Ahmadabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశ చరిత్రలో తీవ్ర విషాదంగా మిగిలిపోయింది. అందులో ప్రయాణించిన ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశమే లేదని స్థానిక పోలీసులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్యపై జరుగుతున్న రకరకాల ప్రచారాలకు చెక్ పడింది. కేవలం విమానంలోని ప్రయాణికులు, సిబ్బందే కాదు, హాస్టల్ భవనంలోని మెడికల్ ట్రైనీ డాక్టర్లు కూడా కొందరు చనిపోయినట్టు తెలిపారు.
ప్రాణాలతో బయటపడిన వారు లేరు?
అహ్మదాబాద్ నగర పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్ మీడియాతో మాట్లాడారు. విమానం నివాస ప్రాంతాల్లో కూలిందని తెలిపారు. ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన వారు లేరని తెలుస్తోందని అన్నారు. అంతేకాదు, కూలిపోయిన మెడికల్ కాలేజీ హాస్టల్‌లోనూ మరిన్ని మరణాలు సంభవించినట్టు వివరించారు.
విమానాశ్రయ కార్యకలాపాలు ప్రారంభం
అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో విమాన కార్యకలాపాలు పునఃప్రారంభించారు. ఎయిర్ ఇండియా ప్రమాదం వల్ల మధ్యాహ్నం సమయంలో అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. నాలుగు గంటల పాటు అక్కడ విమాన సేవలు నిలిచిపోయాయి. వాటిని తిరిగి ప్రారంభించినట్టు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Read Also- Amma Mata Anganwadi Bata: మా పాపకు అంగన్‌వాడీ కిట్ కథలే చెబుతున్నా.. కలెక్టర్ వల్లూరి క్రాంతి
సెల్ఫీ వీడియో వైరల్
విమాన ప్రమాదానికి ముందు ప్రయాణికుల సెల్ఫీ వీడియో ఒకటి బయటకొచ్చింది. గుడ్ బై ఇండియా అంటూ ఇద్దరు బ్రిటీష్ ప్రయాణికులు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఎన్నో జ్ఞాపకాలతో విమానం ఎక్కిన వారు, ప్రమాదం బారినపడ్డారు. సోషల్ మీడియాలో బ్రిటీష్ ప్రయాణికుల సెల్ఫీ వీడియో వైరల్ అవుతున్నది.
విమానం లోపలి వీడియో..
మరోవైపు, ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో సంచలన విషయం వెలుగుచూసింది. అదే విమానంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడు ఆకాష్, విమానంలో పరిస్థితిని వీడియో తీశాడు. ఏసీలు పనిచేయడం లేదని, అంతా అస్తవ్యస్తంగా ఉందన్న వీడియోలో చెప్పాడు. ఇలాంటి విమానాన్ని ఎలా నడుపుతున్నారంటూ ఎయిర్ ఇండియాను ప్రశ్నించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఎయిర్ ఇండియా తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలోనూ విమర్శలు
గతంలో పలుమార్లు ఇదే బోయింగ్ 787 విమానం ప్రమాదం నుంచి బయటపడినట్టు సమాచారం. రెండు సార్లు పొగ రావడంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు. గత డిసెంబర్‌లో పారిస్ వెళ్తుండగా సాంకేతిక లోపంతో షార్జాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. డీజీసీఏ దీనిపై అలర్ట్ చేసినా ఎయిర్ ఇండియా పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.