Chenab Rail Bridge: సుందరమైన లోయలు, మంచుకొండలతో నిండిపోయి ఉండే జమ్మూ కశ్మీర్‌లో (Jammu Kashmir) రవాణా వ్యవస్థలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం పాటుపడుతోంది. భౌగోళికంగా క్లిష్టతరమైన పరిస్థితుల్లో క్రమక్రమంగా రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలు కీలకమైన సొరంగ, రహదారి మార్గాలు అందుబాటులోకి రాగా, తాజాగా ‘చీనాబ్ రైల్వే బ్రిడ్జి’ (Chenab Rail Bridge) ఆవిష్కరణకు సిద్ధమైంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ రైల్ బ్రిడ్జిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శుక్రవారం (జూన్ 6న) ప్రారంభిస్తారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం తొలిసారి జమ్మూ కశ్మీర్ వెళుతున్న ప్రధాని మోదీ ఈ బ్రిడ్జిని ఆవిష్కరిస్తారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. చీనాబ్ రైల్వే బ్రిడ్జి ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ కాట్రాకు వెళ్లనున్నారని, అంజిఖాడ్‌లో నిర్మించిన తొలి రైల్వే కేబుల్ వంతెనను పరిశీలిస్తారని వివరించారు.
Read this- World Environment Day: పర్యావరణ పరిరక్షణ కోసం.. మొక్కలు నాటాలి!
చీనాబ్ బ్రిడ్జి ఇంజనీరింగ్ అద్భుతం
జమ్మూ కశ్మీర్‌లోని చీనాబ్ నదిపై ఈ రైల్వే బ్రిడ్జిని నిర్మించారు. ఏకంగా 359 మీటర్ల ఎత్తు, 1.3 కిలోమీటర్ల పొడవుతో కట్టిన ఈ బ్రిడ్జి నిజంగా ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచింది. రూ.21,653 కోట్ల భారీ నిధులతో చేపడుతున్న ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (యూఎస్‌బీఆర్ఎల్) ప్రాజెక్టులో భాగంగా దీనిని నిర్మించారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే జమ్మూ, శ్రీనగర్ మధ్య ప్రయాణం మరింత సులభంగా మారుతుంది. ప్రపంచంలో అత్యంత పొడవైన 11వ ఆర్చ్ బ్రిడ్జిగా నిలిచింది. ప్రధాన ఆర్చ్ ఏకంగా 460 మీటర్ల పొడవు ఉంది.
మరికొన్ని విశేషాలు ఇవే
చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా రికార్డులకు ఎక్కింది. ఎత్తుపరంగా చూస్తే ఈఫిల్ టవర్, న్యూయార్క్‌లోని క్రిస్లెర్ బిల్డింగ్ కంటే ఎక్కువ ఎత్తు ఉంది. 359 మీటర్లు (సుమారు 1,083 అడుగులు) ఎత్తు ఉంది. అంటే, దాదాపు 81 అంతస్తుల భవనంతో ఇది సమానం. క్రిస్లెర్ బిల్డింగ్ ఎత్తు 319 మీటర్లు (1,046 అడుగులు), ఈఫిల్ టవర్ ఎత్తు 330 మీటర్లు కాగా, ఈఫీల్ టవర్ కంటే చీనాబ్ బ్రిడ్జి మరో 29 మీటర్లు ఎక్కువ ఎత్తు ఉన్నది. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం 30 మెట్రిక్ టన్నుల స్టీల్‌ను వినియోగించారు. బ్రిడ్జి వెంబడి మొత్తం 36 సొరంగాలను కూడా ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాటు చేసి నిత్యం బ్రిడ్జిని పర్యవేక్షించేందుకు వీలుగా ఈ సొరంగాలను ఏర్పాటు చేశారు. ప్రయాణీకులకు సంపూర్ణ భద్రత, రక్షణ కల్పించడమే లక్ష్యంగా ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
Read this- Modi Sindoor Plant: సింధూరం మొక్క నాటిన మోదీ.. అంత స్పెషల్ ఎందుకు?
భూకంపాన్ని తట్టుకునే శక్తి
ప్రపంచంలో అత్యంత పటిష్టమైన బ్రిడ్జిగా చీనాబ్ రైల్ వంతెనను ఇంజనీర్లు నిర్మించారు. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో రాకాసి గాలులు వీచినా ఈ బ్రిడ్జికి ఏమీ కాదు. 40 కేజీల ట్రైనైట్రోటోలిన్‌తో పేల్చినా, రిక్టర్ స్కేలుపై 8 తీవ్ర కలిగిన భూకంభం సంభవించినా బ్రిడ్జి చెక్కుచెదరదు. తీవ్రమైన పేలుళ్లను సైతం తట్టుకునేలా బ్రిడ్జి పిల్లర్లను నిర్మించారు. ఇందుకోసం 63 ఎంఎం స్పెషల్ బ్లాస్ట్-ప్రూఫ్ స్టీల్‌ను వినియోగించారు. ఈ మేరకు అన్ని పరీక్షల్లోనూ బ్రిడ్జి ఇప్పటికే పాస్ అయింది. తీవ్ర వేగమైన గాలులు, తీవ్ర వేడి, భూకంపాలు, హైడ్రాలాజికల్ ప్రభావాలను క్రియేట్ చేసి బ్రిడ్జిని పరీక్షించారు. బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా కట్టిన కాంక్రీట్ పిల్లర్లకు ఎలాంటి దెబ్బతినకుండా ప్రత్యేక పెయింటింగ్‌తో కోటింగ్ వేశారు. ఈ పెయింటింగ్ ఏకంగా 15 సంవత్సరాలపాటు చెక్కుచెదరకుండా ఉంటుంది. మొత్తంగా ఈ బ్రిడ్జి ఏకంగా 120 ఏళ్లపాటు ఎలాంటి చెక్కు చెదరకుండా ఉంటుందని అంచనాగా ఉంది.