటర్ రోదసిలోకి దూసుకెళ్లారు. బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) చేపట్టిన ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. కొన్ని నిమిషాల తర్వాత వీరు ప్రయాణిస్తున్న వ్యోమనౌక రాకెట్ నుంచి విడిపోయి భూకక్ష్యలోకి ప్రవేశించింది.
60 శాస్త్రియ ప్రయోగాలు
మిషన్ ప్రారంభమైన 28 గంటల తర్వాత అంటే గురువారం సాయంత్ర 4.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) వారి వ్యోమనౌక ఐఎస్‌ఎస్ (ISS)తో అనుసంధానం కానుంది. ఐఎస్‌ఎస్‌లో శుభాంశు బృందం 14 రోజుల పాటు ఉంటుంది. అంతరిక్ష కేంద్రంలో.. ఇస్రో తరపున ఆయన 7 రకాల ప్రయోగాలు చేపట్టనున్నారు. భారరహిత స్థితి వల్ల ఎముకలు, కండరాలు, గుండె, రక్తనాళాలు, రోగనిరోధక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న దానిపై పరిశోధన చేయనున్నారు. అంతేకాదు నాసా నిర్వహించే 5 ఉమ్మడి అధ్యయనాల్లోనూ శుభాంశు పాల్గొననున్నారు. ఓవరాల్ గా యాక్సియం-4 వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహిస్తారు.
రెండో భారత వ్యోమగామి
యాక్సియం-4 మిషన్ ప్రయోగం ద్వారా.. భారత శుభాంశు శుక్లా భారత్ తరపున కొత్త చరిత్ర సృష్టించనున్నారు. 41 ఏళ్ల తర్వాత రోదసిలో అడుగుపెట్టబోతున్న తొలి వ్యోమగామిగా నిలవనున్నారు. అంతకుముందు 1984లో సోవియట్ యూనియన్‌కు చెందిన ఇంటర్‌కాస్మోస్ కార్యక్రమం కింద సోయుజ్ టి-11 వ్యోమనౌకలో రాకేశ్‌శర్మ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఆ తర్వాత భారత పౌరుడొకరు రోదసియానం చేయడం ఇదే తొలిసారి. ఆక్సియం 5 మిషన్.. నాసా – ఆక్సియం స్పేస్ సంస్థ మధ్య ఒక వాణిజ్య వెంచర్ కాగా.. ఇందులో శుంభాశు శుక్లాను పంపేందుకు ఇస్రో రూ.550 కోట్లు చెల్లించింది.
శుభాంశు శుక్లా మెసేజ్
అంతరిక్షంలోకి దూసుకెళ్లిన కొద్దిసేపటి తర్వాత.. శుభాంశు శుక్లా భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. ‘ప్రియమైన భారతీయులకు నమస్కారం. 41 ఏళ్ల తర్వాత మనం అంతరిక్షాన్ని చేరుకున్నాం. ఇదో గొప్ప ప్రయాణం. ఇప్పుడు మేం భూ కక్ష్యలో సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాం. నా భుజాలపై మన త్రివర్ణ పతాకం ఉంది. అది చూస్తుంటే నాతో మీరంతా ఉన్నారనే భావన కలుగుతోంది. ఇది కేవలం నా అంతరిక్ష ప్రయాణం మాత్రమే కాదు. భారత మానవ సహిత రోదసి యాత్రకు నాంది. ఈ ప్రయాణంలో మీరంతా భాగమవ్వాలని కోరుకుంటున్నా. జై హింద్. జై భారత్’ అని శుభాంశు శుక్లా తన సందేశంలో పేర్కొన్నారు.
Also Read: Viral Video: 100 మీటర్ల లోయ.. గాల్లో ప్రమాదకరంగా వేలాడిన ట్రక్.. వీడియో వైరల్!
శుభాంశు శుక్లా ఎవరు?
యాక్సియం-4 మిషన్ లో కీలకంగా వ్యవహరించనున్న శుభాంశు శుక్లా విషయానికి వస్తే ఆయన ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వ్యక్తి. ఆయనకు 2,000 గంటలకు పైగా యుద్ధ విమానాలను నడిపిన అనుభవం ఉంది. 2019లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గగన్‌యాన్ మిషన్ కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసినప్పుడు, శుక్లా వారిలో ఒకరిగా ఎంపికయ్యారు. ఆయన మాస్కోలోని యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో కఠినమైన శిక్షణ పొందారు. 2024 మార్చిలో గ్రూప్ కెప్టెన్ హోదాకు పదోన్నతి పొందిన శుక్లా, యాక్సియం-4 మిషన్‌లో పైలట్‌గా ఎంపికయ్యారు.