Anudeep Durishetty: సుల్తాన్ బజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనం పనులకు నిధులు మంజూరు చేసినప్పటికీ, పనులెందుకు చేయలేదంటూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులపై ఫైర్ అయ్యారు. పాఠశాల ఆవరణలో గతంలో చేపట్టిన పనులు ఆసంపూర్తిగా ఉండటంతో కాంట్రాక్టర్ కు నిధులు చెల్లించవద్దని ఉపాధ్యాయులను ఆదేశించారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ సుల్తాన్ బజార్, ఉస్మాన్ గంజ్ ప్రభుత్వ పాథమిక పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందుకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు స్కూల్ చుట్టు పక్కల ఉన్న బస్తీల్లోని పిల్లలు పాఠశాలకు వచ్చేలా విస్తృత ప్రచారం చేయాలని కూడా ఆయన సూచించారు.
సుల్తాన్ బజార్ లో ఇటీవల నూతనంగా నిర్మించన పాఠశాలలో మెరుగైన సదుపాయాలు కల్పించడం జరిగిందని, పాఠశాల విద్యార్థులతో కళకళలాడేలా చుట్టుపక్కల బస్తీల లోని పిల్లలు ఎక్కువగా పాఠశాలకు వచ్చే విధంగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు పాఠశాలల్లోని సౌకర్యాల గురించివిస్తృత ప్రచారం చేయాలన్నారు. బస్తీలలోని పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.
Also Read: Cm Revanth Reddy: పదేళ్ల నిర్లక్ష్యాన్ని చక్కదిద్దుతున్నాం.. సీఎం సంచలన వాఖ్యలు!
అదేవిధంగా త్వరలో చేపట్టబోయే బడిబాట కార్యక్రమంలో కూడా విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా సమిష్టిగా కృషి చేయాలన్నారు.సుల్తాన్ బజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విశాలమైన అద్భుతమైన గదులను ఏర్పాటు చేయడంతో దాదాపు విద్యార్థుల సంఖ్య 800 వరకు ఉండాలని, ఆ దిశగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, ఉపాధ్యాయులు నిబద్ధతతో పిల్లల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. పాఠశాల ఆవరణలోని చెత్తాచెదారం తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని అలాగే విద్యార్థుల క్రీడలకు అనువుగా ఉండే విధంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.
పాఠశాలలో మరమ్మత్తులు చేపట్టి పాఠశాలలతో పాటు, పాత భవనానికి కూడా పెయింటింగ్స్ వేయించి జూన్ 12 నాటికి అందుబాటులో ఉంచాలని అలాగే పాఠశాల ప్రహరీ గోడ తో పాటు ఎంట్రన్స్ గేటుకు మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు. తదుపరి ఉస్మాన్ గంజ్ లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి రెండు విభాగాల్లో ఉన్న పాత భవనాలను సత్వరమే తొలగించి నూతన భవనాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
పిల్లల విద్యా ప్రమాణాలు పెరగాలంటే గుణాత్మకమైన విద్యతోపాటు పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. తెలుగు, ఇంగ్లీష్, అలాగే ఉర్దూ మీడియం పిల్లల హాజరు శాతం తో పాటు కల్పించిన సదుపాయాలపై అధికారులతో తెలుసుకున్నారు. అలాగే జూన్ 15 నాటికి పాఠశాలకు పెయింటింగ్స్ చేపట్టాలని ప్రభుత్వ పాఠశాలలలో పిల్లల సంఖ్య పెరిగేలా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు, ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలని కమిటీలకు సత్కారం చేయడం జరుగుతుందని కలెక్టర్ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సందర్శనలో డిప్యూటీ డిఇఓ వెంకటేశ్వర్లు, ఏడి శ్రీనివాస్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ షఫీమియా, డీఈ ఆశీర్వాదం, ప్రధానోపాధ్యాయులు మాధురి, విజయలక్ష్మి, శోభ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సరస్వతి , ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: MLC Kavitha: సమాజాన్ని సరైన బాటలో.. నడిపేదే కవిత్వం!