TDP: తెలుగుదేశం పార్టీకి ఊహించని రీతిలో ఝలక్ తగిలింది. అది కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి షాక్ అంటే ఆలోచింపజేసే విషయం. అన్నమయ్య జిల్లాకు చెందిన కీలక నేత సుగవాసి సుబ్రమణ్యం (Sugavasi Subramanyam) పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబుకు (CM Chandrababu) పంపారు. ఈ విషయం తెలుసుకున్న అధిష్టానం కూడా ఒకింత కంగుతినడం గమనార్హం. ఎందుకిలా జరిగింది? రాజీనామా (Resign) వెనుక కారణాలేంటి? ఇంత సడన్‌గా నిర్ణయం ఎందుకు? మహానాడు తర్వాత ఝలక్ తగలడం ఏమిటి? అధికారంలో ఉండి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఉద్దేశమేంటి? అనే ఇంట్రెస్టింగ్, సంచలన విషయాలు ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

Read Also- Traffic Challan: ఇన్ని చలాన్లు ఉన్నాయేంట్రా బాబోయ్.. బైక్ అమ్మేసినా సరిపోదే!
అసలేం జరిగింది?
ఉమ్మడి కడప జిల్లాలో (Kadapa) 2024 వరకూ టీడీపీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువగా సీట్లు దక్కాయి. అవి కూడా కీలకంగా ఉన్న 7 అసెంబ్లీ స్థానాలు దక్కించుకుంది. ఇలాంటప్పుడు ఎంతో జాగ్రత్తగా పార్టీ, నేతల విషయంలో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తూ.. గుప్పిట్లో పెట్టుకోవాల్సింది పోయి కనీసం పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో విసిగి వేసారిన కార్యకర్తలు, కీలక నేతలు, ద్వితియ శ్రేణి నేతలు ఒక్కొక్కరుగా టీడీపీకి గుడ్ బై చెప్పేస్తున్న పరిస్థితి. ఈ మధ్యనే పలు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలు కండువాలు మార్చేసుకున్నారు. సరిగ్గా ఈ క్రమంలోనే రాయచోటిలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. 2024 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన సుగవాసి సుబ్రమణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. ప్రజలు, పాలకొండ్రాయుడు అభిమానులు సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, మనోభావాలను గౌరవిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఎవరీ సుగవాసి..?
రాయలసీమలో సుగవాసి ఫ్యామిలీకి మంచి పేరు, గుర్తింపు ఉన్నది. ఎంతలా అంటే ఇండిపెండెంట్‌గా గెలిచిన సత్తా ఈ కుటుంబానికి ఉంది. సుగవాసి పాలకొండ్రాయుడు (Sugavasi Palakondrayudu) గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎమ్మెల్యేగా, ఎంపీగా.. రాయచోటి, రాజంపేట ప్రజలకు సేవలు అందించారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు కూడా. ఈ మధ్యనే అనారోగ్య కారణాలతో రాయుడు తుదిశ్వాస విడిచారు. ఆయన వారసులుగా రాజకీయాల్లోకి వచ్చిన వారే సుగవాసి సుబ్రమణ్యం, సుగవాసి ప్రసాద్‌లు (Sugavasi Prasad). పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజల పక్షాన నిలబడుతూ వస్తుండే వారు. ప్రసాద్‌కు రాయచోటి టికెట్ దక్కుతుందని ఆశించినప్పటికీ రాలేదు. అయితే ఆయన సోదరుడు సుబ్రమణ్యంకు రాజంపేట టికెట్ దక్కింది. అయితే కొన్ని సమీకరణల రీత్యా పరాజయం పాలయ్యారు. సొంత పార్టీ నేతలే ఈ ఓటమికి కారణమని చెబుతుంటారు. అందుకే పార్టీ అధికారంలోకి వచ్చినా సుగవాసి మాత్రం తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉంటున్నారని అనుచరులు చెబుతుంటారు. దీనికి తోడు రెండ్రోజులకోసారి రాజంపేటలో టీడీపీ నేతల మధ్యే గొడవలు జరుగుతున్నాయి. అటు అధిష్టానం పట్టించుకోకుండా.. ఇటు అవమానాలతో సుబ్రమణ్యం విసిగిపోయి ఇలా రాజీనామా చేయాల్సి వచ్చిందని అనుచరులు, అభిమానులు చెబుతున్నారు. అయితే కడప జిల్లాలో మహానాడు జరిగి పట్టుమని 10 రోజులు కూడా కాకమునుపే సుగవాసి రాజీనామాతో హైకమాండ్ ఒకింత కంగుతిన్నది.
