will hateful policy secure win for bjp in electionవిద్వేషపు విధానాలతో విజయం సిద్ధిస్తుందా?
PM Modi
Editorial

Elections: విద్వేషపు విధానాలతో విజయం సిద్ధిస్తుందా?

BJP: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ విద్వేష వ్యాఖ్యలు రాజ్యాంగరీత్యా ఆయన నిర్వహించే బాధ్యతలకే గాక బీజేపీ పరిధిని మించిపోతున్నాయి. ఒక పార్టీ నేతగా, ప్రభుత్వాధినేతగా ఆయన వ్యాఖ్యలను రాజ్యాంగం గురించి కనీస పరిజ్ఞానం ఉన్నవారెవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మొదటి దశ పోలింగ్ సరళిపై అనుమానం రావటంతోనే ప్రధాని తన విద్వేష వ్యాఖ్యలతో మిగిలిన దశలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారని మీడియా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మోదీని అమితంగా అభిమానించేవారు సైతం ఆయన వైఖరికి బిత్తరపోయి, వాటిని ఏదో విధంగా సమర్థించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. రెండవ దశ పోలింగ్ కూడా ఆశించిన రీతిలో లేదనే సమాచారం వస్తున్న వేళ రానున్న రోజుల్లో ఆయన విడ్డూర వాక్కులు విజృంభించటమే తప్ప తగ్గకపోవచ్చు.

తన వ్యాఖ్యల ద్వారా మత రాజకీయాన్ని రగిలించటం, ఆధారాల్లేని ఆరోపణలతో ఓటర్లను గందరగోళపరచటం అనే రెండు ప్రయోజనాలను మోదీ ఆశిస్తున్నారు. రాజస్థాన్‌లోని బర్హన్‌ సభలో మోదీ మాట్లాడుతూ, కాంగ్రెస్ గెలిస్తే మీ ఆస్తిపాస్తులను లాక్కొని ముస్లింలకు కట్టబెడతారని ఓటర్లను భయపెట్టారు. అది కాస్తా బెడిసి కొట్టడంతో మరో సభలో మొత్తం ఆస్తులకే ఎసరు పెడతారనే కొత్తపాట అందుకున్నారు. ఇందుకు మద్దతుగా కాంగ్రెస్ ఒకనాటి సలహాదారు శామ్ పిట్రోడా ఎప్పుడో మాట్లాడిన మాటను ఆయన రుజువుగా చూపే ప్రయత్నం చేశారు. అమెరికాలో పెద్దల నుంచి సంక్రమించే ఆస్తి మీద ప్రభుత్వానికి పన్ను చెల్లించే విధానం గురించి పిట్రోడా అభిప్రాయాన్ని మోదీ ప్రస్తావించారు. అమెరికాలో 45%, జపాన్‌లోనైతే ఏకంగా 55% ఉన్న పన్నును ఆస్తి విలువ నుంచి మినహాయించుకుని ఇవ్వాలనేది ఆయన ప్రస్తావించిన చట్టాల్లోని సారాంశం. మనదేశంలో అలాంటి చట్టం లేదు గానీ, ఆర్థిక సమానత్వం, సమాజ ప్రయోజనాల కోసం ఆస్తిని తీసుకోవడం వంటి అంశాలు రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లోని 39 (బీ) పరిధిలోనివి. దాని అమలుకు సంబంధించిందే 31 (సీ) యజమాని లేని ఆస్తులను లేదా అవసరమైన వాటిని తీసుకోవడానికి అవకాశమిస్తున్న మాట నిజం. అదే సమయంలో దానికి భిన్నంగా మన రాజ్యాంగంలోని 19వ అధికరణ ప్రైవేటు ఆస్తికి రక్షణనిస్తుంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ యుగంలో ఇవన్నీ ఎక్కడా చర్చలేకున్నా, మౌలికంగా ఆ భావన తప్పు కాదు. రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ వంటి సందర్భాల్లో ఈ రెంటికి మధ్యనే చర్చ జరిగింది.

