Covid-19 Cases India: దేశంలో కరోనా భయాలు క్రమంగా పెరుగుతున్నాయి. రోజుకు రోజుకు కరోనా కేసులు చాప కింద నీరులా విస్తరిస్తున్నారు. నిన్న, మెున్నటి వరకూ వందల్లో ఉన్న యాక్టివ్ కేసులు (Covid Active Cases).. చూస్తుండగానే 4000 వేల మార్క్ ను అందుకున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వీక్ యాక్టివ్ కేసుల్లో గణనీయ పెరుగుదల చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా 4,026 యాక్టివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ (Central Health Department) తాజాగా వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. అంతేకాదు దేశంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలను గణనీయంగా పెంచాలని పలు రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.
రాష్ట్రాల వారీగా కేసులు
కరోనా కేసులు పలు రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ (Kerala)లో కోవిడ్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. దేశంలో అత్యధికంగా 1,416 యాక్టివ్ కేసులు ప్రస్తుతం కేరళలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర (506 యాక్టివ్ కేసులు) ఉంది. ఢిల్లీలో 483 యాక్టివ్ కేసులు ఉండగా.. గడిచిన 24 గంటల్లోనే 47 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే బెంగాల్ లో (339), గుజరాత్ లో (338) కరోనా కేసులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీ (Andhra Pradesh Covid Cases)లో కరోనా ఆందోళనలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకూ 28 మంది ఏపీ వాసులు కరోనా బారిన పడ్డారు. తెలంగాణ లో 4 యాక్టివ్ కేసులు (Telangana Corona Cases)ఉన్నాయి. తమిళనాడు (Tamilnadu), కర్ణాటక (Karnataka)లోనూ కొవిడ్ కేసులు నమోదవుతున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ కచ్చితమైన సమాచారాన్ని అక్కడి ప్రభుత్వాలు పంచుకోవడం లేదు.
మరణాల వివరాలు
గడిచిన 24 గంటల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో ఢిల్లీ (Delhi), కేరళ, మహారాష్ట్ర (Maharashtra), తమిళనాడులలో ఒక్కో మరణం చోటుచేసుకుంది. కరోనా వ్యాప్తి ఈ విధంగానే కొనసాగితే మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసుల వ్యాప్తి అధికంగా ఉన్న కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అటు దేశ రాజధాని ఢిల్లీలోనూ కేసుల వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కేసులపై మరింత ఫోకస్ పెట్టింది.
Also Read: Post Office Schemes: పోస్టాఫీస్‌లో టాప్-5 స్కీమ్స్.. ఐదేళ్లలో లక్షాధికారులు మీరే!
ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
కరోనా లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలు, అలసట, వాసన లేదా రుచి కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయవద్దని వార్నింగ్ ఇస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు సైతం స్వీయ నియంత్రణ పాటించాల్సిన బాధ్యత ఉందని సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులను తరుచూ శానిటైజర్ తో శుభ్రం చేసుకోవడం, రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండటం వంటివి చేయాలని హితవు పలుకుతున్నారు.