Parliament Session: పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జులై 21 నుంచి ఆగస్టు 12 వరకు నిర్వహించనున్నట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బుధవారం ప్రకటించారు. పార్లమెంట్ ఉభయ సభలైన లోక్‌సభ, రాజ్యసభలు జూలై 21న ఉదయం 11 గంటలకు సమావేశం అవుతాయని పేర్కొన్నారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారధ్యంలోని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశాల తేదీలను ఖరారు చేసిందని ఆయన చెప్పారు. పహల్గామ్‌లో ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని వెంటనే నిర్వహించాలంటూ ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. జూన్ 3న 16 విపక్ష పార్టీలు ఉమ్మడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖను కూడా రాశాయి. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి, ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌పై అత్యవసర చర్చ చేపట్టాలని కోరాయి. అత్యంత కీలకమైన ఈ సమయంలో దేశమంతా ఐక్యంగా ఉన్నట్టు పార్లమెంట్ సాక్షిగా చాటి చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని విపక్ష పార్టీలు పేర్కొన్నాయి. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రత్యేక సెషన్‌కు అంగీకరించలేదు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలతో పాటు అన్ని అంశాలపైనా వర్షాకాల సమావేశాల్లోనే చర్చించవచ్చునని ప్రభుత్వం ప్రతిస్పందించింది. ఈ నేపథ్యంలోనే, వర్షాకాల సమావేశాల తేదీలను షెడ్యూల్ ప్రకారం ప్రకటించింది.
Read this, RCB Parade Stampede: ఆర్సీబీ విజయోత్సవాల్లో పెనువిషాదం.. 11 మంది కన్నుమూత
ఆపరేషన్ సింధూర్‌పై చర్చ!
విపక్షాల ప్రత్యేక సెషన్ డిమాండ్ల నేపథ్యంలో జూలై 21 నుంచి జరగనున్న సమావేశాలు వాడీవేడిగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. నిబంధనల ప్రకారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చించవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ప్రతిపక్షాల డిమాండ్ల నేపథ్యంలో మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక పౌరులు మరణించడం, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత జరగనున్న తొలి పార్లమెంటు సమావేశం ఇదే కానుంది. కాబట్టి, ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఈ సమావేశాల్లో వాడీవేడి చర్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు, ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని కూడా వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశంపై రాజకీయ పార్టీల ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులను కూడా సంప్రదించింది.
బడ్జెట్ సెషన్‌లో మంచి పనితీరు
ఈ ఏడాది జనవరి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండు దశల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల పనితీరు చాలా బావుంది. చక్కటి ఉత్పాదకత నమోదయింది. ఆ సమావేశాల్లో పార్లమెంటు అనేక కీలకమైన చట్టాలను ఆమోదింపజేసింది. అందులో వక్ఫ్ సవరణ బిల్లు- 2025 అత్యంత ముఖ్యమైన బిల్లుగా ఉంది. త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయ బిల్లు-2025తో పాటు వీసా జారీ, విదేశీయుల నమోదుకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారెనర్స్ బిల్లు-2025 ఆమోదం పొందాయి.
Read this, EPFO Withdraw: ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో పండుగ లాంటి శుభవార్త!