Local Elections: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Elections) నగరా మోగనున్నది. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ రానున్నది. అందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే మంత్రులు, నాయకులు, పార్టీ కేడర్ సన్నద్ధం కావాలని హింట్ ఇచ్చారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సంసిద్ధంగా ఉండాలని పదేపదే చెబుతున్నారు. మరోవైపు, గెలిచే అభ్యర్థులకే స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Elections) టికెట్లు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. నిత్యం ప్రజల్లో ఉన్నవారికి, ఆదరణ ఉన్నవారికి మాత్రమే టికెట్లు ఉంటాయని చెబుతున్నారు. తొలుత ఎంపీటీసీ,(MPTC) జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికలు నిర్వహిస్తారని సమాచారం.
ఏర్పాట్లలో ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది. అందుకు సంబంధిత శాఖలను సైతం అలర్ట్ చేస్తున్నది. ఈ నెలాఖరులో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. లేకుంటే జూలై ఫస్ట్ వీక్‌లో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఎన్నికలకు రంగం చేసినట్లు మంత్రులే స్పష్టం చేస్తున్నారు. కానీ తేదీని ప్రకటించకుండా మాట్లాడుతుండడంతో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వడంతోనే మంత్రులు మాట్లాడుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. లేకుంటే రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అటెన్షన్ డైవర్షన్ కోసం వ్యాఖ్యలు చేస్తున్నారా అనేది కూడా మరోవైపు ప్రచారం ఊపందుకున్నది.
గతేడాది జవనరితో సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసింది. గ్రామాలకు సర్పంచ్‌లు లేక 17 నెలలు అవుతున్నది. దీంతో ప్రజలు సైతం మౌలిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, నిధులు సైతం ఆశించిన మేర రాకపోవడంతో గ్రామాల్లో సైతం అభివృద్ధి కుంటుపడింది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రాకముందే ఎన్నికలు నిర్వహిస్తే మెజార్టీ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకోవచ్చనే అభిప్రాయంతో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం. అందుకే, ఈ నెలలో ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని పలువురు మంత్రులు సైతం సీఎం వద్ద అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Also Read: DGP in Trouble: మాకో న్యాయం పోలీసులకో న్యాయమా.. చట్టం మీకు చుట్టమా!
నేతలకు మంత్రుల హింట్
మంత్రులంతా తమ సొంత నియోజకవర్గాల పర్యటనలో ఉన్నారు. గత 20 రోజులుగా నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల ( Indhiramma Homes) నిర్మాణానికి శంకుస్థాపనలు, సన్న బియ్యం భోజనం చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారితో కలిసిపోతున్నారు. కార్యకర్తల సమావేశంలో ఎన్నికలు రాబోతున్నాయని సిద్ధంగా ఉండాలని హింట్ ఇస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, క్యాబినెట్‌లోని మంత్రులంతా వారంలో నోటిఫికేషన్ రాబోతున్నదని, ఈ నెల చివరి వారంలో ఉంటుందని మరొకరు పేర్కొంటున్నారు.
మరోవైపు, గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని, ప్రజాదరణ ఉన్నవారిని గుర్తించి వారికి ప్రాధాన్యం ఇస్తామనే సంకేతాలు ఇస్తున్నారు. నేతల చుట్టూ కాకుండా ప్రజల్లో ఉన్నవారికే పెద్దపీట వేస్తామని కేడర్‌కు సూచనలు ఇస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశాలు ఇస్తున్నారు. గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలని, ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆయా గ్రామాల్లో చిన్న చిన్న లోటు పాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం కావాలని, రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తామని స్పష్టం చేస్తున్నారు.
Also Read: Warangal District: రెడ్ క్రాస్ అవార్డు అందుకున్న.. వరంగల్ పోలీస్ కమిషనర్
పంచాయతీ అధికారులు సైతం సిద్ధం
ఇప్పటికే పంచాయతీరాజ్ అధికారులకు ఆ శాఖ ఎన్నికలపై శిక్షణ ఇచ్చింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. అదే విధంగా నిత్యం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ గ్రామాల్లోనూ మౌలిక సమస్యలపై సమీక్షిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్లను సైతం ఇప్పటికే ముద్రణలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ?
రాష్ట్రంలో ఎప్పుడైనా సర్పంచ్ ఎన్నికలు ఫస్ట్ నిర్వహించేవారు. ఆ తర్వాత ఎంపీటీసీ, (MPTC) జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికలు నిర్వహించేవారు. ఒక వేళ పార్టీ అభ్యర్ధులు సర్పంచ్‌లుగా పోటీ చేసి ఓడిపోతే, మళ్లీ ఎంపీటీసీగా అవకాశం కల్పించేవారు. దీంతో ప్రజల సానుభూతితో విజయం సాధించేవారు. కానీ ఈసారి ప్రభుత్వం ఎంపీటీసీ, (MPTC) జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికలను తొలుత నిర్వహించేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతున్నది. ఆ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగుతున్నందున పార్టీకి బలం ఏ మేరకు ఉందో స్పష్టమవుతుంది. అంతేకాదు సర్పంచ్ ఎన్నికలు ఈజీ అవుతుందని భావిస్తున్నట్లు సమాచారం. సర్పంచ్ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిసింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు సన్నద్ధం చేయడంతోపాటు అధికార పార్టీకి చెందిన పార్టీ కేడర్‌ను అలర్ట్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
నేడు మంత్రులతో సీఎం మీటింగ్
మంత్రులతో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సోమవారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. నోటిఫికేషన్ తేదీలతోపాటు ఎంపీటీసీ, (MPTC) జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికలు ముందు నిర్వహించాలా, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది స్పష్టత రానున్నట్లు సమాచారం.
సమావేశంలో స్థానిక ఎన్నికలతో పాటు కొందరు మంత్రులతో ముఖాముఖి, రైతు బంధు నిధుల విడుదల, ఇరిగేషన్(కాళేశ్వరం, బనకచర్ల ప్రాజెక్ట్), ఫోన్ ట్యాపింగ్, రాజీవ్ యువ వికాసం పథకాలపై చర్చించనున్నట్లు తెలిసింది. డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు, పలు ముఖ్య శాఖల అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని సమాచారం. ఇప్పటికే రైతు భరోసాను వారంలో జమ చేస్తామని మంత్రులు ప్రకటించారు.
సన్నద్ధమవుతున్న పార్టీలు
రాష్ట్రంలోని పార్టీలు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుందనే సమాచారంతో అలర్ట్ అవుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విజయం సాధించాలని ప్రతిపక్షాలు భావిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలు చేసిన సంక్షేమం, ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాల భర్తీని ప్రచార అస్త్రాలుగా చేసుకొని ముందుకు వెళ్లాలని భావిస్తున్నది. మెజార్టీ సీట్లు సాధించి సత్తా చాటేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అయితే, ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది చూడాలి.
Also Read: Schools Reopen: నూతనోత్సాహంతో పాఠశాలల పున:ప్రారంభం!