Honeymoon Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్య కేసుల్లో హనీమూన్ మర్డర్ కేసు ఒకటి. కట్టుకున్న భర్తనే భార్య దారుణంగా హత్య చేయించడం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. రాజా రఘవంశీ (Raja Raghuvanshi) హత్యకు సంబంధించి భార్య సోనమ్ (Sonam Raghuvanshi)తో పాటు ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా (Raj Kushwaha).. మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీంతో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. ఇటీవల సంజయ్ వర్మ పేరు సైతం సిట్ దర్యాప్తులో బయటకొచ్చింది. అయితే తాజాగా అతడ్ని గుర్తించినట్లు తెలుస్తోంది.
ప్రియుడే.. సంజయ్ వర్మ
మేఘలయాలో హనీమూన్ మర్డర్ చోటుచేసుకోగా.. కేసు దర్యాప్తును అక్కడి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందానికి (SIT) అప్పగించింది. దీంతో ప్రియుడు రాజ్ కుష్వాహా, సోనమ్ కు ఉన్న సంబంధం గురించి పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే రాజా రఘవంశీతో వివాహం అనంతరం.. సోనమ్ తరుచూ సంజయ్ వర్మ (Sanjay Verma) అనే పేరుతో ఉన్న నెంబర్ కు కాల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అది ఎవరో కాదని.. ప్రియుడు రాజ్ కుష్వాహానేని తాజాగా పోలీసులు తేల్చారు. మార్చి 1 నుంచి ఏప్రిల్ 8 మధ్య 234 సార్లు సంజయ్ వర్మ పేరుతో ఉన్న నెంబర్ కు సోనమ్ కాల్ చేసినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఒక్కో కాల్ 30-60 నిమిషాల నిడివితో ఉన్నట్లు పేర్కొన్నారు.
భర్తకు అనుమానం రాకుండా!
భర్త రాజా రఘువంశీకి అనుమానం రాకుండా.. సంజయ్ వర్మ పేరుతో రాజ్ కుష్వాహా నెంబర్ ను సోనమ్ సేవ్ చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. జూన్ 8వ తేదీన ఆ నెంబర్ చివరిగా వాట్సప్ లో యాక్టివ్ గా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సంజయ్ వర్మ ఎవరో తేలిపోయిన నేపథ్యంలో సోనమ్ సోదరుడు గోవింద్ (Govindh) స్పందించారు. దర్యాప్తులో ఆ పేరు తెరపైకి వచ్చినప్పుడు పోలీసులు తనను సంప్రదించినట్లు చెప్పారు. అయితే అతడెవరో తనకు తెలియదని.. ఆ పేరుతో తమ కుటుంబ సభ్యుల్లో గానీ, బంధువుల్లో గానీ ఎవరు లేరని పేర్కొన్నట్లు తెలిపారు.
Also Read: Air India Crash Survivor: మృత్యుంజయుడికి కొండంత కష్టం.. వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో వైరల్!
అసలేం జరిగిందంటే?
హనీమూన్ కేసు విషయానికి వస్తే.. రాజా రఘువంశీ, సోనమ్ కు మధ్య మే 11న వివాహం జరిగింది. 20న వారు హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ కనిపించకుండా పోవడంతో అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో పోలీసులు గుర్తించారు. అనంతరం సోనమ్ కోసం గాలించగా.. ఉన్నట్టుండి ఆమె గాజీపుర్‌లో ప్రత్యక్షమైంది. ప్రియుడితో కలిసి ఆమె భర్తను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఆమెతో పాటు హత్యకు సహకరించిన మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.