Elon Musk China Visit: ఎలన్ మస్క్ ఏప్రిల్ నెలలో ఇండియాకు రావాల్సింది. ఏప్రిల్ 21న ఇండియాకు వచ్చి రెండు రోజులు మన దేశంలో పర్యటించి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసే షెడ్యూల్ ఉంది. టెస్లా కంపెనీ మన దేశంలో ఇన్వెస్ట్ చేస్తే దిగుమతి చేసుకునే కార్లపై పన్నులు తగ్గించే ప్రకటన భారత్ చేస్తే.. ఎలన్ మస్క్ మన దేశంలో సుమారు రెండు నుంచి మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడులను ప్రకటిస్తారని అంచనా వేశారు. కానీ, ఆ షెడ్యూల్‌కు కొన్ని రోజుల ముందు ఎలన్ మస్క్ తాను ఇండియా రాలేకపోతున్నానని చెప్పారు. టెస్లాకు సంబంధించిన ఇతర బాధ్యతల వల్ల భారత పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వస్తున్నదని స్వయంగా ఎక్స్‌లో వెల్లడించారు.
ఎలన్ మస్క్ తన పర్యటన వాయిదా వేసుకోగానే కాంగ్రెస్ రియాక్ట్ అయింది. గద్దె దిగిపోతున్న ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ఎలన్ మస్క్ వస్తుండటం అసంగతంగా తమకు తోచిందని, కానీ ఆయన కూడా కొన్ని విషయాలను తెలుసుకుని భారత పర్యటనను నిలిపేసుకున్నట్టు అర్థం అవుతున్నదని కాంగ్రెస్ పేర్కొంది. బాధపడాల్సిన పని లేదని, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక తమ ప్రధానమంత్రి ఎలన్ మస్క్‌ను భారత్‌కు ఆహ్వానిస్తారని తెలిపింది. ఇండియా కూటమి ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా ప్రమోట్ చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. మరికొందరైతే.. లోక్ సభ ఎన్నికల్లో మస్క్‌ను కూడా మోడీ ఉపయోగించుకుంటారని తెలిసే పర్యటనను రద్దు చేసుకున్నారని కామెంట్లు చేశారు.
Also Read: ఎంఐఎం క్యాంపెయిన్‌లో తెలుగు పాట..
ఇదంతా గతంలో జరిగిన వ్యవహారం. భారత పర్యటనను మస్క్ రద్దు చేసుకోవడం కొందరిని నిరుత్సాహానికి గురిచేస్తే తాజాగా ఆయన చైనాకు వెళ్లారనే వార్త మరింత కుంగదీస్తున్నది. ఎలక్ట్రిక్ వాహనాలకు చైనా రెండో అతిపెద్ద మార్కెట్. ఈ చైనా దేశానికి ఎలన్ మస్క్ ఆదివారం సర్‌ప్రైజ్ విజిట్ చేశారు. ఆయన చైనా పర్యటనను ఎక్కడా హైలైట్ చేయలేదు. చైనా ఉన్నత అధికారులను మస్క్ కలిసే అవకాశాలు ఉన్నట్టు రాయిటర్స్ వెల్లడించింది.
టెస్లా ఆటోనమస్ డ్రైవింగ్ టెక్నాలజీ అల్గారిథమ్‌ను ట్రైన్ చేయడానికి ఆ దేశంలో సేకరించిన డేటాను బదిలీ చేసుకోవడానికి అనుమతి తీసుకోవడానికి మస్క్ చైనా పర్యటించినట్టు తెలుస్తున్నది. ఈ విషయమై ప్రశ్నించగా.. చైనాలో అతి త్వరలోనే ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు వస్తాయని వెల్లడించారు.
చైనా నిబంధనలు, చట్టాలకు లోబడి షాంఘైలోని టెస్లా సిబ్బంది 2001 నుంచి డేటా సేకరించింది. ఈ డేటా చైనాలోనే స్టోరై ఉన్నది. ఈ డేటాను ఇది వరకు చైనా నుంచి ఎక్కడికీ ట్రాన్స్‌ఫర్ చేయలేదు. ఈ డేటాను అమెరికాకు బట్వాడ చేసుకోవడానికి అవసరమైన అనుమతులు తీసుకోవడానికి ఇప్పుడు మస్క్ చైనా పర్యటిస్తున్నట్టు సమాచారం.