Boy Swallows Bulb: అత్యంత సున్నితంగా ఉండే పసిబిడ్డలు పొరపాటున తూలి పడితేనే విలవిల్లాడిపోతారు. భయం, బాధతో గుగ్గ పెట్టి ఏడుస్తారు. అలాంటిది, కేవలం 9 నెలల వయసున్న ఓ పసికందు బొమ్మ ఫోన్‌తో ఆడుకుంటూ, పసితనంతో ఎల్‌ఈడీ బల్బును (Boy Swallows Bulb) మింగేశాడు. గుజరాత్‌లో (Gujarath) ఈ షాకింగ్ ఘటన జరిగింది.
రెండు వారాలుగా దగ్గు
ఎల్‌ఈడీ బల్బుని మింగిన చిన్నారి పేరు మొహమ్మద్. బాలుడు రెండు వారాలుగా విపరీతమైన దగ్గు, ఛాతిలో నొప్పితో బాధపడడంతో తల్లిదండ్రులు తబస్సుమ్, జునైద్ యుసుఫ్‌లకు సందేహం వచ్చింది. జలుబు, ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ లేకుండానే దగ్గు ఆగకుండా వస్తుండడంతో, తాము నివసిస్తున్న జునాగఢ్‌లోనే ఓ పిల్లల వైద్యుడికి చూపించారు. బాలుడు ఎల్‌ఈబీ బల్బు మింగాడని గుర్తించారు. ఎక్స్‌రే తీసి చూడగా, శ్వాస నాళంలో ఎల్‌ఈడీ బల్బు ఇరుక్కున్నట్టు నిర్ధారించారు. దీంతో, బాలుడి తల్లిదండ్రులు వెంటనే అహ్మదాబాద్ తీసుకెళ్లారు. అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు బల్బుని విజయవంతంగా తొలగించారు. ఈ విషయాన్ని హాస్పిటల్ వర్గాలు శనివారం వెల్లడించాయి.
Read this- Sundar Pichai: లైఫ్‌లో సక్సెస్ కావాలా.. సుందర్ పిచాయ్ గురించి తెలుసుకోవాల్సిందే!
డబ్బులు లేక ప్రభుత్వ ఆస్పత్రికి
బాలుడు మొహమ్మద్ తండ్రి జునైడ్ యుసఫ్ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దీంతో, జునాగఢ్‌లోని వైద్యులు బాలుడిని రాజ్‌కోట్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని సూచించినా, తల్లిదండ్రులు మాత్రం అహ్మదాబాద్‌లోని సివిల్ హాస్పిటల్‌కు (ప్రభుత్వ) తరలించారు. అక్కడి డాక్టర్లు జూన్ 3న బాలుడి పరిస్థితిని గుర్తించి వెంటనే పిడియాట్రిక్ సర్జరీ డిపార్ట్‌మెంట్‌లో చేర్చారు. పిడియాట్రిక్ సర్జరీ డిపార్ట్‌మెంట్ డా.రాకేష్ జోషి, అనెస్తేసియా డిపార్ట్‌మెంట్‌కు చెందిన డాక్టర్ నీలేష్, బృందం విజయవంతంగా బ్రాంచోస్కోపీ (మెడికల్ ప్రక్రియ) నిర్వహించారు. బాలుడి శ్వాసనాళం నుంచి ఎల్‌ఈడీ బల్బుని విజయవంతంగా బయటకు తీశారు. ఆపరేషన్ నిర్వహించిన తర్వాత బాలుడి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకుంటాడని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతాడని ఓ డాక్టర్ చెప్పారు.
Read this- Pawan Kalyan: బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్.. పవన్ కళ్యాణ్ తో పోటీ పడనున్న బాలయ్య
ఆట బొమ్మలతో జాగ్రత్త
పిల్లల్లో ఎలాంటి అనారోగ్య లక్షణాలు, అసాధారణ ప్రవర్తన కనిపించినా అలసత్వం వహించకుండా తల్లిదండ్రులు వెంటనే డాక్టర్లను సంప్రదించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆటవస్తువులు, ఇతర పదార్థాలను మింగినప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పిల్లలు ఆడుకుంటున్నా సరే వారి మీద పెద్దవాళ్ల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని, తద్వారా ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చని సలహా ఇచ్చారు. బాలుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ, ప్రమాదవశాత్తూ ఎల్ఈడీ బల్బుని మింగేశాడని చెప్పారు. బొమ్మ ఫోన్‌తో ఆడుకున్నాడని, బల్బు ఫోన్ నుంచి విడిపోయిందని, దానితో ఆడుకుంటూ మింగి ఉంటాడని చెప్పారు. బాలుడి ఇబ్బందిపడుతుండేవాడని, ప్రతి రోజూ దగ్గుతూనే ఉండేవాడని పేర్కొన్నారు. ఆటబొమ్మలతో ఎదురయ్యే ప్రమాదాలపై తల్లిదండ్రులు, పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిల్లల వైద్య నిపుణులు సూచించారు.