Ahmadabad Plane Crash: అహ్మదాబాద్ ఘోర విషాదంలో 120 మంది వరకు చనిపోయినట్టు ప్రచారం జరుగుతున్నది. జాతీయ మీడియాలో ఇందుకు సంబంధించిన కథనాలు వెలువడుతున్నాయి. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే కూలిపోయింది.
మెడికల్ కాలేజీ హాస్టల్‌పై..
ప్రమాదానికి గురైన విమానం కంట్రోల్ తప్పి ఓ భవనంపై పడింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అధికారిక వర్గాల ప్రకారం, విమానం పడిన భవనం బీజే మెడికల్ కాలేజీలోని ఇంటర్న్ డాక్టర్ల హాస్టల్. మధ్యాహ్నం వారు భోజనం చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పెద్ద శబ్ధంతో విమానం భవనంపై పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హాస్టల్ భవనానికి విమానంలోని కొంత భాగం వేలుడుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
Read Also- Air India: పైలట్ చివరి మాటలు.. మేడే కాల్ అంటే ఏంటి?
విమానాశ్రయం మూసివేత
ప్రమాదం నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. తదుపరి నోటీస్ వచ్చే వరకు కార్యకలాపాలన్నీ నిలిపివేస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు విమానయాన సంస్థలను సంప్రదించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుంటారని తాము ఆశిస్తున్నట్టు తెలిపారు.
స్పాట్‌కు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
ఎయిర్ ఇండియా విమాన ఘటన నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మూడు జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందాలు గాంధీనగర్ నుంచి ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయి. వడోదర నుంచి మరో మూడు బృందాలను అహ్మదాబాద్ చేరుస్తున్నారు. ఇప్పటికే పోలీసులు, ఇతర సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ హాట్‌లైన్ నెంబర్లను ప్రకటించింది. ప్రమాదం నేపథ్యంలో ప్రయాణికుల కుటుంబసభ్యుల సమన్వయం కోసం ఆపరేషనల్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించింది. ప్రమాదంపై ఎలాంటి సందేహాలు ఉన్నా కుటుంబసభ్యులు 011-24610843 లేదా 9650391859 నెంబర్లను సంప్రదించాలని కోరింది.
ఏటీసీకి మేడే కాల్
ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు ఎయిర్ ఇండియా విమానం ఏఐ 171 పైలట్లు అహ్మదాబాద్ ఏటీసీని సంప్రదించారు. మేడే కాల్ అని సందేశం ఇచ్చారు. రేడియో కమ్యునికేన్ ద్వారా చేసిన ఈ మేడే కాల్ ప్రాణాంతక అత్యవసర హెచ్చరికగా అధికారులు పేర్కొన్నారు.
Read Also- Surekha Vani Tatto: ఇది నీకు మంచిగా అనిపిస్తుందా.. ఎందుకంత ఓవరాక్షన్!