Rahul Gandhi Letter: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) బహిరంగ లేఖ రాశారు. దేశంలోని వెనుకబడిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ హాస్టళ్లలో నెలకొన్న దయనీయ పరిస్థితుల గురించి లేఖలో ప్రస్తావించారు. అట్టడుగు వర్గాల యువత అభివృద్ధి చెందకపోతే.. దేశం అభివృద్ధి చెందదని తాను భావిస్తానని పేర్కొన్నారు. రాహుల్ లేఖలోని ప్రధాన అంశాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
హాస్టళ్ల దుస్థితిపై..
దళిత, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన హాస్టళ్లలో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అసహనం వ్యక్తం చేశారు. దయనీయ పరిస్థితులు నెలకొని ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. బీహార్‌లోని దర్భంగాలో అంబేద్కర్ హాస్టల్‌ను సందర్శించినప్పుడు ఈ పరిస్థితులను స్వయంగా గమనించినట్లు తెలిపారు. అక్కడి స్కాలర్‌షిప్ పోర్టల్ మూడు సంవత్సరాలుగా పనిచేయడం లేదని, 2021-22లో ఏ విద్యార్థికి కూడా స్కాలర్‌షిప్ లభించలేదని రాహుల్ పేర్కొన్నారు. హాస్టళ్లలో ప్రాథమిక సౌకర్యాలైన శుభ్రమైన నీరు, విద్యుత్, సరైన గదులు, శానిటేషన్ వంటివి లోపించాయని ఆరోపించారు.
Also Read: KCR Ghosh Panel Interrogation: విచారణలో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్ అభ్యర్థన.. కమిషన్ కీలక నిర్ణయం!
స్కాలర్‌షిప్ సమస్యలు
దర్భంగాలోని అంబేద్కర్ హాస్టల్ చూసినే పరిస్థితులే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నట్లు రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన 90 శాతం మంది విద్యార్థులు స్కాలర్ షిప్ ల ఆలస్యం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ తెలిపారు. స్కాలర్‌షిప్‌లను సకాలంలో అందించాలని, అలాగే ప్రస్తుత ఆర్థిక అవసరాలకు అనుగుణంగా స్కాలర్ షిప్ మొత్తాన్ని పెంచాలని లేఖలో డిమాండ్ చేశారు. వెనకబడిన వర్గాలకు చెందిన స్టూడెంట్స్ తమ విద్యాహక్కుల కోసం పోరాడుతున్నారని రాహుల్ అన్నారు. వారి సమస్యలను పరిష్కరించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.