Bengaluru Stampede: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఐపీఎల్ -2025 (IPL 2025) ట్రోఫీ గెలిచిన సందర్భంగా, గత బుధవారం ఏర్పాటు చేసిన విజయోత్సవ ర్యాలీ, సన్మాన కార్యక్రమం భారీ తొక్కిసలాటకు (RCB Stampede) దారితీసిన విషయం తెలిసిందే. ఆర్సీబీ అభిమానులు ఎం.చిన్నస్వామి స్టేడియానికి పోటెత్తడంతో జరిగిన ఈ దుర్ఘటనలో 11 మంది మృత్యువాతపడగా, 47 మంది తీవ్రంగా గాయపడ్డారు. తమకెంతో ఇష్టమైన వారిని కోల్పోయిన బాధిత కుటుంబాలు ఈ విషాదం నుంచి ఇంకా తేరుకోలేక తల్లడిల్లిపోతున్నాయి. శోకసంద్రంలో మునిగిపోయాయి. కన్నకొడుకుని కోల్పోయిన ఓ తండ్రి ఆవేదనే ఇందుకు ప్రత్యక్ష సాక్షంగా నిలిచింది.
తన కొడుకు మృతదేహాన్ని ఖననం చేసిన స్థలాన్ని వీడేందుకు లక్ష్మణ్ అనే ఓ తండ్రి నిరాకస్తున్నాడు. అక్కడే కూర్చొని గుండెలవిసేలా కన్నీరు పెడుతున్నాడు. హృదయాలను ద్రవింపజేస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శోకసంద్రంలో మునిగిపోయిన లక్ష్మణ్ ఆగకుండా ఏడుస్తూ, తన కొడుకు ఖనన స్థలాన్ని తన శరీరానికి హత్తుకుంటా అక్కడే ఉండడం చూస్తున్నవారి మనస్సులను మెలిపెడుతోంది. ఆయనను ఓదార్చడం బంధువులు, స్నేహితుల వల్ల కావడం లేదు.
Read this- Akhanda 2 : అఖండ 2 నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?
వాడి భవిష్యత్తు కోసం తాను కొన్న భూమిలోనే ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని లక్ష్మణ్ విలపిస్తున్నాడు. ఎంత చెప్పినా అక్కడి నుంచి వెళ్లేందుకు ససేమిరా అంటున్నాడు. బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా ఒప్పుకోవడం లేదు. అక్కడి నుంచి ఎక్కడికీ వెళ్లబోనని పట్టుబడుతున్నాడు. తన కొడుకు దగ్గరే ఉండాలని భావిస్తున్నట్టు ఆవేదనగా చెప్పాడు.
ఇంజనీరింగ్ స్టూటెండ్
ఆర్సీబీ తొక్కిసలాట ఘటనలో లక్ష్మణ్ కొడుకు భూమిక్ (20 ఏళ్లు) ప్రాణాలు కోల్పోయాడు. భూమిక్, హస్సాన్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆర్సీబీకి వీరాభిమాని అయిన అతడు విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. ఇంత చిన్న వయసులోనే తన కొడుకు ప్రాణాలు కోల్పోవడంపై లక్ష్మణ్ తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. ‘‘మా అబ్బాయికి వచ్చిన పరిస్థితి ఇంకెవరికీ రాకూడదు. వాడి భవిష్యత్ కోసం కొన్న భూమిలోనే స్మారక చిహ్నం నిర్మిస్తాను’’ అని కన్నీటి పర్యంతమవుతున్నాడు.
Read this- Shambhala Teaser: అంతు పట్టని రహస్యం.. ఆసక్తికరంగా టీజర్!
అక్కడి నుంచి వెళ్లను..
బాధిత వ్యక్తి లక్ష్మణ్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ఇద్దరు వ్యక్తులు ఎంత ప్రయత్నిస్తున్నా, ఆయన మాట వినడం లేదు. తానిప్పుడు ఎక్కడికీ వెళ్లాలనుకోవడం లేదని, ఇక్కడే ఉండాలనుకుంటున్నట్టు తెగేసి చెబుతున్నాడు. తనలాంటి పరిస్థితి మరే తండ్రికి రాకూడదని లక్ష్మణ్ అన్నాడు. కాగా, తన కొడుకు భూమిక్‌కు పోస్టుమార్టం నిర్వహించవద్దని తొక్కిసలాట జరిగినప్పుడు ప్రభుత్వాన్ని లక్ష్మణ్ కోరాడు. తన కొడుకు మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా కోయవద్దని వేడుకున్నాడు. తనకు ఒకే ఒక్క కొడుకు ఉన్నాడని, వాడిని కూడా కోల్పోయానని, దయచేసి మృతదేహాన్ని యథావిథిగా అప్పగించాలని విజ్ఞప్తి చేశాడు. మీడియాను కూడా కోరాడు. కానీ, చట్టప్రకారం పోస్టుమార్టం చేయాలి కాబట్టి పోస్టుమార్టం చేయకుండా మృతదేహాన్ని అప్పగించేందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. బాధిత కుటుంబాల్లో సెలబ్రిటీలు ఎవరూ లేరు కాబట్టి పట్టించుకోవడం లేదంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.