అటు నుంచి ఇటు..!
వాస్తవానికి.. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ‘రాయుడు’ కుటుంబానికి జరుగుతున్న అవమానాలపై చంద్రబాబు కనీసం దృష్టి పెట్టలేదన్నది అభిమానుల వాదన. ఆఖరికి రాయచోటి పర్యటనలో సైతం ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇలా తరచుగా అవమానాలు జరుగుతున్నప్పటికీ పార్టీలోనే కొనసాగుతూ వచ్చింది పాలకొండ్రాయుడు కుటుంబం. ఎందుకంటే.. కట్టె కాలే వరకూ పార్టీలోనే కొనసాగుతానని రాయుడు శపథం చేశారు. అంతేకాదు.. చంద్రబాబుతో సమకాలిన రాజకీయ నాయకులు కూడా. అయితే ఆరోగ్యం సహకరించకపోయినా 2024 ఎన్నికల్లో రాయచోటి నుంచి పోటీచేసిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారు. వీల్‌చైర్‌లో ఎన్నికల ప్రచారం చేశారంటే ఆయనకు పార్టీపైన ఉన్న అభిమానం, ఆప్యాయతలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లోనే సుబ్రమణ్యంకు రాజంపేట టీడీపీ ఎంపీ టికెట్ అంటూ ప్రచారం జరిగింది కానీ, ఎంపీ టికెట్ ఇవ్వకుండా పక్క నియోజకవర్గమైన రాజంపేట అసెంబ్లీ టికెట్‌ను చంద్రబాబు కట్టబెట్టారు. రాయచోటి కాకుండా రాజంపేటకు టికెట్ ఇచ్చినా సుబ్రమణ్యం పోటీ చేశారు. అయితే సొంత పార్టీ నేతల వెన్నుపోటుతో సుబ్రమణ్యం ఓటమి పాలయ్యారని అనుచరులు చెబుతుంటారు. చివరికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Mandipalli Ram Prasad Reddy) మేనల్లుడు మౌర్యా రెడ్డి సైతం వైసీపీ కోసం పనిచేయడం వెన్నుపోటుకు నిదర్శనమని ఆధారాలతో సహా సుగవాసి అభిమానులు నిరూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
రాజీనామా వెనుక?
