Air India: అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొద్ది నిమిషాలకే కుప్పకూలింది. దాదాపు 852 అడుగుల ఎత్తు నుంచి పడిపోయింది. ఆ సమయంలో 230 మంది ప్రయాణికులతోపాటు 12 మంది సిబ్బంది ఉన్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే సిగ్నల్స్ కోల్పోయినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పైలట్ చివరి మాటలు వైరల్ అవుతున్నాయి.
కెప్టెన్ చివరి సందేశం
కూలిపోయిన విమానానికి కెప్టెన్‌గా సుమీత్ సభర్వాల్ ఉన్నారు. ఈయనకు 8,200 గంటల అనుభవం ఉన్నది. కో పైలట్‌కు 1,100 గంటల విమానయాన అనుభవం ఉన్నది. ఏటీసీ చెప్తున్న దాన్ని బట్టి విమానం అహ్మదాబాద్ నుండి రన్‌వే 23 నుండి బయలుదేరింది. కాసేపటికే మేడే మేడే అని కో పైలట్ అత్యవసర సందేశం ఇచ్చారు. ఇది జరిగిన తర్వాత రేడియో ఆఫ్ అగిపోయింది. మేడే కాల్ వచ్చిన తర్వాత విమానం నుంచి ఎటువంటి స్పందన రాలేదని పౌర విమానయాన డైరెక్టరేట్ (డీజీసీఏ) ధృవీకరించింది.
Read Also- Air India Plane Crash: విమానం ప్రమాదంపై వెలుగులోకి సంచలన నిజాలు
అసలు ఈ మేడే కాల్ ఎందుకిస్తారు?
మేడే కాల్ అనేది ఏదైనా విమానం అత్యవసర ప్రమాద సమయంలో చెప్తారు. ఇది ఫ్రెంచ్ పదం. మైడర్ నుంచి ఉద్భవించింది. ‘‘నాకు సాయం చేయి’’ అని దీని అర్థం. రేడియో కమ్యునికేషన్ ద్వారా ఏటీసీకి లేదా ఇతర విమానాలకు దీన్ని చెప్పే వీలుంటుంది.
ఎయిర్ ఇండియా ప్రకటన
అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్‌కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన తర్వాత ప్రమాదానికి గురైందని ఎయిర్ ఇండియా ధృవీకరించింది. దీనికి సంబంధించి ఓ ప్రకటన విడుదల చేసింది. విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, ఒకరు కెనడా, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు ఉన్నట్టు చెప్పింది. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మరింత సమాచారం అందించడానికి 1800 5691 444 అనే ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్‌ను ఏర్పాటు చేసినట్టు వివరించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఎయిర్ ఇండియా పూర్తి సహకారాన్ని అందిస్తుందని స్పష్టం చేసింది.
Read Also- Tollywood: పవన్ కళ్యాణ్ లేఖ పని చేస్తోంది.. ఏపీ సీఎం చెంతకు సినీ ఇండస్ట్రీ!