Air India flight: అహ్మాదాబాద్ లో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. ఈ ఘటనలో 240కి పైగా దుర్మరణం చెందారు. ప్రధాని మోదీ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వయంగా ఘటనాస్థలిని పరిశీలించి.. ఆపై ఆస్పత్రిలో ఉన్న బాధితులను పరామర్శించారు. అయితే ఈ విమాన ప్రమాదం నుంచి తేరుకోకముందే మరో ఎయిర్ ఇండియా బాంబు బెదిరింపు రావడం ఒక్కసారిగా ఆందోళనలు పెంచింది.
వివరాల్లోకి వెళ్తే..
థాయిలాండ్ లోని పుకెట్ (Phuket) విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలు దేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలెట్.. విమానాన్ని తిరిగి పుకెట్ విమానశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ 379 (Flight AI 379) అండమాన్ సముద్రంపై ప్రయాణిస్తుండగా ఈ బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అప్రమత్తమైన పైలెట్ ఏం చేయాలో తెలియక కొద్ది సేపు సముద్రం మీదనే చక్కర్లు కొట్టినట్లు థాయిలాండ్ మీడియా పేర్కొంది. అనంతరం అధికారుల సూచన మేరకు బయలుదేరిన విమానాశ్రయంలో ఫ్లైట్ ను ల్యాండ్ చేశారని వివరించింది.
బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
బాంబు బెదిరింపుల నేపథ్యంలో అప్పటికే పుకెట్ విమానశ్రయంలోని సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తయ్యారు. ఎయిర్ ఇండియా విమానం దిగిన వెంటనే అందులోని 156 మంది ప్రయాణికులను వెంటనే కిందకు దించేశారు. అనంతరం విమానంలో బాంబ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేశాయి. అయితే లోపల ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని భద్రతాధికారి ఒకరు స్పష్టం చేశారు. అయితే ఓ ప్రయాణికుడికి విమానంలో బాంబు బెదిరింపు నోట్ దొరికిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అతడ్ని విచారిస్తున్నట్లు వివరించారు. భారత కాలమానం ప్రకారం విమానం థాయిలాండ్ లోని పుకెట్ నుంచి 9:30 గంటలకు బయలుదేరినట్లు పేర్కొన్నారు.
Also Read This: Bail to Kommineni: కొమ్మినేనికి భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
265 మంది మృత్యువాత
అహ్మాదాబాద్ ప్రమాద సమయంలో ఎయిర్ ఇండియా విమానంలో 242 ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 241 మంది ప్రాణాలు కోల్పోగా ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. విమానంలో 169 మంది భారత పౌరులు, 55 మంది బ్రిటన్ కు చెందిన వారు ఉన్నారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణీ ఉండటం మరింత వేదనను మరింత పెంచుతోంది. అయితే విమానం బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహంపై కుప్పకూలడంతో మరణాలు సంఖ్య మరింత పెరిగింది. హాస్టల్ లోని 24 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.