Raja Raghuvanshi Case: మేఘాలయాలో జరిగిన హనీమూన్ మర్డర్ (Honeymoon) కేసుకు సంబంధించి విస్తుపోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. భర్త రాజా రఘువంశీని సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించిన భార్య సోనమ్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ప్రధాన సూత్రధారిగా ఉన్న సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలో రోజుకో షాకింగ్ నిజం బయటకు వస్తోంది. తాజాగా పోలీసుల విచారణలో మరో సంచలన విషయం వెలుగు చూసింది. ఇది విని పోలీసులు సైతం అవాక్కైనట్లు తెలుస్తోంది.
మరో హత్యకు కుట్ర!
ఇండోర్ కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీని హత్య చేసిన దుండగులు.. ఆ తర్వాత మరో స్త్రీని సైతం హత్య చేయాలని భావించినట్లు మేఘాలయ తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా ఎస్పీ వివేక్ సయీమ్ తెలిపారు. రాజా – సోనమ్ పెళ్లి జరిగిన మే 11వ తేదీనే హత్యకు కుట్ర జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సోనమ్ తో పాటు ఆమె ప్రియుడు రాజ్ కుష్వారా అంగీకరించారని చెప్పారు. హత్యకు సుపారీ తీసుకున్న ముగ్గురు వ్యక్తులను విశాల్, ఆకాష్, ఆనంద్ లుగా గుర్తించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఆ ముగ్గురూ స్నేహితులని.. కిల్లర్లలో ఒకరు సోనమ్ ప్రియుడు రాజ్ కు బంధువు అవుతాడని వివరించారు.
మరో స్త్రీ హత్యకు కుట్ర
రాజా రఘువంశీ హత్యకు ఇండోర్ (Indore)లోనే కుట్ర మెుదలైందని తూర్పు ఖాసీ హిల్స్ ఎస్పీ వివేక్ సయీమ్ స్పష్టం చేశారు. ఖర్చుల కోసం ముగ్గురు కిల్లర్స్ కి రాజ్ రూ.50,000 ఇచ్చినట్లు తెలిపారు. రాజా రఘువంశీ హత్య తర్వాత సోనమ్ పై నింద రాకుండా ఎలా తప్పించాలని కూడా వారు ప్లాన్స్ వేశారని ఎస్పీ తెలిపారు. ఆమె నదిలో కొట్టుకుపోయినట్లు కథ అల్లితే ఎలా ఉంటుందని తొలుత భావించారని అన్నారు. లేకపోతే వేరే మహిళను హత్య చేసి ఆమె శవాన్ని దహనం చేయడం ద్వారా సోనమ్ బాడీగా నమ్మించాలని కూడా కుట్ర చేసినట్లు వివరించారు. అయితే అవేమి వర్కౌట్ కాలేదని నిందితులు అంగీకరించారని ఎస్పీ వివరించారు.
Also Read: Gold Rate Today: మహిళలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పసిడి ధరలు.. ఇక కష్టమే!
అసోంలో మిస్.. మేఘాలయలో ఫినిష్
మేఘాలయాకు రాక ముందు మే 19న రాజా రఘువంశీ – సోనమ్.. అసోంలో పర్యటించారని పోలీసులు గుర్తించారు. అక్కడి గౌహతి ప్రాంతంలోనే రాజాను హత్య చేయాలని సుపారీ గ్యాంగ్ భావించిందని తెలిపారు. అక్కడ కుదరకపోవడంతో మేఘాలయ షిల్లాంగ్ లోని సోహ్రా ప్రాంతానికి వెళ్దామని సోనమ్ తన భర్తను ఒప్పించిందని విచారణలో తేలింది. ఇందులో భాగంగా కిల్లర్స్ అందరూ సోహ్రాలోని నోంగ్రియాట్ గ్రామంలో సమావేశమై హత్యకు పథకం రచించారని తేలింది. విసావ్ డాంగ్ జలపాతం వద్దకు రాజా రఘువంశీని సోనమ్ తీసుకురాగానే మే 23 మధ్యాహ్నం 2.18 గంటలకు అతడిపై దాడి చేసినట్లు కిల్లర్స్ ఒప్పుకున్నారు. అసోంలోనే కొనుగోలు చేసిన కత్తితో అతడ్ని చంపి.. మృతదేహాన్ని లోయలో పడేశామని నిందితులు అంగీకరించారు. ఈ తతంగమంతా సోనమ్ కళ్లెదుటే జరగడం గమనార్హం.