GHMC Commissioner: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీలో అవినీతికి బ్రేక్ వేసేందుకు ఎన్ని సంస్కరణలు ప్రవేశపెట్టినా, ఫలితం దక్కటం లేదు. ఇప్పటికే అక్రమ నిర్మాణాలను అదుపు చేయటంలో టౌన్ ప్లానింగ్ విభాగం లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తటంతో పాటు ఇటీవలే 27 మంది న్యాక్ ఇంజనీర్లను అవినీతి ఆరోపణలతో విధుల నుంచి తొలగించగా, ఇపుడు తాజాగా మరో దోపిడీ బయట పడింది. వేయని రోడ్డు వేసినట్లు ఏకంగా రూ. 10 లక్షల జీహెచ్ఎంసీ నిధులకు టోకర్ వేసేందుకు యత్నించిన కాంట్రాక్టర్‌కు సహకరించిన ఇద్దరు ఇంజనీర్లను సస్పెన్షన్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐఎస్ సదన్ కార్పొరేటర్ జే.శ్వేత ఫిర్యాదు చేస్తే గానీ విషయం బయటకు రాకుండా కాంట్రాక్టర్, ఇంజనీర్లు ఎంతో జాగ్రత్త పడినా చివరకు అడ్డంగా బుక్ అయ్యారు.
రోడ్డు నిర్మాణానికి రూ.9.90 లక్షలు
ఐఎస్ సదన్ డివిజన్‌లోని సింగరేణి స్లమ్‌లో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.9.90 లక్షల ప్రతిపాదనకు 2024 ఆగస్టు 24న మంజూరీ ఇవ్వగా, అధికారులు టెండర్లు చేపట్టి ఖాన్ కన్ స్ట్రక్షన్ అనే కాంట్రాక్టర్‌కు రోడ్డు నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. సదరు కాంట్రాక్టర్, డీఈ, ఈఈగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇంజనీర్ ఏకాంబరం, అసిస్టెంట్ ఇంజనీర్, వర్క్ ఇన్ స్పెక్టర్‌గా పని చేస్తున్న అన్సారి సదరు కాంట్రాక్టర్ కలిసి పనులు చేయకుండానే బిల్లులు కొల్లగొట్టారు. వేయని రోడ్డును వేసినట్లు బిల్లులు తయారు చేసి, దానికి క్వాలిటీ కంట్రోల్ రిపోర్టును కూడా ఫోర్జరీ చేసి జత చేసిన బిల్లులు నొక్కేశారు. ఎన్ని రోజులు గడుస్తున్నా, ఇంకా రోడ్డు వేయకపోవటంతో స్థానికులు సైతం అధికారులను నిలదీయ సాగారు. ఈ క్రమంలో వేయని రోడ్డుకు అంచనా వ్యయంగా అధికారులు నిర్ణయించిన రూ.9.90 లక్షలను కాంట్రాక్టర్, ఇంజనీర్లు కుమ్మక్కై కొల్లగొట్టినట్లు కార్పొరేటర్ కు సమాచారమందటంతో ఆమె నేరుగా కమిషనర్ ఆర్. వి. కర్ణన్ ను కలిసి ఫిర్యాదు చేశారు.
Also Read: Air India Flight Crashed: కుప్పకూలిన విమానం.. ఫ్లైట్‌లో మాజీ సీఎం.. 100 మందికి పైగా మృతి?
ఎవరికి అనుమానం రాకుండా
దీంతో కమిషనర్ విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించగా, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు స్థాయి అధికారి ఆ రోడ్డుకు సంబంధించి ప్రతిపాదనల స్థాయి నుంచి బిల్లుల చెల్లింపు వరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నివేదికను కమిషనర్‌కు సమర్పించారు. చేయని పనికి కాంట్రాక్టర్, ఇంజనీర్లు కలిసి బిల్లులు నొక్కేశారని, ఇంకా ఎవరికి అనుమానం రాకుండా వేయని రోడ్డుకు క్వాలిటీ కంట్రోల్ రిపోర్టును ఫోర్జరీ చేసి సమర్పించినట్లు కూడా విజిలెన్స్ తన విచారణలో తేల్చింది. దీంతో కమిషనర్ డీఈ, ఈఈ గా విధులు నిర్వహిస్తున్న ఎకాంబరం పై సస్పెన్షన్ వేటు వేయగా, ఏఈ, వర్క్ ఇన్ స్పెక్టర్ అన్సారీని విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. అడ్డదారిలో నొక్కేసిన రూ.9.90 లక్షల్లో రూ.8.93 లక్షలను కాంట్రాక్టు సంస్థ నుంచి రికవరీ చేయాలని కమిషనర్ కర్ణన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కొత్త రోడ్ల నిర్మాణం, పాత రోడ్ల రీ కార్పెటింగ్ పనులపై స్పెషల్‌గా దృష్టి సారించాలని, ఫీల్డు లెవెల్‌లో తప్పకుండా తనిఖీలు నిర్వహించి, అన్నిసక్రమంగా ఉంటేనే బిల్లులు మంజూరు చేయాలని కమిషనర్ ఆదేశాలిచ్చినట్లు తెలిసింది.
Also Read: Mahabubabad Mandal Schools: ఆ పాఠశాలకు ఎందుకంత దుర్గతి.. పట్టించుకోని అధికారులు