Plane Crash: అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో గురువారం మధ్యాహ్న సమయంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన (Air India Plane Crash) యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. విమానంలోని ప్రయాణికులు, జేబీ మెడికల్ కాలేజీ విద్యార్థులు కలిపి మొత్తం 270 మందికిపైగా మృత్యువాతపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఒక వీడియో వైరల్‌గా మారింది. విమానం క్రమంగా ఎత్తు తగ్గుతూ వెళ్లి, హాస్టల్ భవనంలోకి దూసుకెళ్లి భారీ శబ్దంతో పేలిపోయింది. ఒక్కసారిగా ఉవ్వెత్తున అగ్నిజ్వాలలు ఎగసిపడ్డాయి. అయితే, ఎయిరిండియా విమానం ఏఐ-171 ఘోర ప్రమాదానికి సంబంధించిన చివరి క్షణాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించింది ఒక 17 ఏళ్ల బాలుడు. అతడి పేరు ఆర్యన్ అసారి. అనుకోకుండా ఈ వీడియో తీశానని అతడు చెప్పాడు.
ఓంకార్ నగర్‌లోకి అదే రోజు కొత్తగా అద్దెకు దిగడంతో ఇంటి టెర్రస్‌లో నిలబడి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్న విమానాలను వీడియో తీయడం మొదలుపెట్టానని, ఆ వీడియోలను ఫ్రెండ్స్‌కి చూపించాలనుకున్నానని వివరించాడు. తాను వీడియో తీయడం మొదలుపెట్టిన 24 సెకన్లలోనే బోయింగ్ 787-7 డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోయి మంటల్లో కాలిపోయిందని ఆర్యన్ గుర్తుచేసుకున్నాడు.
Read this- Amit Shah: నక్సలిజంపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
ఒక విమానం అసాధారణంగా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్నట్టు గమనించిన తర్వాత వీడియో తీయడం మొదలుపెట్టానని చెప్పాడు. ‘‘విమానం చాలా దగ్గర నుంచి వెళ్లింది. దానిని వీడియో తీసి ఫ్రెండ్స్‌కు చూపించాలనుకున్నాను. ఎయిర్‌పోర్టు దగ్గరలోనే ఉండడంతో అది ల్యాండ్ అవడానికి వెళుతుందేమో అనుకున్నాను. కానీ, విమానం కిందకు దిగింది. చూస్తుండగానే మంటలు పైకి ఎగసిపడ్డాయి. విమానం బాగా వేగంగా వెళ్లి కుప్పకూలింది. అకస్మాత్తుగా పేలిపోయింది. ఒక్కసారిగా పొగ, విమాన శిథిలాలు గాల్లోకి ఎగసిపడ్డాయి. అవి చూసి భయమేసింది’’ అని ఆర్యన్ వివరించాడు. వెంటనే ఆ వీడియోను తన అక్కడికి చూపించానని, ఆ తర్వాత నాన్నకు విషయం చెప్పానని ఆర్యన్ తెలిపాడు.
Read this- Air India: కేరళలో బ్రిటన్ ఫైటర్ జెట్.. కదలని ఎయిరిండియా విమానం
కాగా, ఆర్యన్ చిత్రీకరించిన వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ప్రమాదానికి సంబంధించి లభించిన తొలి ఫుటేజ్ కావడంతో టీవీలతో పాటు అన్ని మాధ్యమాల్లోనూ ప్రసారమైంది. సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొట్టింది. ఆర్యన్ తీసిన వీడియోను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు (DGCA) అప్పగించారు. విమానం కుప్పకూలడానికి గల కారణాల తెలుసుకునేందుకు ఈ వీడియోను కొంతమేర విశ్లేషించే అవకాశం ఉంది.
కాగా, ప్రమాదానికి గురైన ఎయిరిండియా బోయింగ్ 787-8 విమానం అహ్మదాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్ గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయి కేవలం 625 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత, కిందకు పడడం ప్రారంభమైంది. 2 నిమిషాలలోనే జేబీ మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్‌పై కూలిపోయింది. ప్రమాదానికి ముందు ఈ విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకుంది. అప్పుడు ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. ఇక, విమాన ప్రమాదంపై డీజీసీఏ, ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) సమన్వయంతో దర్యాప్తు చేస్తున్నాయి. బ్లాక్ బాక్స్ కూడా లభ్యమవ్వడంతో దానిని కూడా విశ్లేషిస్తున్నారు.