Rowdy-Sheeters: హైదరాబాద్ (Hyderabad) నగరంలో కొందరు తాజా, మాజీ రౌడీషీటర్లు (Rowdy-Sheeters) తమ రాజ్యం నడిపించుకుంటున్నారు. భూవివాదాలు మొదలుకుని అప్పు తగాదాల్లో జోక్యం చేసుకుంటున్నారు. సెటిల్‌మెంట్ల పేర లక్షలు సంపాదిస్తున్నారు. తమ మాట ఎవరైనా వినకపోతే వారిని బెదిరిస్తున్నారు. అప్పటికీ తమ దారికి రాకపోతే తమ వద్ద ఉండే గ్యాంగ్ సభ్యులను పంపిస్తూ దాడులు సైతం చేయిస్తున్నారు. అధికశాతం సందర్భాల్లో బాధితులు తమను ఏమైనా చేస్తారేమో అన్న భయంతో (police) పోలీసులకు ఫిర్యాదులు కూడా చేయడం లేదు.
కొందరు ధైర్యం చేసి ఫిర్యాదు ఇచ్చినా నెలల తరబడి కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయి తప్పితే పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీనికి కారణం అడ్డదారుల్లో డబ్బు సంపాదించడానికి మరిగిన తాజా, మాజీ రౌడీషీటర్లు (Rowdy-Sheeters) వేర్వేరు పార్టీలకు చెందిన కొందరు నాయకులు, పోలీసు అధికారులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటమే అన్న ప్రచారం ఉంది.
Also Read: CM Revanth Reddy: కల్వకుంట్ల ఫ్యామిలీకి వేల కోట్లు ఎక్కడివి?.. సీఎం సంచలన కామెంట్స్!
ఓ ఉదాహరణ
హబీబ్‌నగర్ (Habib Nagar) నివాసి దేవరి చంద్రశేఖర్ 2021, జూలై 8న తన సమీప బంధువు నర్సన్న పూజారికి హబీబ్‌నగర్ (Habib Nagar) కోమటికుంటలో ఉన్న ఓ స్థలాన్ని డెవలప్ చేసేందుకు రిజిస్టర్డ్ అగ్రిమెంట్ (డాక్యుమెంట్ నెంబర్ 3602/2021) కుదుర్చుకున్నాడు. దీంట్లో భాగంగా జీపీఏ, పవర్ ఆఫ్ అటార్నీ కూడా చేసుకున్నాడు. ఆ తరువాత రెండున్నర కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఆ స్థలంలో భవన నిర్మాణం జరిపాడు. ఇంత జరిగిన తరువాత నర్సన్న పూజారి అగ్రిమెంట్ రద్దు చేసి తన స్థలాన్ని తనకివ్వాలని ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి భవనం కట్టి ఎలా ఇస్తానని చెప్పిన చంద్రశేఖర్ దానికి నిరాకరించాడు. దాంతో నర్సన్న పూజారి అంబర్‌పేటకు చెందిన ఓ పహిల్వాన్‌ను ఆశ్రయించాడు.
బాధితుడు చెప్పిన దాని ప్రకారం తనను తాను అంబర్‌పేట్ పహిల్వాన్ శంకర్‌నని చెప్పుకుంటూ ఓ వ్యక్తి 6303131378, 9063906357, 7483847158 నెంబర్ల నుంచి ఫోన్లు చేసి సెటిల్‌మెంట్ చేసుకోవాలని బెదిరించాడు. ఈ మేరకు చంద్రశేఖర్ 2023, డిసెంబర్ 26న హబీబ్‌నగర్ (Habib Nagar) (Police station) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసులో నర్సన్న పూజారిని నిందితుడిగా పేర్కొంటూ అప్పట్లో అమల్లో ఉన్న ఐపీసీ 385, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. అయితే, ఫోన్లు చేసి పహిల్వాన్ నంటూ బెదిరించిన వ్యక్తిని మాత్రం ఇప్పటివరకు పట్టుకోలేదు. కనీసం అతను ఎవరన్నది కూడా విచారణ చేయక పోవటం గమనార్హం.
