DK Shivakumar: బెంగళూరు (Bangalore) నగరంలోని ఎం.చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన విషాదకర తొక్కిసలాట (RCB Stampede) ఘటనపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shiva Kumar), గురువారం మీడియాతో మాట్లాడుతూ కళ్లు చెమర్చారు. తొక్కిసలాటలో కొడుకుని కోల్పోయిన ఓ తల్లి ఆవేదనను గుర్తుచేసుకొని కన్నీటిపర్యంతమయ్యారు. ‘‘పోస్టుమార్టం నిర్వహించకుండానే నా కొడుకు మృతదేహాన్ని అప్పగించాలంటూ ఓ తల్లి కోరారు. కానీ, ఇది చట్టపరమైన ప్రక్రియ కదా’’ అని కన్నీళ్లతో డీకే శివకుమార్ చెప్పారు. నగరంలో విక్టరీ పరేడ్ నిర్వహించేందుకు ఎవరు అనుమతి ఇచ్చారనేది అవసరంలేని అంశమని, అయితే, బాధ్యతాయుతంగా నిర్వహించి ఉంటే బావుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. తొక్కిసలాట ఘటనపై చట్టప్రకారం దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. విషాదకరమైన ఈ ఘటనపై బీజేపీ చేస్తున్న రాజకీయాలకు తాము వ్యతిరేకమని, ఈ అంశాన్ని రాజకీయం చేయదలుచుకోలేదని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
Read this- Tragedy News: ముగ్గురు కూతుళ్లపై తండ్రి దారుణం.. తల్లి ఏం చేసిందంటే?
8 లక్షల మంది ఫ్యాన్స్ వచ్చారు..
బుధవారం చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట విషాద ఘటనపై కర్ణాటక (Karnataka) హోంమంత్రి జీ పర్మేశ్వర గురువారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. ఆర్సీబీ ఆటగాళ్ల విక్టరీ పరేడ్ (RCB Victory Parede), సన్మాన కార్యక్రమం కోసం ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారని ఆయన చెప్పారు. సుమారుగా 8 లక్షల మంది ఫ్యాన్స్ పొటెత్తారని ఆయన అంచనా వేశారు. మృతుల కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేసియా ప్రకటించిందని ఆయన గుర్తుచేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతుందని స్పష్టం చేశారు.
Read this- June 6th Holiday: రేపు హాలీడే అంటూ జోరుగా ప్రచారం.. అందులో వాస్తవమెంత?
బీజేపీ తీవ్ర విమర్శలు..
ఆర్సీబీ ఆటగాళ్ల విక్టరీ పరేడ్, సన్మాన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వస్తారని అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ విమర్శలు గుప్పించింది. ఆర్సీబీ ఐపీఎల్-2025 టైటిల్ గెలుస్తుందంటూ ఈసారి పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికీ పరిస్థితిని ఊహించలేకపోయారంటూ అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి శోభా కరండ్లజే డిమాండ్ చేశారు. తొక్కిసలాటపై దర్యాప్తునకు హైకోర్టు జడ్జి నేతృత్వంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. కార్యక్రమాన్ని తూతూమంత్రంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఎలాంటి ప్రణాళిక లేదా ఏర్పాట్లు లేకుండా తొందరపాటుగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. ఆర్సీబీ కప్ గెలిచిన సందర్భంలో వేడుకల నిర్వహణను ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగించాలని ఎందుకు నిర్ణయించారని ఆమె ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదంటున్నారు సరే, అలాంటప్పుడు ఎందుకు సెలబ్రేట్ చేశారని అన్నారు. విధాన సౌధలో ఆటగాళ్లను ఎందుకు సన్మానించారని శోభా ప్రశ్నించారు.