BJP Slams Rahul: ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) సమయంలో, ‘నరేందర్.. సరెండర్’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆదేశించగా, ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) లొంగిపోయారంటూ కాంగ్రెస్ (Congress) అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ వ్యాఖ్యలు ప్రధాని మోదీతో పాటు భారత ఆర్మీని అవమానపరిచే విధంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సుదాన్షు త్రివేది మీడియాతో మాట్లాడుతూ, ఇండియన్ ఆర్మీపై కాంగ్రెస్ పార్టీ వాడుతున్న పదజాలం పాకిస్థాన్ గానీ, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కూడా వాడలేదని అన్నారు. ‘సరెండర్’ లాంటి పదాలు వాడడం ద్వారా భారత ఆర్మీని రాహుల్ గాంధీ అవమానించినట్టా?, కాదా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Read this, Parliament Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు వచ్చేశాయ్
హఫీజ్ సయ్యద్ కూడా వాడలేదు
పాకిస్థాన్ ఆర్మీ, పాక్ ఉగ్రవాద సంస్థలు, ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదులుగా గుర్తించిన మసూద్ అజార్ లేదా హఫీజ్ సయ్యద్ కూడా ఉపయోగించని పదాలను రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘వరుసగా మూడో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడాన్ని విజయంగా, ప్రధానిగా హ్యాట్రిక్ విజయం సాధించిన నరేంద్ర మోదీది ఓటమిగా అభివర్ణించేందుకు మేధావి స్థాయి, తెలివైన వ్యక్తి ఈ మాటలు మాట్లాడుతున్నారు’’ అంటూ సుదాన్షు త్రివేది వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లొంగిపోయిన చరిత్ర నెహ్రూ-గాంధీ కుటుంబానికే ఉందని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘భారత సింహం’ అని ఆయన మెచ్చుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కూడా రాహుల్ గాంధీ ఇదే రీతిలో బాధ్యతా రాహిత్యంగా మాట్లాడారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.విపక్ష పార్టీల కూటమి ‘ఇండియా’పై కూడా సుదాన్షు త్రివేది వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘ ఇండియా కూటమి పేరులో మాత్రమే ఉంది. వారి హృదయాల్లో మాత్రం పాకిస్థాన్ ఉంది’’ అని విమర్శించారు.
Read this, Urea Allocation: యూరియా కేటాయింపుల్లో.. కేంద్రం అలసత్వం!
ఇంతకీ రాహుల్ గాంధీ ఏమన్నారు?
ప్రధానr నరేంద్ర మోదీ టార్గెట్‌గా రాహుల్ గాంధీ మంగళవారం తీవ్ర విమర్శలు చేశారు. గత నెలలో ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ తలొగ్గారని ఆరోపించారు. ‘‘డొనాల్డ్ ట్రంప్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. నరేంద్ర మోదీ వెంటనే లొంగిపోయారు. చరిత్ర దీనిని ఎప్పటికీ మరచిపోదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అసలు నైజం ఇదే. నరేందర్, సరెండర్ అని ట్రంప్ చెప్పగానే, యెస్ సర్.. అంటూ మోదీ లొంగిపోయారు’’ అని రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌ను భారత్ ఓడించిందని, నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. అమెరికా నుంచి హెచ్చరికలు వచ్చినా నాటి ప్రభుత్వం లెక్కచేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆడ, మగ సింహాలు ఆధిపత్య దేశాలను సైతం ఎదురించాయని, ఎవరికీ తలవొంచలేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ‘‘బీజేపీ, ఆర్‌ఎస్సెస్ వాళ్ల గురించి నాకు బాగా తెలుసు. కొద్దిగా ఒత్తిడి చేస్తే చాలు భయంతో పారిపోతారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. దగ్గరదగ్గరగా 100 గంటలపాటు క్షిపణలు, వైమానిక దాడులు జరిపిన తర్వాత మోదీ లొంగిపోయారని వ్యాఖ్యానించారు. భోపాల్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read this, RCB Parade Stampede: ఆర్సీబీ విజయోత్సవాల్లో పెనువిషాదం.. 11 మంది కన్నుమూత