HYDRA Commissioner: పాత లేఅవుట్‌లలో రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడుతూనే, అమాయకులు మోసపోకుండా చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్(HYDRA Commissioner Ranganath) స్పష్టం చేశారు. హైడ్రా (HYDRA) కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
నాలాల ఆక్రమణలపై..
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో నగరంలో నాలాల ఆక్రమణలపై హైడ్రాకు (HYDRA) ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నాలాల మీద స్లాబులు వేసి, ఇంటి ఆవరణగా మార్చేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. అక్కడ నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం సాధ్యం కాక, అవి పూడ్చుకుపోతున్నాయని పలువురు పేర్కొన్నారు. మల్కాజిగిరి, బాచుపల్లి, ( Bhachupally) సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్, మాదాపూర్ తో సహా నగరం నలువైపుల నుంచి నాలాల ఆక్రమణలపై ఫిర్యాదులందినట్లు హైడ్రా (HYDRA) అధికారులు వెల్లడించారు.
Also Read:Harish Rao: రేవంత్ సర్కార్‌లో.. ప్రశ్నార్థకంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు!
భూముల ఆక్రమణలు..
ఒకప్పటి గ్రామపంచాయతీ లేఅవుట్‌లను తిరిగి వ్యవసాయ భూములుగా చిత్రీకరించి, తప్పుడు పాస్ పుస్తకాలతో కొంతమంది వారసులు, కబ్జాదారులు కాజేస్తున్నారని పలువురు వాపోయారు. హైడ్రా (HYDRA) ప్రజావాణికి వచ్చిన మొత్తం 47 ఫిర్యాదుల్లో ఎక్కువ మొత్తం పాత లేఅవుట్లు, నాలాల ఆక్రమణలపైనే ఉన్నట్లు హైడ్రా (HYDRA) అధికారులు వెల్లడించారు. గూగుల్, ఎన్ఆర్‌ఎస్‌సీ, గ్రామీణ మ్యాప్స్‌తో ఫిర్యాదులను కమిషనర్ ఏవీ రంగనాథ్ (Ranganath)క్షుణ్ణంగా పరిశీలించారు. నాలాలను, ప్రజావసరాలకు కేటాయించిన స్థలాలు కబ్జాలకు గురైతే తప్పకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ మరోసారి ఫిర్యాదుదారులకు భరోసా ఇచ్చారు. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌లో మాదిరిగానే నాలాలు ఆక్రమించి నిర్మించిన ఇళ్లు, అపార్ట్‌మెంట్లు కొనేటప్పుడు పలు జాగ్రత్తలు వహించాలని కమిషనర్ సూచించారు.
ఫిర్యాదులు ఇలా..
పోచారం మున్సిపాలిటీ, కొరెముల గ్రామం: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా, ఘట్‌కేసర్ మండలం, పోచారం మున్సిపాలిటీలోని కొరెముల గ్రామంలో 739 నుంచి 749 వరకు ఉన్న సర్వే నంబర్లలో మొత్తం 147 ఎకరాలలో 1985వ సంవత్సరంలో వేసిన ఏకశిలానగర్ లేఅవుట్‌ను 2006లో అందులోని 47 ఎకరాల మేర వ్యవసాయ భూమిగా మార్చేసి లేఅవుట్ స్వరూపాన్నే ఓ వ్యక్తి మార్చేశారని అక్కడి ప్లాట్ల యజమానులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇదే లేఅవుట్‌లో రెండు బడా రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రహరీలు నిర్మించి కొంతమేర కాజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read: GHMC: వర్క్ ఏదైన డీసీలు జడ్సీల ప్రమేయం ఉండేలా చర్యలు!
11.20 ఎకరాల భూమి
కొరెముల గ్రామం, నదెం చెరువు: పోచారం మున్సిపాలిటీ కొరెముల గ్రామం 796 సర్వే నంబర్‌లో 11.20 ఎకరాల భూమి ఉండగా, ఇందులో 7.20 ఎకరాల పరిధిలో ఓ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారని, మిగతా 4 ఎకరాల తమ భూమితో పాటు నదెం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఈ నిర్మాణాలు చేపడుతున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పంజాగుట్ట కాలనీ, ఆఫీసర్స్ కాలనీ: పంజాగుట్ట కాలనీలోని ఆఫీసర్స్ కాలనీలో వెయ్యి గజాల పార్కు స్థలం ఉండేదని, ఇందులోని 500 గజాల స్థలంలో దుర్గాభవాని ఆలయం నిర్మించారని, మిగిలిన 500 గజాల స్థలం కబ్జా కాకుండా పార్కును అభివృద్ధి చేయాలని అక్కడి నివాసితులు హైడ్రాను (HYDRA) ఆశ్రయించారు.
ఆలయంతో పాటు చుట్టూ ఉన్న దుకాణ సముదాయాల ఆదాయంతో పార్కును అభివృద్ధి చేసేలా చూడాలని కోరారు. అలాగే శ్రీనగర్ నుంచి వచ్చే వరద కాలువ తమ కాలనీకి ఆనుకుని వెళ్లేదని, ఇప్పుడా కాలువ మాయం కావడంతో వరదంతా తమ ఇళ్లను ముంచెత్తుతోందని వాపోయారు. అల్వాల్ మండలం, జొన్నబండ గ్రామం: అల్వాల్ మండలం, జొన్నబండ గ్రామంలోని వజ్ర ఎన్‌క్లేవ్‌లో 900ల గజాల పార్కు స్థలం కబ్జా అవుతోందని, దానికి ఫెన్సింగ్ వేసి కాపాడాలంటూ అక్కడి నివాసితులు హైడ్రాను (HYDRA) కోరారు. అక్కడ రహదారులను కూడా వదలకుండా కబ్జా చేస్తున్నారని, 236 ప్లాట్లకు పార్కు లేకుండా అవుతోందని వాపోయారు.
ప్రతినిధులు హైడ్రా దృష్టికి
తూముకుంట మున్సిపాలిటీ, దేవరయాంజల్ విలేజ్: తూముకుంట మున్సిపాలిటీ దేవరయాంజల్ విలేజ్‌లోని తురకోని కుంట శిఖం భూమిలో లారీల బరువును లెక్కగట్టే వేయింగ్ మెషిన్ ఏర్పాటు చేస్తున్నారని, వెంటనే ఆ పనులు ఆపి చెరువును కాపాడాలని సీతారామచంద్రస్వామి దేవస్థానం భూముల పరిరక్షణ సమితి ప్రతినిధులు హైడ్రాను (HYDRA) కోరారు. ఇదే ప్రాంతంలో దేవస్థానానికి చెందిన భూమి కబ్జాకు గురి అవుతోందని సేవ్ దేవరయాంజల్ ప్రతినిధులు హైడ్రా దృష్టికి తీసుకు వచ్చారు. దేవరయాంజల్ చెరువుకు వెళ్లాల్సిన వరద కాలువను మళ్లించడంతో ఊరు నుంచి వచ్చే మురుగు ప్రవాహానికి ఆటంకంగా మారుతోందని నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. వరద కాలువ నేరుగా చెరువుకు చేరేలా ఏర్పాట్లు చేస్తే గ్రామానికి వరద ముప్పు తప్పుతుందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు హైడ్రా (HYDRA) అధికారులు తెలిపారు.
Also Read: Local Elections: స్థానిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ప్రభుత్వం!