Helicopter on Road: హెలికాప్టర్ ల్యాండింగ్ (Emergency Landing) కోసం ప్రోటోకాల్స్ ప్రకారం సురక్షితమైన ప్రత్యేక ప్రదేశాన్ని ఎంపిక చేసి, సిద్ధం చేస్తారు. ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రుల వంటి ప్రభుత్వాధి నేతలు, ప్రముఖుల ప్రయాణాల సమయంలో భద్రతా ప్రమాణాలను అత్యున్నత స్థాయిలో పాటిస్తుంటారు. కానీ, ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) గుప్త్ కాశీలో శనివారం మధ్యాహ్నం ఒక ప్రైవేట్ హెలికాప్టర్ అకస్మాత్తుగా నడిరోడ్డుపై ల్యాండింగ్ అయింది. టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే సాంకేతిక లోపం (Technical Glitch) తలెత్తడంతో అత్యవసరంగా రోడ్డు మధ్యలో ల్యాండ్ చేశారు. హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. పైలట్ స్వల్ప గాయాలపాలయ్యాడు. తీవ్రమైన వెన్నునొప్పికి గురైన అతడిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇక, రోడ్డుపై నిలిపి ఉంచిన ఒక కారు, హెలికాప్టర్ తోక భాగం కింద పడి నుజ్జనుజ్జయింది.
Read this- Rahul Gandhi: మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
లోపాన్ని గుర్తించిన పైలెట్
ఐదుగురు ప్రయాణికులతో హెలికాప్టర్ కేదార్‌నాథ్ ధామ్‌కు వెళుతున్న సమయం మధ్యాహ్నం 12:52 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తే అవకాశం ఉందని పైలట్ కెప్టెన్ ఆర్‌పీఎస్ సోధి అనుమానించారు. దీంతో, ఎలాంటి దుర్ఘటనకు తావివ్వకుండా హెలిప్యాడ్‌కు దిగువ ప్రదేశంలో ఉండే రోడ్డుపైనే హెలికాప్టర్‌ను ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేశాడు. దీంతో, ఘోర ప్రమాదం తప్పినట్టు అయింది.
Read this- Minister Ponguleti Srinivasa Reddy: జీవనోపాధికి ఇబ్బంది లేకుండా.. ఇందిరమ్మ ఇండ్లు!
పైలెట్ సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం
రోడ్డుపై హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ విషయాన్ని జిల్లా పర్యాటకాభివృద్ధి అధికారి, హెలికాప్టర్ సర్వీస్ నోడల్ అధికారి రాహుల్ చౌబే ధృవీకరించారు. క్రెస్టెల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన హెలికాప్టర్ ఐదుగురు ప్రయాణికులతో బదాసు నుంచి శ్రీ కేదార్‌నాథ్ ధామ్‌కు బయలు దేరిన తర్వాత సాంకేతిక లోపం ఏర్పడిందని వివరించారు. పైలట్ ఆర్‌పీఎస్ సోధి సకాలంలో సమస్యను గుర్తించి, సమీపంలోని ఖాళీ రహదారిపై అత్యవసరంగా ల్యాండింగ్ చేశారని అధికారి చెప్పారు. సంక్లిష్ట పరిస్థితుల్లో హెలికాప్టర్ ల్యాండింగ్ చేయడంతో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనానికి నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత పరిస్థితులు వెంటనే అదుపులోకి వచ్చాయని, పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదమే తప్పిందని అధికారి రాహుల్ చౌభే చెప్పారు. కాగా, హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగిన వెంటనే స్థానిక పాలనా యంత్రాంగం తక్షణమే స్పందించింది. ఒక బృందాన్ని పంపించి హెలికాప్టర్‌ను రోడ్డు మీద నుంచి పక్కకు తీసుకెళ్లారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో, సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదు.