Indiramma Houses: ఇందిరమ్మ ప్రజా పాలన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరి ప్రక్రియ అంతం కాదని.. ఆరంభం మాత్రమేనని, అర్హులైన నిరుపేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, ఇది నిరంతర ప్రక్రియని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. టి.సి.వి. రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఏదులాపురం మున్సిపాలిటీ ప్రాంత లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారుల ముఖాలలో ఆనందం చూస్తుంటే తాను భావోద్వేగానికి లోనయ్యానని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పందన అద్భుతంగా ఉంటుందన్నారు.
నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు
గత పాలకులు ఎమ్మెల్యే నివాసాలు, ప్రభుత్వ భవనాల మీద పెట్టిన శ్రద్ద పేద ప్రజల ఇండ్లపై పెట్ట లేదని, పేద ప్రజల సొంతింటి కలను విస్మరించిందని అన్నారు. రూ. 22 వేల 500 కోట్లలను పేద ప్రజల సొంతింటి కల కోసం ప్రజా ప్రభుత్వం ఈ సంవత్సరం కేటాయించిందని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమం అజెండాగా పాలన కొనసాగిస్తున్నామని అన్నారు. గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం పారదర్శకంగా అమలు చేయాలని, ఎక్కడ లంచాలకు ఆస్కారం లేకుండా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని అన్నారు.
Also Read: Punjab Youtuber Arrested: పాక్‌తో లింకులు.. మరో యూట్యూబర్ అరెస్ట్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా
ప్రభుత్వం పెట్టె ప్రతి రూపాయి పేదలకు ఉపయోగపడాలని తాము ప్రయత్నిస్తున్నామన్నారు. 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. గత పాలకులు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ పేద ప్రజలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్, రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా, ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, గురుకులాల్లో డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంపు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు.
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 రూపాయలు
రైతులకు దాదాపు రూ. 21 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రూ. 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశామని, సన్న వడ్లకు క్వింటాకు రూ.500 రూపాయల బోనస్ అందించామని అన్నారు. రైతు భరోసా పథకం క్రింద పెట్టుబడి సహాయం ఎకరానికి రూ. 12 వేల రూపాయలకు పెంచామని అన్నారు. ప్రస్తుతం ప్రజలకు అందించే ఇండ్లు మొదటి విడత మాత్రమేనని, ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ఉంటుందని, ఏదులాపురం మున్సిపాలిటీ లో ప్రస్తుతం 520 మందికి ఇల్లులు మంజూరు చేసినట్లు, ఇంకా అర్హులున్నారని, వారికి కూడా ఇస్తామని, నిరంతర ప్రక్రియగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కొనసాగుతుందని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్దిదారులు పలువురు మాట్లాడుతూ…. గత 10 సంవత్సరాల కాలంగా సొంతింటి కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ తమకు మంజూరు కాలేదని, ప్రజా ప్రభుత్వంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సహాయంతో తమకు ఇండ్లు మంజూరు కావడం సంతోషంగా ఉందని అన్నారు.
Also Read: MLC Kavitha: తండ్రిపై పొగడ్తలు.. కాంగ్రెస్‌కు చివాట్లు.. మహాధర్నాలో కవిత ఏమన్నారంటే!