Also Read: వారసుల ఫైట్.. ఎన్నికల బరిలో నెక్స్ట్ జనరేషన్

దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం ఉవ్వెత్తున్న సాగుతున్న రోజుల్లో దాన్ని దెబ్బతీయడం కోసం ఆస్తులు లాగేసుకుంటారనే ప్రచారాన్ని ప్రగతి నిరోధక శక్తులు ప్రచారం చేశాయి. ఇందిర భూసంస్కరణలకు పూనుకున్న రోజుల్లోనూ ఆ శక్తులు ఇలాగే గగ్గోలు పెట్టాయి. వాస్తవానికి నేటి అంతర్జాతీయ పరిస్థితిలో ప్రజల ఆస్తులను ప్రభుత్వాలే ప్రైవేటుపరం చేయడం పరిపాటిగా మారింది. మోడీ హయాంలోనే పెట్టుబడుల ఉపసంహరణ మంత్రంగా మారింది. ఇదే విశాఖ ఉక్కు వరకు పాకింది. దానిపై వచ్చిన ప్రజాందోళనకు కేంద్రం కనీసం స్పందించడం లేదు. ఇలా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు కట్టబెడుతున్న మోదీ, ప్రజల వ్యక్తిగత ఆస్తులకేదో ప్రమాదం ముంచుకొస్తుందని భయపెట్టటం వంచనా శిల్పం మాత్రమే! హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా అన్ని వర్గాలనూ ఆయన హడలగొట్టడంలో ఆయన ఆలోచన ఏమిటో వేరే చెప్పనక్కరలేదు. ఆసక్తికరం ఏమంటే ఈ సమయంలోనే సీజేఐ చంద్రచూడ్ నాయకత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ సమస్య చేపట్టింది. ముంబాయి ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ ఎప్పుడో వేసిన ఒక పిటిషన్‌ను దుమ్ముదలిపి తీసింది. ప్రజా ప్రయోజనాల కోసం ప్రైవేటు ఆస్తిని తీసుకోవడం ఆదేశిక సూత్రాల్లోని 39 (బీ) సారాంశం. ధర్మాసనంలోని జస్టిస్ నాగరత్న ‘సరళీకరణ యుగంలో ప్రైవేటీకరణకు ఇది విరుద్ధం కదా’ అనగా, తాను మార్క్సిస్టుల తరహాలో ఆస్తి పంపిణీ గురించి చెప్పడం లేదనీ, అయితే ఈ అంశానికి ప్రాధాన్యత ఉంటుందని సీజేఐ వ్యాఖ్యానించారు. ఇది చివరకు ఏ దిశగా పయనిస్తుందో ఓపిగ్గా వేచి చూడవలసిందే. కానీ మోదీ మాత్రం ఈ లోగానే ఏదో జరిగిపోతుందనీ, జనం ఆస్తి పోతుందనే గగ్గోలు పెడుతున్నారు. పిట్రోడా పాత వీడియోలూ తవ్వితీసి పెడబొబ్బలు పెడుతున్నారు. ఇంతా చేసి పిట్రోడా ఇప్పుడేమీ కాంగ్రెస్‌తో లేరు. ఆయన క్రియాశీల రాజకీయ వేత్త కూడా కాదు. అయినా, ఎన్నికల వేళ బీజేపీకి జనాన్ని కంగారుపెట్టే ఏదో అంశం కావాలి కదా

ఆస్తికవాదమంతా తమదేనని చెబుతూ మత రాజకీయాలు నడిపే బీజేపీ, నేడు ఆస్తి విషయాలవైపు రావడం యాదృచ్ఛికమేమీ కాదు, అంతెందుకు? కాంగ్రెస్ వస్తే జనం ఆస్తిని ముస్లింలకు ఇస్తారన్న తన మాటపై విమర్శలు వచ్చిన మరునాడే ప్రధాని.. హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీసా చదవనివ్వడం లేదని కొత్త ఆరోపణ చేశారు. ఇక్కడో విశేషం ఉంది. నరేంద్ర మోదీని ‘నమో’ అని ఆయన భక్తులు పిలుచుకుంటారు. నిజానికి నమో నమ:శివాయ అనేది శివభక్తులు వాడేది, కానీ, కాశీలో పోటీ చేసి గెలిచిన మోదీకే ఆ విశేషం తగిలించేశారు ఆయన భక్తులు. అలాగే హనుమాన్ చాలీసా తరహాలో మోదీ చాలీసా కూడా రచించారు! ఆయన వ్యక్తి ఆరాధన అంత ఎత్తుకు తీసుకుపోవడం సంఘ పరివార్ వ్యూహంలో భాగమే. కానీ, ఆయన ప్రభ రోజురోజుకూ మసకబారుంతోందని వారు గ్రహించకతప్పలేదు. మరే సమస్య లేనట్టు మోదీ పేరే దేశాన్ని ఊపేస్తుందనే భావన సంఘీయుల్లో కరిగిపోయింది. మతరాజకీయమనే పాచిక పారడం లేదు. స్థానిక నాయకులెందరున్నా.. జాతీయ నేత మాత్రం మోదీయేననే మాట కర్ణాటక నుంచి చాలా చోట్ల వీగిపోయింది. అనేక అంశాలలో కేంద్ర నిరంకుశత్వం వారి గడపలను తాకింది. ఈ సమయంలో మోడీ సభలకు, ఆయన చిట్కాలకు బొత్తిగా స్పందన తగ్గుతోంది.

