Israel attack on Iran: ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ జరుపుతున్న క్షిపణి దాడుల్లో ఇరాన్ లోని సైనిక స్థావరాలు, చమురు కేంద్రాలు, అణుశుద్ధి కేంద్రాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఇరాన్ అధికారిక టీవీ.. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్ కాస్టింగ్ – ఐఆర్ఐబీ (Islamic Republic of Iran Broadcasting) ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ మిసైల్ దాడి చేసింది. యాంకర్ న్యూస్ చదువుతున్న క్రమంలో ఈ దాడి జరగడంతో ఆమె ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెత్తారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.
తొలుత వార్నిగ్.. ఆపై దాడి
ఇరాన్ పై దాడులను తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్.. ఆ దేశ రాజధాని టెహ్రాన్ నగరాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని అక్కడి పౌరులను హెచ్చరించింది. ఇది జరిగిన 3 గంటల తర్వాత టెహ్రాన్ లోని ఇరాన్ ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీపై మిసైల్ దాడి జరగడం గమనార్హం. దాడి సమయంలో న్యూస్ యాంకర్.. ఇజ్రాయెల్ పై చాలా కోపంగా మాట్లాడుతున్నారు. తమ దేశంపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను టీవీ స్క్రీన్ పై చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే మిసైల్ దాడి జరగడంతో.. ఆమె స్టూడియో నుంచి పరుగులు తీశారు. ‘అల్లా హు’ అని అరుస్తూ ఆమె స్టూడియో నుంచి వెళ్లిపోవడం వీడియోలో స్పష్టంగా గమనించవచ్చు. స్టూడియోలోని ఇతర సిబ్బంది అరుపులు కూడా వీడియోలో వినిపించాయి.
YOH, Iran’s state television was taken out by an Israeli bomb Live On Air according to Axios.
Read the article here 👇🏿https://t.co/ZMo1fGZMPg pic.twitter.com/QxBZYGRpQM
— Hopewell Chin’ono (@daddyhope) June 16, 2025
గట్టిగా బదులిస్తాం: ఇరాన్
మరోవైపు టీవీ స్టేషన్ పై దాడిని తీవ్రంగా పరిగణించిన ఇరాన్.. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లోని పౌరులకు వార్నింగ్ బెల్స్ ఇచ్చింది. నగరాన్ని విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించింది. టెల్ అవీవ్ (Tel Aviv)పై ప్రతీకార దాడులు తప్పవని సూచించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మాట్లాడుతూ.. మీడియా ఫ్లాట్ ఫారాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఇజ్రాయెల్ హద్దు మీరి ప్రవర్తించిందని ఆరోపించారు. మరోవైపు ఇరాన్ చేసిన క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్ లోని ప్రధాన నగరాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని చెప్పారు. తమ దాడుల్లో 8 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారని చెప్పారు.
టెహ్లాన్‌ను ఖాళీ చేయండి: ట్రంప్
మరోవైపు ఇరాన్ – ఇజ్రాయెల్ ఉద్రిక్తలు మరింత ముదిరిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump).. తన జీ7 పర్యటనను అర్ధాంతరంగా రద్దుచేసుకున్నారు. కెనడా నుంచి తిరిగి అమెరికాకు బయలుదేరారు. యూఎస్ చేరుకోగానే భద్రతా మండలితో ట్రంప్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు జీ7 శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. తాను చెప్పిన అణు ఒప్పందంపై ఇరాన్ సంతంకం చేసి ఉండాల్సిందని అన్నారు. ఇప్పుడు ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఇరాన్ తెచ్చుకుందని.. ఇదొక పనికిమాలిన చర్య అని ఘాటు విమర్శలు చేసారు. అంతేకాదు ఇరాన్ రాజధాని టెహ్రాన్ (Tehran) ను ప్రజలు ఖాళీ చేయాలని ట్రంప్ హెచ్చరించారు.