National Women’s Commission: అమరావతి రాజధానిపై జర్నలిస్ట్ వాడపల్లి కృష్టంరాజు (Vadapalli Krishnam raju) చేసిన వ్యాఖ్యలు ఏపీ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాక్షి ఛానెల్ లో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన డిబెట్ లో వాడపల్లి మాట్లాడుతూ.. రాజధాని చుట్టుపక్కల వేశ్యలు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై రాజధాని మహిళలతో పాటు టీడీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా కేసులు సైతం నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే డిబేట్ నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivasa Rao)ను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఇదిలా ఉంటే ఈ అంశంపై జాతీయ మహిళా కమిషన్ (NCW) సైతం తీవ్ర స్థాయిలో స్పందించింది.
ఏపీ డీజీపీకి కీలక ఆదేశాలు
జర్నలిస్ట్ వి.వి.ఆర్. కృష్ణం రాజు టీవీ డిబేట్ సందర్భంగా అమరావతిలోని మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు మహిళా ఛైర్మన్ విజయ రహట్కర్ (Vijaya Kishore Rahatkar) ఏపీ డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమల రావుకి లేఖ రాశారు. మహిళలను అవమానించిన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. అసహ్యకరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు లేఖలో అన్నారు. తక్షణమే నిర్దిష్ట కాలపరిమితిలో విచారణ జరిపి సంబంధిత చట్టాల ప్రకారం కృష్ణం రాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాదు 3 రోజుల్లోగా కృష్ణంరాజుపైన తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను పంపించాలని కూడా డీజీపీని ఆమె ఆదేశించారు.
సజ్జలపై కూడా ఫిర్యాదు!
మరోవైపు వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీజీపీకి లేఖ రాసిన ఆయన.. సోమవారం సజ్జల నిర్వహించిన ప్రెస్ మీట్ గురించి ప్రస్తావించారు. కుల వివక్షకు సంబంధించిన పదం వాడిన సజ్జలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన దూషణలు అమరావతిలోని వేలాది మంది మనోభావాలను దెబ్బతీశాయని లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు.
Also Read: Sundar Pichai: లైఫ్‌లో సక్సెస్ కావాలా.. సుందర్ పిచాయ్ గురించి తెలుసుకోవాల్సిందే!
సజ్జల ఏమన్నారంటే?
జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ను ఖండిస్తూ సోమవారం వైసీపీ నేత సజ్జల రామకృష్ణరెడ్డి (Sajjala Ramakrishna Reddy) ప్రెస్ మీట్ నిర్వహించారు. మహిళలు చేస్తున్న ఆందోళనలు కృత్రిమమైనవని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నిరసనలు చేస్తున్న మహిళలను పిశాచాలు, రాక్షసులు అంటూ సజ్జల వ్యాఖ్యానించారు. సంకర జాతి అనే పదజాలాన్ని ఉపయోగిస్తూ ఘాటు విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు సైతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారానికి కారణమయ్యాయి.