Also Read: ఇండియాకు రాకుండా చైనాకు చెక్కేసిన ఎలన్ మస్క్

ఇతర పార్టీ కీలక నేతలతో బాటు సొంత పార్టీ కీలక నేతలనూ లెక్కచేయని మోదీ ధోరణిని జనం తిరస్కరిస్తున్నారు. సర్వేలలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, దారిద్ర్యం వంటి అంశాలు ప్రభావితం చూపుతున్నాయనే మాట కమలనాథులను కలవరపెడుతోంది. వ్యవసాయ రంగ సమస్యలు ఇందుకు అదనం. మీడియా, విద్యాలయాలు, మేధావి వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు, న్యాయవ్యవస్థ, కవులు, రచయితలు, చివరికి సినిమా రంగమూ మోదీ ఏకపక్ష ఆధిపత్యానికి గురికాకతప్పలేదు. రాజకీయ సేవలో మతాన్ని వాడుకోవడానికి.. చివరికి మతాచార్యుల పాత్రనూ తానే లాగేసుకోవటంతో అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట ఒక వివాదంగా మారింది. ఇక ఆరుగాలం శ్రమించే రైతుల ఆగ్రహావేదనలు ప్రజ్వరిల్లి దేశాన్ని ప్రతిష్టంభనకు గురి చేశాయి. ఈ సమయంలో కాశ్మీర్ 370, సరిహద్దు ఉద్రిక్తతలు, సర్జికల్ స్ట్రైయిక్స్ వంటివే ఊపునిచ్చేలా వాతావరణం మారుతున్నది. మోడీని త్రీడీలో చూపిన ప్రచారపు పొర కూడా రోజురోజుకూ కరిగిపోతోంది. అన్నింటా తానే ప్రత్యక్షమై ప్రబోధకుడుగా ప్రభవించడం ప్రజలు ఆమోదించడం ఇప్పుడు బాగా తగ్గింది, బీజేపీలోనూ సంప్రదాయ నేతలూ ఎదురుతిరగడం మొదలుపెట్టారు. ఏపీ, తెలంగాణలోని బీజేపీ శిబిరాలు గమనిస్తే వాస్తవం తెలుస్తుంది. ఆ పార్టీ పెద్ద శక్తిగా లేని చోట్లనే ఇలా ఉంటే, బీజేపీకి బలమైన పునాదులున్న చోట నేతలు, సీనియర్ కార్యకర్తలు, అభిమానులు ఎలా స్పందిస్తారో తేలిగ్గా ఊహించవచ్చు. రెండు, మూడు సార్లు సీఎంలుగా పనిచేసిన వారిని సైతం బడిపిల్లల్లా బందిఖానాలకు పంపుతుంటే, వారిని ఎన్నుకున్న జనంలో వ్యతిరేకత రావటం సహజం. ఇక ఆయనను ఆశ్రయించుకున్న అదానీ, రామదేవ్ బాబా వంటివారు రకరకాలుగా దొరికిపోతున్న వేళ, మోదీపై మొహం మొత్తడమే గాక నిరాసక్తత, నిరసన కూడా పెరుగుతున్నాయి.

ఇక ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలు వెంటబడి మరీ బీజేపీతో పొత్తుపెట్టుకున్నాయి. ఆ పొత్తు అస్తవ్యస్తంగా మారటం వెనక అక్కడి జనంలో అక్కడి రాష్ట్రపార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపైన కోపమే కాదు..అంతకుమించి మోదీ విషయంలో ఉన్న నిరసనే ప్రధాన కారణం. ఇటు తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు పడిపోతుందంటూ మాజీ సీఎం కేసీఆర్ శాపనార్దాలు పెడుతూ పరోక్షంగా బీజేపీకి మేలు చేస్తున్నారు. అటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అదే పాట పాడుతున్నారు. తెలుగు నేలపై సాగుతున్న ఈ కాషాయ రాజకీయ క్రీడలతో ఆ పార్టీ ఇక్కడేదో దూసుకొస్తుందనేది కల మాత్రమే. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నాటకం నడపాలని చూసిన బీజేపీ పథకాలూ తెలంగాణలో వేగంగానే తేలిపోయాయి. సీఎం రేవంత్ రెడ్డి అనివార్యంగా బీజేపీపైనా తీవ్రంగా స్పందించకతప్పలేదు. ఏపీలో పవన్, చంద్రబాబు పొత్తు పెట్టుకున్నా, తెలంగాణ నేతలు వూగిసలాడినా బీజేపీ మీద వ్యతిరేకత తగ్గటం లేదు. ఇప్పుడు బీజేపీకి 300.. 400 స్థానాల పాట ఎవరూ పాడటం లేదు. కులమతాలను, కుటుంబాలను, ఆర్థిక, సాంస్కృతిక వ్యవహారాలను ఆందోళనకు గురి చేస్తే తప్ప గట్టెక్కలేమని మోదీనే గుర్తించారు. అయితే.. మతతత్వ ప్రమాదాన్ని తక్కువ అంచనా వేయకూడదని ప్రజలు కూడా గ్రహించాల్సి ఉంది. దానిపై మరింత దీటుగా పోరాడేందుకూ ఇదే సమయమనీ పై పరిణామాలు గుర్తు చేస్తున్నాయి.

తెలకపల్లి రవి
రాజకీయ విశ్లేషకులు

Just In

01

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం