Special Railway Stations: భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా రైల్వేల గురించి చెబుతుంటారు. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లల్లో ప్రయాణిస్తూ తమ గమ్యస్థానాలకు చేరుకుంటూ ఉంటారు. ప్రస్తుతం దేశంలో 7,308 పైగా రైల్వే స్టేషన్లు ఉన్నట్లు అంచనా. అయితే వీటిలో కొన్ని స్టేషన్లు ప్రత్యేక గుర్తింపు సంపాదించాయి. ఇతర వాటితో పోలిస్తే వైవిధ్యతను కలిగి ఉన్నాయి. దేశంలోని టాప్ 7 ప్రత్యేక రైల్వే స్టేషన్లు.. వాటి విశేషాలు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
అట్టారి రైల్వే స్టేషన్, పంజాబ్
భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ స్టేషన్ (Attari Sham Singh railway station) గుండా మీరు ప్రయాణించాలంట వీసా తప్పనిసరి. ఈ స్టేషన్ నుంచి సమ్ఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు పాకిస్థాన్‌లోని లాహోర్‌కు ప్రయాణిస్తుంది. ఈ స్టేషన్ ఎల్లప్పుడూ భద్రతా వలయంలో ఉంటుంది. వీసా లేకుండా ఈ స్టేషన్ నుంచి ప్రయాణించడం శిక్షార్హం. అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో భారత్ పాక్ మధ్య రాకపోకలు స్థంబించిపోయాయి.
నవాపూర్ రైల్వే స్టేషన్, మహారాష్ట్ర-గుజరాత్
ఈ స్టేషన్ (Navapur railway station) రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉంది. సగం మహారాష్ట్రలో ఉంటే మిగతా భాగం గుజరాత్‌లో ఉంటుంది. ఈ స్టేషన్ లోని ప్రకటనలు హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, మరాఠీ భాషల్లో ఉండటం విశేషం. అంతేకాదు ఈ స్టేషన్ లో ఒకసారి రైలు ఆగితే.. ఇంజిన్ ఒక రాష్ట్రంలో, బోగీలు మరో రాష్ట్రంలో ఉంటాయి.
భవానీ మండి రైల్వే స్టేషన్, రాజస్థాన్-మధ్యప్రదేశ్
రాజస్థాన్, మధ్యప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఈ రైల్వే స్టేషన్ (Bhawani Mandi railway station) కు ఓ ప్రత్యేక ఉంది. ఈ స్టేషన్ లో టికెట్ కౌంటర్ రాజస్థాన్‌లో ఉంటే.. ప్రయాణికులు మధ్యప్రదేశ్‌లో నిలబడతారు. ఈ ప్రత్యేకతపై 2018లో ‘భవానీ మండి Tesan’ అనే బాలీవుడ్ సినిమా కూడా తీశారు.
పేరు లేని రైల్వే స్టేషన్, బెంగాల్
పశ్చిమ బెంగాల్‌లోని ఓ రైల్వే స్టేషన్ పేరు లేకుండా నడుస్తోంది. ఈ స్టేషన్ రాయ్ నగర్, రైనా అనే రెండు గ్రామాల మధ్య ఉంది. ఈ రైల్వే స్టేషన్‌కి రాయ్ నగర్ రైల్వే స్టేషన్ అని పేరు పెట్టారు. కానీ అది రైనా గ్రామంలో ఉందని ప్రజలు నిరసన తెలిపారు. దీనిని అనుసరించి, రెండు గ్రామస్తులతో తరచుగా సమస్యల కారణంగా భారతీయ రైల్వే స్టేషన్ పేరును తొలగించింది. రైనా/రాయ్ నగర్ టిక్కెట్లలో ఉపయోగించబడింది.
హౌరా రైల్వే స్టేషన్, పశ్చిమ బెంగాల్
1854లో స్థాపితమైన ఈ స్టేషన్ (Howrah railway station) దేశంలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ఒకటి. రోజూ 10 లక్షలకు పైగా ప్రయాణీకులు, 600 కంటే ఎక్కువ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. నిత్యం రద్దీ దృష్ట్యా ఈ స్టేషన్ ప్రత్యేకతను సంతరించుకుంది.
ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్, బెంగాల్
బెంగాల్ రాష్ట్రంలోని మరో రైల్వే స్టేషన్ (Kharagpur Junction railway station) సైతం ఓ ప్రత్యేకతను కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫాం (1,072.5 మీటర్లు) ఈ స్టేషన్ లోనే ఉంది. ఈ స్టేషన్ భారత రైల్వేలలో చారిత్రక, సాంకేతిక ప్రాముఖ్యత కలిగి ఉంది.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు.. బండి సంజయ్ సంచలన రియాక్షన్!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, తెలంగాణ
తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఆదాయం కలిగిన రైల్వే స్టేషన్ గా సికింద్రాబాద్ (Secunderabad railway station) ఉంది. ఆదాయం పరంగా దేశంలో నాలుగో స్థానంలో సికింద్రాబాద్ ఉంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఈ స్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ స్టేషన్ గుండా లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు గమనిస్తుంటారు.