ఓటమి తర్వాత రాజంపేట ఇన్‌ఛార్జీ వ్యవహారంలోనూ చంద్రబాబు మొండి చేయి చూపించారనే విమర్శలు ఉన్నాయి. ప్రాధాన్యత ఇవ్వనప్పుడు టీడీపీలో కొనసాగడం ఎందుకు? అనవసరం కదా? అని గత కొంతకాలంగా రాయుడు అభిమానులు.. సుబ్రమణ్యంపై ఒత్తిడి చేసిన పరిస్థితి. రాజకీయంగా తన బిడ్డలను ఒక స్థాయిలో చూడాలని పాలకొండ్రాయుడు ఎంతో ఆశించారు. అయితే.. పార్టీలో బిడ్డలకు జరుగుతున్న అవమానాలు చూసి తట్టుకోలేక మానసిక వేదనతో.. ఆరోగ్యం క్షిణించి పాలకొండ్రాయుడు చికిత్స పొందుతూ మృతి చెందారు. పాలకొండ్రాయుడు మృతి చెందినా అధినేత రాకపోవడం, కనీసం పరామర్శించక పోవడంతో చంద్రబాబుపై ఆ కుటుంబానికి మరింత అసంతృప్తి, ఆగ్రహం కలిగిందని కార్యకర్తలు చెబుతుంటారు. చంద్రబాబుతో సమకాలిన రాజకీయాలు చేసినా పరామర్శకు రాకపోవడంపై అభిమానుల్లో అసంతృప్తి నెలకొన్నది. రాయచోటిలో బలమైన వర్గం, సామాజికవర్గం ఉన్న సుగవాసి కుటుంబాన్ని దూరం పెట్టడాన్ని సుగవాసి అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. వీటన్నింటికీ తోడు పార్టీ అధికారంలో ఉన్నా మంత్రి మండిపల్లి ఇబ్బందులు పెడుతూ వస్తుండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఇన్ని అవమానాలు జరుగుతున్నా పార్టీలో కొనసాగడం ఏమిటి? ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని వీడటమే మంచిది కదా? అని సుగవాసి కుటుంబాన్ని అభిమానులు ప్రశ్నించారు. టీడీపీని వీడాలని సుబ్రమణ్యంపై అభిమానులు ఒత్తిడి తెచ్చారు. ప్రజలు, అభిమానులతో సమాలోచన చేసిన ఆయన రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శనివారం నాడు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Read Also- Nara Lokesh: చినబాబూ.. గెలిచాక యువనేతలను పట్టించుకోరేం.. ఇంత అన్యాయమా?
ప్రసాద్ పరిస్థితేంటి.. ఏ పార్టీలోకి..!?
సుబ్రమణ్యం సోదరుడు సుగవాసి ప్రసాద్ ప్రస్తుతం రాయచోటి నియోజకవర్గంలో మంత్రి తర్వాత నెంబర్-2గా టీడీపీలో వ్యవహరిస్తున్నారు. పేరుకే నెంబర్-2 కానీ, ఈయన కూడా అధికారంలో ఉండి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా, రాయచోటిలో గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయి ఉన్న ప్రసాద్ సైతం పార్టీలో ఇబ్బందులతో ఇమడలేకపోతున్నారు. సుబ్రమణ్యం రాజీనామా తర్వాత ప్రసాద్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఆయన టీడీపీలోనే (Telugu Desam Party) కొనసాగుతారా? లేకుంటే రాజీనామా చేసి సోదరుడి బాటలోనే నడుస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి 2024 ఎన్నికల ముందే వైసీపీకి ప్రసాద్ దగ్గరయ్యారు. అధికారికంగా పార్టీలో చేరలేదు కానీ.. కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గానే పాల్గొన్నారు. ఒకానొక సందర్భంలో అభిమానుల కోరిక మేరకే టీడీపీకి దూరమయ్యారని అనే టాక్ నడిచింది. అయితే వైసీపీలో టికెట్ వచ్చే మార్గం లేకపోవడంతో.. టీడీపీలో అయినా టికెట్ దక్కుతుందని ఆశించారు కానీ.. మండిపల్లికి దక్కింది. రాంప్రసాద్‌ను గెలిపించాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా ప్రాధాన్యత ఇస్తామని అధినేత హామీ ఇచ్చి.. ధైర్యం చేసి పంపారు. తీరా చూస్తే అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ఇంతవరకూ పదవి సంగతి దేవుడెరుగు.. కనీసం పట్టించుకోకపోవడం గమనార్హం. అయినా అసంతృప్తిగానే పార్టీలో ఉంటున్నారు. ఇప్పుడు ఏకంగా సోదరుడు రాజీనామా చేయడంతో.. ప్రసాద్ అడుగులు ఎటువైపు అని అభిమానులు, అనుచరులు, రాయచోటి నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సుబ్రమణ్యం ఏ పార్టీలో చేరబోతున్నారనేది కూడా అభిమానుల్లో ఉత్కంఠ నెలకొన్నది.