లాలాపేట ప్రాంతంలోనూ
ఇదొక్కటే కాదు లాలాపేట ప్రాంతంలో నివాసముండే ముదిరాజ్ అనే వ్యక్తి కూడా జోరుగా సెటిల్‌మెంట్ల దందా చేస్తున్నట్టు సమాచారం. మెడలో తులాలకు తులాల బంగారు గొలుసులు, అన్ని చేతివేళ్లకు ఉంగరాలు ధరించి ప్రత్యేకంగా కనిపించే సదరు వ్యక్తికి అంబర్‌పేట్ శంకర్ పహిల్వాన్ సన్నిహిత సంబంధాలు ఉండటం గమనార్హం. కొంతకాలం క్రితం అరెస్ట్ అయిన కాలాపత్తర్ రౌడీషీటర్ అయూబ్ ఖాన్, అష్వాక్‌లది ఇదే బాగోతం. అయూబ్ ఖాన్‌పై హత్యలు, హత్యాయత్నాలు, భూకబ్జాలు తదితర నేరారోపణలపై 72 క్రిమినల్ కేసులు ఉండగా అష్వాక్పై 44 క్రిమినల్ కేసులున్నాయి.
యువకులతో గ్యాంగులు
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే సెటిల్‌మెంట్ల దందాను జోరుగా సాగిస్తున్న తాజా, మాజీ రౌడీషీటర్లు (Rowdy-Sheeters) యువకులతో గ్యాంగులు ఏర్పాటు చేసుకుంటుండటం. పెద్దగా చదువుకోకుండా ఆవారాగా తిరిగే వారిలో కాస్త ధైర్యం ఉన్నవారిలా కనిపించిన వారిని వీళ్లు దగ్గరకు తీసుకుంటున్నారు. ప్రతిరోజు మందు తాగిస్తూ, బిర్యానీలు తినిపిస్తూ వారి ద్వారా బెదిరింపులు, దాడులు చేయిస్తున్నారు. పనులు పూర్తి చేయిస్తున్నారు. తద్వారా వసూలు చేస్తున్న లక్షల్లో నుంచి కొంత మొత్తాన్ని గ్యాంగ్ సభ్యులకు పంచుతున్నారు. కొంతమందికైతే జీతాల్లా నెలకు ఇంత అని డబ్బు ఇస్తున్నారు. ఇలా గ్యాంగ్ సభ్యులుగా చేరుతున్న వారు అన్న ఏ పని చెబితే ఆ పనిని కళ్లు మూసుకుని చేస్తున్నారు. ఈ క్రమంలో అరెస్ట్ అయితే అన్నలు వారికి బెయిల్ ఇప్పించి బయటకు తీసుకు రావటం చేస్తున్నారు.
మాజీ రౌడీషీటర్లు, పహిల్వాన్‌లదే హవా
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై స్థానిక పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది నిరంతర నిఘా పెట్టాల్సి ఉంటుంది. వాళ్లు మాజీ రౌడీషీటర్లయినా, (Rowdy-Sheeters) ప్రస్తుత రౌడీషీటర్లయినా, స్థానిక పోలీసుల్లో కొందరు ఆమ్యామ్యాలకు అలవాటు పడి వీరిని చూసీ చూడనట్టుగా వదిలి వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏ పహిల్వాన్ ఇంటికి పొద్దు పొద్దున్నే వెళ్లినా పదుల సంఖ్యలో జనం ఉండటం, సెటిల్‌మెంట్లు జరుగుతుండడం సర్వ సాధారణ దృశ్యాలే. అయినా, స్థానిక పోలీసులు దీనిని పట్టించుకోవటం లేదు.
నిజానికి ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించాలి. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మాజీ రౌడీషీటర్లు హద్దు దాటి వ్యవహరిస్తున్నారని నిర్ధారణ అయితే వారిపై తిరిగి రౌడీషీట్ (Rowdy-Sheeters) ప్రారంభించాలి. అయితే, ఈ దిశగా స్థానిక పోలీసులు చర్యలు తీసుకున్న పాపానికి పోవటం లేదు. ఫలితంగా తాజా, మాజీ రౌడీషీటర్లు, పహిల్వాన్‌లు ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగుతోంది.
Also Read: CM Revanth Reddy: కార్యకర్త నుంచే సీఎం మినిస్టర్లుగా అవకాశాలు!