– బీఆర్ఎస్ నుంచి 20 మంది, బీజేపీ నుంచి ఐదుగురు
– కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ
– లక్ష్మణ్ పండితుడా? జాతకాలు చెబుతున్నారు
– 65 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఎందుకు పడిపోతుంది
– చిప్ కరాబ్ అయినట్టుంది
– కొత్త దాని కోసం ఖర్చు భరిస్తామంటూ జగ్గారెడ్డి కౌంటర్స్
Congress:: బీఆర్ఎస్ నుంచి 20 మంది, కాంగ్రెస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బాంబ్ పేల్చారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యల నేపథ్యంలో గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ బీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘ఎన్నికలు ఇప్పుడే అయిపోయాయి. అప్పుడే మీడియా ముందుకు రావడం, ప్రెస్ మీట్ పెట్టడం అవసరమా అని అనుకున్నా. కానీ, లక్ష్మణ్ అనవసరంగా నోరుపారేసుకుంటున్నారు. ఓటు వేసిన ప్రజలు రిలాక్స్ అవుతున్నారు. అంతలోనే ఏవో కొంపలు మునిగిపోయినట్టు మాట్లాడటం సరికాదు’ అని ఆగ్రహించారు.
లక్ష్మణ్‌కు అంత తొందర ఎందుకు అని ప్రశ్నించిన జగ్గారెడ్డి, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఆయనకు పొలిటికల్ చిప్ ఖరాబ్ అయిందని, వెంటనే రిపేర్ చేసుకోవాలని, ఆ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సెటైర్ వేశారు. ఆగస్టులో కాంగ్రెస్‌లో సంక్షోభం వస్తుందని, ఏదో జరిగిపోతుందని ప్రేలాపనలు పలుకుతున్నారని అన్నారు. అలాంటిదేమీ జరగదని, ప్రజలను కన్ఫ్యూజ్ చేయవద్దని సూచించారు. లక్ష్మణ్ ఎంపీనా? లేక జ్యోతిష్కుడా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు.
Also Read: ఫ్లైట్‌లో ఖమ్మం ఎమ్మెల్యేలు, మంత్రి పొంగులేటి.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కూడా!!
కాంగ్రెస్‌కు 64 మంది ఎమ్మెల్యేల బలంతో ప్రజలు అధికారం ఇచ్చారని, వారి తీర్పు ఇచ్చి హ్యాపీగా ఉన్నారని, మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణిస్తున్నారని, రూ.500కే గ్యాస్ పొందుతున్నారని జగ్గారెడ్డి వివరించారు. ఆగస్టు 15లోపు రుణ మాఫీ చేస్తామని తెలిపారు. కానీ, బీజేపీ ఇచ్చిన హామీల మాటేమిటని ప్రశ్నించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని, బట్టకాల్చి మీద వేయడం కంటే ఇచ్చిన హామీల మీద ఆలోచన చేయాలని సూచించారు. బీజేపీ నాయకులు మోసగాళ్లకు మోసగాళ్లని, మోసం చేయడంలో ఇంటర్నేషనల్‌లోనే నెంబర్ వన్ అని విమర్శించారు. ‘పాము పక్కన ఉంటే చంపుతాం. కానీ, శివలింగం మీద ఉంటే మొక్కుతాం. ఇప్పుడు బీజేపీ కూడా శివలింగం మీద కూర్చుంటోందని, కోపం ఉన్నా ప్రజలు శివలింగం చూసి కాస్త ఓపిక పడుతున్నారని సెటైర్లు వేశారు జగ్గారెడ్డి. లక్ష్మణ్ ఇష్టారీతిన నొటికొచ్చింది మాట్లాడుతున్నారని మండిపడ్డారు.