Traffic Challan: మామూలుగా ఒక బైక్ ఉన్న వ్యక్తికి ఎన్ని చలాన్లు ఉండొచ్చు.. ఏడాది మొత్తం అన్నీ కలిపితే మహా అంటే పది లేదా 15 ఉంటాయి కదా..! ఇంకా ఎక్కువంటే ఇంకో పది కలిపితే 25 అంతే. కానీ.. ఏకంగా 109 చలాన్లు పడితే ఆ బైక్ ఏ రేంజిలో వాడిపడేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడా ఆ బైక్ యజమాని పరిస్థితి ఎలా ఉందంటే.. ఇంచుమించు ఆ బైక్ అమ్మేసినా సరే ఆ డబ్బులు చలాన్లు కట్టడానికి బహుశా సరిపోవేమో అన్నట్లుగా ఉంది. ఇదంతా ఎక్కడో కాదండోయ్ జరిగింది.. మన పక్కనే ఉన్న హనుమకొండలోనే. ఇంకెందుకు ఆలస్యం చలాన్లు కథేంటో చూసేద్దాం రండి.
అసలేం జరిగింది?
హనుమకొండ ట్రాఫిక్ పోలీసులు ఓ ద్విచక్ర వాహన దారునికి చాలన్ల హారం వేశారు. ద్విచక్ర వాహనంపై వరంగల్ ట్రై సిటిలో ప్రయాణిస్తూ ట్రాఫిక్ నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా తన ద్విచక్ర వాహనంపై నగరంలో చక్కర్లు కొడుతూ ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్, హెల్మెట్ లేకుండా వాహనం నడపటంతో పాటు మరికొన్ని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించి తిరుగుతున్న ఈ ద్విచక్ర వాహనదారుడిపై నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఆన్‌లైన్ ద్వారా జరిమానా విధిస్తూ పోయారు. ఇలా విధించిన చాలాన్లు రెండు అంకెలు కాదు ఏకంగా మూడు అంకెల చలాన్లు ఉన్నాయని బుధవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది.
Read Also- Chandrababu: ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా.. ఆ మంత్రులపై చంద్రబాబు తీవ్ర అసహనం!
పోలీసులే షాకయ్యారు!
హన్మకొండ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సీతా రెడ్డి తన సిబ్బందితో కలిసి అశోక్ జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనాలకు సంబంధించి పెండింగ్ చలాన్లు తనిఖీ చేశారు. హనుమకొండ ప్రాంతానికి చెందిన బిక్షపతికి చెందిన టీఎస్ 03ఈఎస్ 9020 (TS03 ES 9020) రిజిస్ట్రేషన్ నంబర్ వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు ఆపి పోలీస్ వెబ్ పోర్టల్‌లో తనిఖీ చేశారు. సదరు వాహనంపై ఏకంగా 109 చాలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. దీంతో ఒక్కరిగా అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు వాహనదారుడు బిక్షపతికి పెండింగ్‌లో ఉన్న జరిమానాల మొత్తం రూ.26,310 చెల్లించాల్సిందిగా ఇన్‌స్పెక్టర్.. వాహనదారుడి పెండింగ్ చలాన్ల రసీదులను అందజేశారు. అంతేకాదు చలాన్లు చెల్లించే వరకూ వాహనం పోలీస్ కస్టడీలో భద్రంగా ఉంటుందని స్వాధీనం చేసుకున్నారు. తప్పు చేసిన వారు ఎప్పటికైనా పోలీసులకు పట్టుబడటం ఖాయమని చెప్పడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష సాక్ష్యం అని ఈ ఘటనను చూసిన జనాలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు బిక్షపతి పరిస్థితి ఎలా ఉందంటే.. ఆ బైక్ అమ్మడానికి లేదు.. అమ్మినా ఆ డబ్బులు చలాన్లకు సరిపోయేలా లేని పరిస్థితట. దీనిపై సోషల్ మీడియాలో చిత్ర విచిత్రాలుగా కామెంట్లు వస్తున్నాయి.
ఎందుకీ చలాన్లు?
హెల్మెట్ ధరించకపోవడం అనేది అత్యంత సాధారణ ఉల్లంఘనగా మారింది. అతి వేగం (Overspeeding), ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్ ఇవి రెండూ సీసీ కెమెరాల ద్వారా చలానా పడుతుంది. ఇక రాంగ్ రూట్ డ్రైవింగ్.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సరైన పత్రాలు లేకపోవడం (ఆర్సీ, ఇన్సూరెన్స్)ల వల్ల ఎక్కువగా చలాన్లు పడుతుంటాయి. కాగా, ఇంత పెద్ద సంఖ్యలో చలాన్లు ఉన్నప్పుడు, బైక్ సీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భారీ జరిమానాలు లేదా కోర్టులో హాజరు కావాల్సిన అవసరం కూడా ఉండవచ్చు. సాధ్యమైనంత త్వరగా ఈ చలాన్లను తనిఖీ చేసి చెల్లిస్తే బెటర్. ఇలా చేస్తే.. ఇది మీకు భవిష్యత్తులో కలిగే సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలాన్లు చెల్లించిన తర్వాత, రశీదులను తప్పకుండా భద్రపరచుకుంటే మంచిది.
Read Also- Biryani: వావ్.. ఇకపై చిన్న పిల్లలకు బిర్యానీ, పులావ్