Thalliki Vandanam: అవును.. మీరు వింటున్నది.. చూస్తున్నది అక్షరాలా నిజమే. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘తల్లికి వందనం’ పథకంలో బోలెడన్ని అచ్చు తప్పులు, అంతకుమించి చిత్ర విచిత్రాలన్నీ చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై టీడీపీ వర్సెస్ వైసీపీ (TDP Vs YSRCP) మధ్య పెద్ద సవాళ్లు, విమర్శలు నడుస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ క్రమంలోనే ఇటీవల విడుదల చేసిన తల్లికి వందనం అర్హుల జాబితాను కాస్త నిశితంగా పరిశీలించగా విద్యార్థుల ‘తండ్రుల’ పేర్లు దర్శనమివ్వడం గమనార్హం. ఈ జాబితాను చూసిన జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకెళితే.. నంద్యాల జిల్లా పాములపాడు గ్రామానికి చెందిన జాబితాలో తండ్రి పేరు వచ్చింది. 724 మంది పేర్లు ఉన్న ఈ జాబితాలో 20 మంది లబ్దిదారులు తండ్రి పేర్లతో దర్శనమిచ్చాయి. ఇదెలా సాధ్యం..? ఎక్కడ ఏం జరిగిందో? అని జనాలు చర్చించుకుంటున్న పరిస్థితి. మరో పెద్ద విచిత్రం ఏమిటంటే జాబితాలో వరుస నెం. 93, 96 లో కేవలం ‘న’ అనే అక్షరం పేరుతో లబ్ధిదారుని పేరుగా చేర్చడం గమనార్హం.
Read Also- Thalliki Vandanam: తల్లికి వందనం నిజంగానే సూపర్ సక్సెస్ అయ్యిందా?
ఏమిటీ తేడాలు..?
తల్లికి వందనం లబ్దిదారులకు సంబంధించిన జాబితాలో ఆధార్, బ్యాంకు ఖాతాల నెంబర్లలో చిన్నపాటి వ్యత్యాసాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆ లబ్ధిదారులంతా డబ్బులు పడతాయో? లేదో? అని ఆందోళన చెందుతున్న పరిస్థితి. మరికొన్నిచోట్ల మాత్రం ఖాతాల్లో పథకం నగదు జమకాలేదని, పడుతుందో లేదో అంటూ కంగారుపడుతున్నారు. ఇంకొందరేమో గత వైసీపీ హయాంలో ఎలాంటి హడావుడి లేకుండా నేరుగా తొలిరోజే ‘అమ్మఒడి’ (Amma Vodi) నగదు పడిందని, కూటమి ప్రభుత్వం ఆ పరిస్థితి ఏమాత్రం కనిపించట్లేదని జనాలు చర్చించుకుంటున్నారు. కొన్ని చోట్ల తల్లికి వందనం జాబితాలో తన పేరు లేదని.. భర్త నాగలోకేశ్ పేరు వచ్చిందని నంద్యాల జిల్లా, పాములపాడుకు చెందిన బాలీశ్వరమ్మ ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు.. ఆధార్ నెంబరు కూడా ఆయనదే ఉందని, పథకం నగదు ఎవరి బ్యాంకు ఖాతాలో పడతాయో తెలియట్లేదని ఆమె కంగారుపడుతున్నారు. స్కూల్లో మాత్రం తన వివరాలు ఇచ్చానని.. ఇప్పుడేమో జాబితాలో ఇలా రావడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని బాలీశ్వరమ్మ చెబుతున్నారు. ఇదే పాములపాడు గ్రామానికి చెందిన పిచ్చిగుంట్ల శివక్రిష్ణ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. అర్హుల జాబితాలో తన భార్య పి. వరలక్ష్మి పేరు లేదని.. ఎందుకు రాలేదో అర్థం కావట్లేదని ఆయన చెబుతున్నారు. అనర్హుల జాబితాలోనూ లేకపోవడంతో తీరా చూస్తే పిచ్చిగుంట్ల శివక్రిష్ణ అని తనపేరు వచ్చిందన్నారు. ఆధార్ నంబరు కూడా తనదే ఉంది కానీ, నగదు విషయానికి వస్తే ఇప్పటి వరకూ ఎవరి అకౌంట్లోనూ జమ కాలేదని శివక్రిష్ణ ఆందోళన చెందుతున్నారు.
ఆ తల్లికి 21 మంది పిల్లలా?
తల్లికి వందనం అర్హుల జాబితాలో మరో విచిత్రం చోటుచేసుకున్నది. లబ్ధిదారుల జాబితాలో 21 మంది పిల్లలకు ఒకరే తల్లిగా ప్రస్తావించడంతో సదరు పేరున్న మహిళ, జనాలు ఆశ్చర్యపోతున్న పరిస్థితి. వివరాల్లోకెళితే.. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం పెడపల్లి సచివాలయం-1 పరిధిలో ఓ మహిళ వయస్సు 35 ఏళ్లలోపే ఉంటుంది. కానీ, 21 మంది పిల్లలు ఉన్నారని జాబితాలో వచ్చింది. చూశారా ఇది ఎంత విచిత్రమో.. ఒక్కసారి ఊహించుకోండి ఇది ఎంత దారుణమో..! వివరాల నమోదులో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. ఈ నెల 13న ప్రదర్శించిన జాబితాలో 458 మంది పిల్లలకు రూ.13వేలు చొప్పున జమ చేస్తున్నట్టుగా 15 పేజీలతో కూడిన జాబితా ప్రదర్శించడం జరిగింది. కానీ, ఇందులో భావన అనే మహిళ పేరు, ఆధార్ నెంబరును 21 మంది విద్యార్థులకు తల్లిగా సూచించడం గమనార్హం. దీంతో జాబితాను చూసిన జనాలు అవాక్కవుతున్నారు. వాస్తవానికి భావనకు 9వ తరగతి, ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు. మిగిలిన 19 మంది పిల్లలు ఇతరులకు, ఇతర ప్రాంతాలకు చెందినవారు. వారందరికి ఈమెనే తల్లిని చేసేశారు. ఇది ఎలా జరిగిందో.. ఏంటో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఎవరి నిర్లక్ష్యం వల్ల 19 మంది ఎక్కువగా పడిందో తెలియక.. సదరు అర్హురాలికే నవ్వాలో, ఏడవాలో అర్థం కాని పరిస్థితి. అయితే ఈ విషయంపై ఎవరిని అడగాలో.. ఏంటో కూడా తెలియక భావన.. అటు 19 మంది విద్యార్థులు పేరెంట్స్ దిక్కుతోచక ఉన్నారు. ఇలా రోజుకొక విచిత్రం చోటుచేసుకుంటూ ఉండటంతో.. ప్రభుత్వం నవ్వులపాలవుతోందని వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నది.
Read Also- Chaitu and Samanatha: నాగ చైతన్య, సమంత మళ్లీ కలవబోతున్నారా?
తల్లికి వందనంలో భారీగా అవకతవకలు
కొన్ని చోట్ల తల్లి పేరు స్థానంలో తండ్రి పేరు.. చాలా చోట్ల ఒకే ఆధార్ నెంబర్ పై పదుల సంఖ్యలో విద్యార్థుల పేర్లు
లేకలేక.. ఏడాది తర్వాత మొక్కుబడిగా ఒక్క స్కీమ్ అమలు చేస్తే.. అందులో ఇన్ని అవకతవకలా?
పథకాల్లో కమీషన్స్ కోసం… pic.twitter.com/RgmFmDZzwr
— YSR Congress Party (@YSRCParty) June 16, 2025