IAS Bribe Scandal: ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత స్థాయి అధికారుల నిజాయితీపై కూడా నమ్మకం సన్నగిల్లుతోంది. లంచాలు, అవినీతి వ్యవహారాల్లో వేలుపెట్టి విశ్వాసాన్ని కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా వెలుగు చూస్తున్న ఘటనలే ఇందుకు తార్కాణం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఒడిశాలోని (Odhisha) కలహండి జిల్లా సబ్-కలెక్టర్‌గా పనిచేస్తున్న ధిమాన్ చక్మా (Dhiman Chakma) అనే ఐఏఎస్ అధికారి ఏకంగా రూ.10 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. రాష్ట్ర విజిలెన్స్ విభాగం అధికారులు ఆయనను ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. రాష్ట్ర అధికారులు ఈ విషయాన్ని సోమవారం ధ్రువీకరించారు.
స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి చాకచక్యంగా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. కొన్ని గంటల పాటు విచారణ జరిపిన తర్వాత ఆయనను అరెస్టు చేసి, స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం సదరు అధికారి బెయిల్ పిటిషన్‌పై కోర్టు విచారణ జరుపుతోంది.
Read this- Maoists: పోలీసుల వాహనాన్ని.. పేల్చిన మావోయిస్టులు!
జయపట్నలోని ఒక స్టోన్ క్రషర్ కంపెనీ యజమాని నుంచి చక్మా ఏకంగా రూ.20 లక్షలు డిమాండ్ చేశాడని విజిలెన్స్ అధికారులు తెలిపారు. డబ్బులు చెల్లించకపోతే ప్రభుత్వపరమైన చర్యలు తీసుకుంటానంటూ బెదిరింపులకు పాల్పడినట్టు వివరించారు. స్టోన్ క్రషర్ కంపెనీ యజమాని ఫిర్యాదుతో వ్యవహారం వెలుగులోకి వచ్చిందని పేర్కొంది. లంచం మొదటి విడతగా రూ.10 లక్షల క్యాష్ స్వీకరిస్తున్న సమయంలో ఐఏఎస్‌ను పట్టుకున్నట్లు వివరించారు.
స్టింగ్ ఆపరేషన్ సమయంలో ఐఏఎస్ చక్మా తన ఆఫీసు టేబుల్ డ్రాయర్‌లో డబ్బును పెట్టాడని విజిలెన్స్ అధికారులు తెలిపారు. తన రెండు చేతులు ఉపయోగించి 26 కట్టల నగదును లెక్కపెట్టాడని, రసాయన పరీక్షలో (పింక్ బాటిల్స్) ఆయన లంచం తీసుకున్నట్టు నిర్ధారణ అయిందన్నారు. చక్మా చేతులు, టేబుల్ డ్రాయర్‌కు రంగు అంటిన ఆనవాళ్లు ఉన్నాయని గుర్తించినట్టు పేర్కొన్నారు.
Read this- Mumbra Train Incident: రైలు లోనుంచి పడిపోయిన ప్యాసింజర్లు.. ఐదుగురి మృతి
సోదాల్లో రూ.47 లక్షలు లభ్యం
ఐఏఎస్ అధికారి చక్మా లంచం తీసుకుంటూ పట్టుబడ్డాక ఆయన నివాసంలో సోదాలు నిర్వహించగా, ఏకంగా రూ.47 లక్షల నగదు బయటపడింది. అధికారిక నివాసంలోని వివిధ ప్రదేశాలలో ఈ డబ్బుని దాచి పెట్టారు. ఈ భారీ మొత్తంలో దాచిపెట్టిన డబ్బుకు సరైన సమాధానం ఇవ్వలేదని విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టం, 1988లోని (2018 చట్ట సవరణ) సెక్షన్ 7 ప్రకారం కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. అక్రమ మార్గాల ద్వారా సేకరించిన ఇతర ఏవైనా అదనపు ఆస్తులు ఉన్నాయేమో గుర్తించేందుకు సీనియర్ విజిలెన్స్ అధికారులు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఐఏఎస్ అధికారి అరెస్ట్ వ్యవహారం ఒడిశాలో సంచలనంగా మారింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని నియంత్రించేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో జరిగిన ఈ అరెస్టు రాష్ట్ర అధికార యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారింది.