AirIndia Plane Crash: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా బోయింగ్-787 డ్రీమ్‌లైనర్ విమానం జనావాసంలో కూలడంతో ఆ ప్రదేశంలో బీతావాహ పరిస్థితి నెలకొంది. బీజే మెడికల్ కాలేజ్ సివిల్ హాస్పిటల్‌లోని రెసిడెంట్ డాక్టర్ల హాస్టల్‌లోకి విమానం దూసుకెళ్లడంతో భారీగా నష్టం జరిగింది. ఘటనా స్థలానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు హాస్టల్ భవనం తీవ్రంగా ధ్వంసమైనట్టు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. విమానం తోక భాగం హాస్టల్ పైఅంతస్తుపై కూలిపోయింది. విమానం ముందుభాగం హాస్టల్ భవనంలోకి దూసుకెళ్లింది. కొంతభాగం గోడకు ఇరుక్కుపోయింది. ఈ మేరకు విమానం వెనుక చక్రాల శిథిలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రదేశంలో భారీగా శిథిలాలుపడ్డాయి.
ఐదుగురి మృతి
విమానం కూలిన దుర్ఘటనలో బీజే మెడికల్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు చనిపోయారు. మృతుల్లో నలుగురు అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు కాగా, ఒకరు పోస్టుగ్రాడ్యుయేట్ రెసిడెంట్ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది.
Read this- Air India Plane Crash: విమాన ప్రమాదంలో మాజీ సీఎం.. బంధువులు ఏమంటున్నారంటే
టేబుల్ మీద ఆహారం
బీజే మెడికల్ కాలేజీ విద్యార్థులు సరిగ్గా లంచ్ చేస్తున్న సమయంలోనే విమానం కుప్పకూలింది. హాస్టల్ భవనం లోపలి దృశ్యాలను పరిశీలిస్తే.. ప్రమాదంలో హాస్టల్ క్యాంటీన్ తీవ్రంగా దెబ్బతిన్నది. భోజన సమయం కావడంతో టేబుల్ మీద ప్లేట్లలో ఆహారం, పక్కనే వాటర్ గ్లాసులు కనిపించాయి. ఇక, విమానం కూలిన ప్రదేశానికి ఆనుకొని ఉన్న రెసిడెంట్ డాక్టర్ హాస్టల్ భవనంలోని ఒక భాగం మంటల్లో చిక్కుకుంది. మంటల్లో వంటగది కూడా దెబ్బతిన్నది. విమానం ఫ్యూజ్‌లేజ్‌లో కొంత భాగం హాస్టల్‌కు సమీపంలోని ప్రదేశంలో పడింది. హాస్టల్ వెలుపల విమాన శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అంతేకాదు, మంటల ధాటికి ప్రమాద స్థలంలోని చెట్లు చాలా వరకు కాలిపోయాయి. భవనాలు మసిపట్టి నల్లగా మారాయి. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మంటలను ఆర్పివేశారు. వైద్యుల హాస్టల్‌పై ఎయిరిండియా విమానం కుప్పకూలడంపై ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, అవసరమైన సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని వివరించింది.
Read this- Plane Crash Reactions: విమాన ప్రమాదంపై ప్రముఖుల స్పందన.. రాహుల్ గాంధీ కీలక ప్రకటన
కేంద్రం కీలక ప్రకటన
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం మధ్యాహ్న సమయంలో జరిగిన ‘ఎయిరిండియా బోయింగ్ 787 స్టార్‌లైనర్’ (Boeing StarLiner) విమాన ప్రమాదంపై (Air India Plane Crash) కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ‘విషాదకరమైన ప్రమాదం’గా అభివర్ణించింది. ఈ మేరకు విదేశాంగ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ దుర్ఘటనలో భారీ ప్రాణనష్టం జరిగిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తు్న్నట్టు పేర్కొన్నారు. ‘‘అహ్మదాబాద్‌లో జరిగిన ప్రమాదం విషాదకరమైనది. చాలా మందిని కోల్పోయాం. ప్రియమైన వారిని కోల్పోయిన అందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం’’అని ప్రకటనలో రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. విమాన ప్రమాద బాధితుల్లో విదేశీయులు కూడా ఉన్నారని రణధీర్ జైస్వాల్ వివరించారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన మిగతా వివరాలను సంబంధిత విభాగాలు తెలియజేస్తాయని పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నందున, కచ్చితమైన వివరాలు చెప్పలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. కాగా, ప్రమాదానికి గురైన సమయంలో విమానంలో మొత్తం 242 మంది ఉండగా, 169 మంది భారతీయులు ఉన్నారు. 53 మంది బ్రిటన్ పౌరులు, ఒక కెనడియన్, ఏడుగురు పోర్చుగీస్ పౌరులు ఉన్నారు.